బుధవారం 20 జనవరి 2021
Telangana - Jan 06, 2021 , 02:11:02

గాలిలోనూ కరోనా!

గాలిలోనూ కరోనా!

  • మూడు మీటర్ల వరకు విస్తరణ
  • పది అడుగుల ఎత్తు వరకు వ్యాప్తి
  • పబ్లిక్‌ టాయ్‌లెట్లు, దవాఖానలు.. 
  • క్లోజ్డ్‌ సర్క్యూట్‌ ప్రాంతాలు ప్రమాదకరం
  • సీసీఎంబీ, ఐఎం టెక్‌ పరిశోధనలో వెల్లడి

ప్రత్యేక ప్రతినిధి, జనవరి 5 (నమస్తే తెలంగాణ):  ‘కరోనా రోగి చుట్టూ వైరస్‌ రెండు మూడు మీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. అది గాలిలో కూడా వ్యాపిస్తుంది. మూసి ఉన్న గదులు, ఏసీగదుల్లో వైరస్‌ వేగంగా విస్తరిస్తుంది’ అని హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ), చండీగఢ్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైక్రో బయల్‌ టెక్నాలజీ (ఐ ఎంటెక్‌)  పరిశోధనలలో వెల్లడైంది. పబ్లిక్‌ మరుగుదొడ్లు, దవాఖానలు, ఇరుకైన ప్రాంతాలను వైరస్‌ విస్తరణకు ప్రమాదకరమైన ప్రదేశాలుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. 

గాలిలో వ్యాపిస్తుంది

కరోనా మహమ్మారి గాలిలో కూడా వ్యాపిస్తుందనడానికి ఆధారాలున్నాయని వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధనా సంస్థలు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)కు నివేదించాయి. ఇదే విషయంపై సీఎస్‌ఐఆర్‌ నేతృత్వంలో సీసీఎంబీ, ఐఎం టెక్‌ సంయుక్తంగా మూడు నెలలుగా ‘ఎయిరోసోల్‌ వైరల్‌ ట్రాన్స్‌మిషన్‌'పై పరిశోధన సాగించాయి. హైదరాబాద్‌లో మూడు ప్రముఖ దవాఖానలు, చండీగఢ్‌ లో రద్దీ దవాఖానలను ఇందుకు ఎంచుకున్నాయి. వీరి పరిశోధనలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. రోగులు అధికంగా ఉన్న చోట కరోనా వైరస్‌ గాలిలో వ్యాపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. నోరు, ముక్కు నుంచి వచ్చే తుంపరల ద్వారా వెలువడే వైరస్‌ దుమ్ము, ధూళి కణాలతో కలిసి గాలిలో ప్ర యాణిస్తున్నట్టు వీరు కనుగొన్నారు. రోగికి రెండు నుం చి మూడు మీటర్ల వరకు వైరస్‌ వ్యాప్తి ఉన్నట్టు వారు తెలిపారు. వెంటిలేషన్‌ లేని మూసి ఉన్న గదులలో వైరస్‌ గాలిలో ఉన్నట్టు పేర్కొన్నారు. గాలి, వెలుతురు సరిగా లేని గదులలో రోగి ఎక్కువ సమయం గడిపి వెళ్లిన తరువాత రెండు గంటల వరకు అక్కడ గాలిలో వైరస్‌ ఉన్నట్టు తెలిపారు.  

అప్రమత్తంగా ఉండాలి

గాలిలో వైరస్‌ ప్రభావం కొంత మేరకు ఉన్నది. క్లోజ్డ్‌ గదులు, దవాఖానలు, పబ్లిక్‌ టాయిలెట్లలో గాలిలో వైరస్‌ విస్తరించి న జాడలున్నాయి. ఇటువంటి  ప్రత్యేకమైన ప్రాంతాలలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్క్‌ తప్పనిసరిగా ధరించకపోతే ప్రమాదకరం. కరోనా సోకినట్టు అనుమానాలున్న వ్యక్తులను కుటుంబసభ్యుల నుంచి వేరుగా ఉండాలి.

-రాకేశ్‌ మిశ్రా, సీసీఎంబీ డైరెక్టర్

మాస్క్‌.. సోషల్‌ వ్యాక్సిన్‌

కరోనా వైరస్‌ గాలిలో  వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఉన్నందున  ప్రజ లు అప్రమత్తంగా ఉండా లి. వ్యాక్సిన్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు ప్రతీ ఒక్కరు మాస్క్‌లు ధరించాలి. ప్రస్తుతానికి మాస్క్‌లే ‘సోషల్‌ వ్యాక్సిన్‌'. 

- డాక్టర్‌ సంజీవ్‌ కోస్లా, ఐఎంటెక్‌ డైరెక్టర్‌


logo