బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 02:51:45

చికిత్స చేసిన చేతులతోనే చివరి మజిలీకి చేర్చి..

చికిత్స చేసిన చేతులతోనే చివరి మజిలీకి చేర్చి..

  • పెద్దపల్లిలో కరోనా సోకిన రోగి మృతి
  • మృతదేహం తరలింపునకు మున్సిపాలిటీ ట్రాక్టర్‌
  • భయంతో వాహనం నడిపేందుకు డ్రైవర్‌ నిరాకరణ
  • ట్రాక్టర్‌ను శ్మశాన వాటికకు తరలించిన డాక్టర్‌

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ: వైద్యుల మానవత్వాన్ని మరోసారి చాటే గొప్ప సంఘటన ఇది.. డాక్టరే ప్రత్యక్ష దైవం అని ఇంకోసారి తేల్చే సందర్భం ఇది.. స్టెతస్కోప్‌ పట్టి నాడీ చూసే వైద్యుడు ఓ కరోనా రోగి శవాన్ని శ్మశానానికి తరలించేందుకు ట్రాక్టర్‌ స్టీరింగ్‌ పట్టాడు. పెద్దపల్లి పట్టణంలోని తెనుగువాడకు చెందిన 45 ఏండ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఆదివారం పెద్దపల్లి జిల్లా ప్రధాన దవాఖానలో చేరాడు. ఐసోలేషన్‌ వార్డుకు తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో ఆ రోజే ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మృతిచెందాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా మృతుడి కుమారులు, మరో ఇద్దరు కుటుంబసభ్యులు దవాఖానకు వచ్చారు. 

ఇప్పటివరకు జిల్లాకు సంబంధించి కొవిడ్‌ మరణాలన్నీ హైదరాబాద్‌లోనే జరగ్గా, మృతదేహాన్ని తరలించేందుకు అప్పటికప్పుడు ప్రత్యేక వాహనం అందుబాటులో లేకపోయిం ది. అంబులెన్స్‌ను తీసుకురావాలని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చినా రావడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో డీఎంహెచ్‌వో ప్రమోద్‌కు సమాచారం ఇవ్వగా, వైద్యారోగ్యశాఖ జిల్లా సర్వైవ్‌లెన్స్‌ అధికారి డాక్టర్‌ పెండ్యాల శ్రీరామ్‌ను దవాఖానకు పంపారు. మున్సిపల్‌ అధికారులు శవాన్ని తరలించేందుకు ఒక ట్రాక్టర్‌ను ఏర్పాటు చేశారు. అయితే, చనిపోయిన వ్యక్తి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో వాహనం నడిపేందుకు ఆ ట్రాక్టర్‌ డ్రైవర్‌ నిరాకరించాడు. అప్పటికే మధ్యాహ్నం కావస్తుండటంతో వైద్యులు శ్రీవాణి, శిరీష, మమత, స్టాఫ్‌నర్స్‌ శ్యామల సహకారంతో మృతదేహాన్ని ట్రాక్టర్‌లో వేయించిన శ్రీరామ్‌.. తానే డ్రైవర్‌గా అవతారం ఎత్తారు. స్వయంగా ట్రాక్టర్‌ నడుపుకుంటూ శ్మశానవాటికకు తీసుకెళ్లారు. బంధువుల సహకారంతో కొవిడ్‌ నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.

శిరస్సు వంచి నమస్కరిస్తున్నా 

డాక్టర్‌ శ్రీరామ్‌ గారూ.. హృదయపూర్వక అభినందనలు. మనుషుల్లో మానవత్వం బతికే ఉందని నిరూపించారు. మానవత్వంలోనే దైవత్వాన్ని దర్శించుకునేలా చేశారు. కరోనాపై యుద్ధం చేస్తున్న అందరికీ మీరు స్ఫూర్తి. ఈ కష్టకాలంలో ప్రజారోగ్య రక్షణకు పాటుపడుతున్న ప్రతీ ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

- ట్విట్టర్‌లో రాష్ట్ర ఆర్థికమంత్రి టీ హరీశ్‌రావు

ఇది సేవ కాదు.. మా విధి

జిల్లా దవాఖానలో కొవిడ్‌ తొలి మరణం సంభవించడంతో అంత్యక్రియలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలన్న విషయం జిల్లా వైద్యులు, సిబ్బంది, మున్సిపల్‌ సిబ్బందికి తెలియదు. ఇప్పటివరకు అన్ని మరణాలు హైదరాబాద్‌లో జరగ్గా, జీహెచ్‌ఎంసీ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అయితే కొవిడ్‌ మృతుల అంత్యక్రియలు ఆలస్యం చేయవద్దనే నిబంధన ఉంది. డ్రైవర్లు ముందుకురాకపోవడంతో నేనే స్వయంగా డ్రైవింగ్‌ చేస్తూ మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకువెళ్లి అంత్యక్రియలు పూర్తి చేయించా. ఇది సేవ కాదు మా విధి. కరోనా కాలంలో మా వైద్య సిబ్బంది పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. నాకు సహకరించిన వైద్యులు, సిబ్బందికి కృతజ్ఞతలు.

-డాక్టర్‌ పెండ్యాల శ్రీరామ్‌, వైద్యారోగ్య శాఖ సర్వైవ్‌లెన్స్‌ అధికారి


logo