గురువారం 02 జూలై 2020
Telangana - Jun 20, 2020 , 18:22:03

ప్రభుత్వ కార్యాలయాలకు కరోనా మార్గదర్శకాలు జారీ

ప్రభుత్వ కార్యాలయాలకు కరోనా మార్గదర్శకాలు జారీ

హైదరాబాద్‌ : సచివాలయంతో సహా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించే విధంగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ సర్క్యులర్‌ మెమోను జారీ చేసింది. సెక్రటేరియట్‌, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా కేసులు నమోదువుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీచేసింది. వారం విడిచి వారం 50 శాతం ఉద్యోగులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, క్లాస్‌-4 ఉద్యోగులు విధులు నిర్వర్తించేలా ఉత్తర్వులు వెలువరించింది. రోజు విడిచి రోజు 50 శాతం మంది క్లర్క్‌ స్థాయి ఉద్యోగులు, సర్య్యులేటింగ్‌ అధికారులు విధులకు హాజరుకావాలని ఆదేశించింది. కాగా సచివాలయంలో ప్రత్యేక ఛాంబర్‌లో ఉన్న అధికారులు రెగ్యులర్‌గా విధులకు హాజరుకావాలంది. 

కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా విధుల్లోలేని ఉద్యోగులు హెడ్‌ క్వార్టర్‌ వదిలివెళ్లొద్దంది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు విధులకు హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొంది. సచివాలయంలో సందర్శకులపై ఆంక్షలు అమలుచేయాలంది. ముందస్తు అనుమతి లేనిదే సందర్శకులను లోపలికి అనుమతించొద్దంది. బీఆర్‌కేఆర్‌ భవన్‌ లిఫ్టుల్లో ఆపరేటర్‌తో పాటు మరో ముగ్గురికి మాత్రమే అనుమతి. బీఆర్‌కేఆర్‌ భవన్‌లో అన్ని ప్రభుత్వ వాహనాల్లో క్రిమిసంహారక మందు చల్లి కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలంది. ఉద్యోగులందరూ విధిగా భౌతికదూరం పాటించాలని సూచనలు చేశారు. మధ్యాహ్న భోజన సమయంతో పాటు ఇతర సమయాల్లో భౌతికదూరం పాటించాలంది. ఉద్యోగులు లంచ్‌బాక్సులు ఇంటి నుంచే తెచ్చుకోవాలంది.

డ్రైవర్లు పార్కింగ్‌ స్థలాల్లో గుమికూడొద్దని సంబంధిత పేషీల్లోనే ఉండాలంది. అధికారుల ఛాంబర్లలో ఏసీలు వాడకూడదు. చాంబర్లలోకి వెలుతురు వచ్చేలా చర్యలు చేపట్టాలి. గర్భిణిలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రభుత్వం అందించిన వెసులుబాటు ప్రకారం సెలవులు తీసుకుని హెడ్‌క్వార్టర్‌ వదిలిపెట్టకుండా ఇళ్లలోనే ఉండాలంది. అత్యవసర సమయాల్లో సేవలిందించడానికి వాళ్లు సిద్ధంగా ఉండాలని పేర్కొంది. కోవిడ్‌ నిబంధనలు ఈ నెల 22 నుంచి జులై 4వ తేదీ వరకు అమలులో ఉండనున్నట్లు వెల్లడించింది.


logo