గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 02:59:16

పైసా భారం పడనీయం

పైసా భారం పడనీయం

  • ఖర్చుకు వెనుకాడకుండా బాధితులకు చికిత్స
  • హోం ఐసొలేషన్‌తో  కోలుకుంటున్న 81% మంది
  • వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌
  • కరోనా మొబైల్‌ టెస్టింగ్‌ బస్సులు ప్రారంభం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా సోకినవారికి పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం చికిత్స అందిస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. బాధితుల్లో 81 శాతం మంది ఇంట్లో లేదా దవాఖానల్లోని ఐసొలేషన్‌ వార్డుల్లో చికిత్స పొంది కోలుకుంటున్నారని పేర్కొన్నారు. మిగతావారిలో కేవలం 5 శాతం మందికి మాత్రమే ఐసీయూ చికిత్స అవసరమవుతున్నదని చెప్పారు. వారికి ఖర్చుకు వెనుకాడకుండా ఖరీదైన, ఉత్తమ ఔషధాలను తెప్పించి చికిత్స అందిస్తున్నామని వివరించారు. బుధవారం కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మంత్రి ఈటల పర్యటించారు. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఇంటెలిజెంట్‌ మానిటరింగ్‌ అనాలసిస్‌ సర్వీస్‌ సంస్థ ఏర్పాటుచేసిన టెస్టింగ్‌ మొబైల్‌ బస్సులను ప్రారంభించారు. ల్యాబ్‌లో సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా టెస్టింగ్‌, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌ నిరంతరంగా సాగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 1,100 కేంద్రాల్లో శాంపిళ్లను సేకరిస్తున్నామని, రిటైర్డ్‌ డాక్టర్ల సేవలను వినియోగించుకుంటూ ‘హితం’ యాప్‌ను అందుబాటులోకి తేనున్నట్టు పేర్కొన్నారు. 

81 శాతం మందిలో లక్షణాలు లేవు  

పాజిటివ్‌ వచ్చినవారిలో 81 శాతం మందికి లక్షణాలు కనిపించడం లేదని (అసింప్టమాటిక్‌), వారిని ఇంట్లో లేదా ప్రభుత్వ దవాఖానల్లోని ఐసొలేషన్‌ సెంటర్లలో ఉంచి చికిత్స అందిస్తున్నామని మంత్రి ఈటల పేర్కొన్నారు. జ్వరం, దగ్గు వంటి కరోనా లక్షణాలు కనిపిస్తున్న మిగతా 19 శాతం బాధితులను దవాఖానకు తరలిస్తున్నామని తెలిపారు. వీరిలో 14 శాతం మంది వెంటిలేటర్‌, ఐసీయూ వంటివి అవసరం లేకుండా 10 రోజులు చికిత్స తర్వాత కోలుకొని ఇంటికి వెళ్తున్నారని తెలిపారు. కేవలం 5 శాతం మందికి మాత్రమే కృత్రిమ ఆక్సిజన్‌ సరఫరా, నిరంతర డాక్టర్ల పర్యవేక్షణ, వెంటిలేటర్లు అవసరం పడుతున్నాయని వివరించారు. కంటైన్మెంట్‌ జోన్లు, బస్తీలు, మారుమూల ప్రాంతాల్లో కరోనా టెస్టింగ్‌ మొబైల్‌ బస్సులు సేవలందిస్తాయని ఈటల పేర్కొన్నారు. పరీక్ష చేయించుకున్నవారిలో ఎవరికైనా పాజిటివ్‌ వచ్చి, కరోనా లక్షణాలుంటే అంబులెన్స్‌లో దవాఖానకు తరలిస్తారని చెప్పారు.

పరీక్షా కేంద్రంగా.. ఐసీయూగా..

వెర స్మార్ట్‌ హెల్త్‌ సంస్థ అందజేసిన కరోనా టెస్టింగ్‌ బస్సులను ‘ఇంటెలిజెన్స్‌ మానిటరింగ్‌ అనాలసిస్‌ సర్వీస్‌ క్వారంటైన్‌' (ఐ మాస్క్‌) టెక్నాలజీతో తయారుచేశారు. ఈ వోల్వో బస్సులో ఓవైపు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంతోపాటు మరోవైపు చిన్నపాటి ఐసీయూ సదుపాయాలు ఉన్నాయి. ఒక వెంటిలేటర్‌, నాలుగు పడకలు అమర్చారు. దూర ప్రాంతల్లోని రోగులను సమీపంలోని దవాఖానకు తరలించే వీలుంటుంది. వెర సంస్థ 20 బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఒక్కో బస్సులో 10 శాంపిల్‌ కలెక్షన్‌ కౌంటర్లు ఉంటాయి. 10 మంది టెక్నీషియన్లు పనిచేస్తారు.  బస్సులో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేసే విషయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. బస్సులకు అదనంగా 20 అంబులెన్స్‌లూ ఉం టాయి.  బస్సులు, అంబులెన్స్‌లను ఇచ్చేందుకు ముందుకొచ్చిన వెర సంస్థ సీఈవో ధర్మతేజ, సీవోవో విజయను మంత్రి ఈటల అభినందించారు.


logo