గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 04, 2020 , 16:57:22

కరోనా గాలి ద్వారా వచ్చే వ్యాధి కాదు: హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌

కరోనా గాలి ద్వారా వచ్చే వ్యాధి కాదు: హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌

హైదరాబాద్‌: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌.. హైదరాబాద్‌లో కూడా కలకలం సృష్టిస్తోంది. కాగా, కరోనా వైరస్‌పై సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మొద్దని రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ వివరణ ఇచ్చారు. కరోనాకు సంబంధించి.. వ్యాధి వ్యాప్తి, నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురిచి ఆయన మీడియాతో మాట్లాడుతూ వివరించారు. కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి కాదని ఆయన స్పష్టం చేశారు. కరోనాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా ప్రజలు కరోనా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారనీ.. కానీ, వారిలో కేవలం 3 శాతం మంది మాత్రమే మృత్యువాత పడ్డారనీ, 5 శాతం మందిలో మాత్రమే వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నదని డా. శ్రీనివాస్‌ వెల్లడించారు. కరోనా వైరస్‌తో మరణాల శాతం చాలా తక్కువగా ఉందని ఆయన వివరణ ఇచ్చారు.

వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తి తుమ్మినప్పుడు కానీ, దగ్గినప్పుడు కానీ, మోచేతితో లేదా కర్చీఫ్‌తో కవర్‌ చేసుకోవాలని సూచించారు. వ్యాధికి గురైన వ్యక్తి.. తుమ్మినపుడు 2 మీటర్ల దూరం ఉంటేనే అది సోకే అవకాశం ఉంటుందనీ.. అది కూడా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లకు మాత్రమే వ్యాపిస్తుందని వివరించారు. పలు జాగ్రత్తలు తీసుకుంటే ఈ మహమ్మారిని తరిమేయొచ్చని డా. శ్రీనివాస్‌ వెల్లడించారు.

గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న కరోనా బారిన పడిన వ్యక్తి కోలుకుంటున్నారని ఆయన తెలిపారు. అలాగే, కరోనా సోకిన వ్యక్తి కలిసిన అందరికీ వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా వైరస్‌ నివారణకు సరైన వైద్య చికిత్సలు లేవని డా. శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. కరోనా సోకిన వ్యక్తి.. కలిసిన 45 మంది శాంపిల్స్‌లో నెగెటివ్‌ వచ్చినట్లు ఆయన తెలిపారు. మరో ఇద్దరి శాంపిల్స్‌ ఫలితాలు.. పూణెలోని నేషనల్‌ వైరాలజీకి పంపించామనీ.. ఆ రిపోర్టుల రేపు ఉదయం వస్తాయని ఆయన వెల్లడించారు. 

కరోనాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు..

వ్యాధి సోకిన వ్యక్తి.. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వచ్చిన తుంపర్ల ద్వారా 2 మీటర్ల దగ్గర ఉంటేనే వ్యాధి సోకే అవకాశముంటుందని తెలియజేశారు. పుకార్లు నమ్మకుండా, మీతో పాటు, మీ చుట్టూ ఉన్న వారిని సురక్షితంగా ఉంచండని ఈ సందర్భంగా హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఆస్పత్రుల్లో 3000 మందికి చికిత్స అందించేలా ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నిత్యం పరిశుభ్రంగా ఉండాలనీ.. కరచాలనం చేయకూడదని ఆయన తెలిపారు. ఒక వేళ చేసినా.. వెంటనే హ్యాండ్‌ వాష్‌ చేసుకోవాని ఆయన సూచించారు.


logo