e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home Top Slides ఇండ్లలోనే గెలిచారు

ఇండ్లలోనే గెలిచారు

ఇండ్లలోనే గెలిచారు
  • పైసా ఖర్చు లేకుండా కరోనా ఖతం
  • సర్కారు మందులతోనే రికవరీ
  • నిత్యం పర్యవేక్షిస్తున్న వైద్య సిబ్బంది
  • ప్రైవేటు వైపు చూడని పల్లె వాసులు
  • ప్రభుత్వ చర్యలను ప్రశంసిస్తున్న జనం

ఆదిలాబాద్‌, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మే 31 (నమస్తే తెలంగాణ)/లింగాపూర్‌: కరోనా అనగానే భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఇచ్చే మందులు వాడితే పైసా ఖర్చు లేకుండా కరోనా నుంచి విముక్తి పొందవచ్చని ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల వాసులు నిరూపించారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని సాంగిడి, తలమడుగు, బరంపూర్‌, రుయ్యాడి గ్రామాల్లోని 234 మంది, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని లింగాపూర్‌లో 600 మంది కరోనా నుంచి బయటపడ్డారు. వీరంతా ప్రభుత్వం అందజేసిన మందుల కిట్‌ వాడి కరోనాను తగ్గించుకున్నారు. కరోనాపై అవగాహనలేని కొందరు భయంతో ప్రైవేట్‌ దవాఖానలకు పోయి రూ.లక్షలు ఖర్చు చేసుకుంటున్నారు. అయినా ప్రాణాలు నిలుస్తాయన్న నమ్మ కం లేకుండాపోయింది. ఇంట్లోనే ఉండి సర్కారు ఇచ్చిన మందులను క్రమంతప్పకుండా వాడుతూ మంచి పౌష్ఠికాహారం తీసుకోవడంతోపాటు విశ్రాంతి పొంది కరోనా నుంచి కోలుకుంటున్నారు. సమస్య తీవ్రంగా ఉన్న వారు మాత్రం ప్రభుత్వ దవాఖానలకు వెళ్లి నయంచేసుకుంటున్నారు. ఇలా వందల మంది కరోనాను తరిమికొడుతున్నారు.

ఆదర్శం ఈ గ్రామాలు
ఆదిలాబాద్‌ జిల్లాలోని బేల మండలం సాంగిడిలో 32 మంది వైరస్‌ బారినపడ్డారు. ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లో తలమడుగులో 101 మంది, బరంపూర్‌లో 48 మంది, రుయ్యాడిలో 53 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఈ మూడు గ్రామాల్లోని 202 కేసుల్లో 172 మందికి సెకండ్‌ వేవ్‌లో పాజిటివ్‌ వచ్చింది. మార్చి చివరి, ఏప్రిల్‌ మొదటి వారంలో టెస్టులు చేసిన వైద్యులు వైరస్‌ సోకిన వారిని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించారు. బేల మండలం సాంగిడి మహారాష్ట్ర సరిహద్దున ఉండటంతో గ్రామ శివారులో కంచె వేసి పక్కరాష్ట్రం నుంచి రాకపోకలు నిషేదించారు.

సర్కారు కిట్లతోనే..
ఆదిలాబాద్‌ జిల్లాలో పాజిటివ్‌ వచ్చి, ఆరోగ్య పరిస్థితి బాగాలేని వారికి రిమ్స్‌లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నది. ఆదిలాబాద్‌లో 9 ప్రైవేట్‌ దవాఖానల్లోనూ కొవిడ్‌కు చికిత్స అందిస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని తలమడుగు, బరంపూర్‌, రుయ్యాడి, సాంగిడి గ్రామాలకు చెందిన 234 మంది ప్రైవేటు దవాఖానలకు వెళ్లకుండానే ఇండ్లల్లో, పంటపొలాల్లో వసతులు ఏర్పాటుచేసుకొని అక్కడే ఉంటూ సర్కారు వైద్యులు ఇచ్చిన మందులు వాడి వైరస్‌ను తరిమికొట్టారు. వైద్యులు, సిబ్బంది తీసుకుంటున్న చొరవను పల్లె ప్రజలు ప్రశంసిస్తున్నారు.

కోరానాను జయించిన లింగాపూర్‌
కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని లింగాపూర్‌ గ్రామం కరోనాను జయించింది. ఇంటి నుంచి కాలు కూడా బయట పెట్టకుండానే సర్కారు అందించిన మందులతోనే 600 మంది కోలుకున్నారు. లింగాపూర్‌ జనాభా 2,354. ఏప్రిల్‌లో హోలీ సందర్భంగా ఇక్కడ లెంగీ అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచేగాకుండా మహారాష్ట్ర నుంచి కూడా గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారం రోజుల తర్వాత వారికి పాజిటివ్‌ రావడం మొదలైంది. రోజుకు 50 నుంచి 100 కేసుల దాకా నమోదు కావడంతో ఆందోళన నెలకొన్నది. అప్రమత్తమైన గ్రామస్థులు స్వీయ నిర్బంధం ప్రకటించుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఇంటింటికీ వెళ్లి మందులు పంపిణీ చేశారు. ఏ మాత్రం అధైర్య పడకుండా ఇంట్లోనే ఉండి పౌష్ఠికాహారం, మందులు తీసుకొని పూర్తిగా రికవరీ అయ్యారు. దవాఖానలకు వెళ్లకుండా 30 రోజుల్లోనే పూర్తిగా కోలుకుని ఆదర్శంగా నిలిచారు.

కోలుకోవడం కష్టమనుకున్నాం..
మా ఊరిలో ఇంటికొకరికి కరోనా వచ్చింది. కోలుకోవడం కష్టమనుకున్నాం. కేసులు పెరగడంతో ముందుగా మా ఊరిలో లాక్‌డౌన్‌ విధించుకున్నాం. ఎవరినీ రానీయలేదు. బయటకు పోనీయలేదు. ప్రభుత్వ వైద్యులు వచ్చి మందులు ఇచ్చారు. రోజూ పౌష్ఠికాహారం తీసుకున్నాం. ఒక్కరం కూడా దవాఖానలకు పోలేదు. మా జాగ్రత్తలే మమ్మల్ని రక్షించాయి.

జాదవ్‌ రాజేశ్‌, లింగాపూర్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌

సర్కారు మందులతోనే నయమైంది..
నేను సర్కారు మందులతోనే కోలుకున్న. వైద్య సిబ్బంది రోజూ వచ్చి ఆరోగ్యమెట్లున్నదని అడిగి తెలుసుకున్నరు. లాక్‌డౌన్‌ కూడా మంచిగ పన్జేసింది. మహారాష్ట్ర నుంచి ఎవరూ రాకుండా గ్రామ సరిహద్దులనే కంచె ఏర్పాటు చేసుకున్నం. గ్రామంలో 32 మందికి పాజిటివ్‌ వస్తే ఏ ఒక్కరూ ప్రైవేట్‌ దవాఖాన దిక్కు సూడలె. ఇంట్లోనే ఉండి అందరం కోలుకున్నాం.

-కన్నల సుమన్‌బాయి, సాంగిడి సర్పంచ్‌, మం:బేల, ఆదిలాబాద్‌

మేమిచ్చిన మందులే పనిజేసినయ్‌..
తలమడుగు మండలం రుయ్యాడి, బరంపూర్‌, తలమడుగులో మొదటి, రెండో దశల్లో 202 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన కరోనా కిట్లు వాడి, తగిన జాగ్రత్తలు తీసుకుంటే తగ్గుతుందని అందరికీ చెప్పాం. హోం ఐసొలేషన్‌లో ఉండేలా ప్రోత్సహించాం. వారి ఇళ్లకు వెళ్లి బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నాం. మేమిచ్చిన మందులే మంచిగ పనిచేశాయని అంటుంటే ఎంతో సంతోషంగా ఉన్నది.

రాహుల్‌, వైద్యాధికారి, తలమడుగు పీహెచ్‌సీ, జిల్లా ఆదిలాబాద్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇండ్లలోనే గెలిచారు

ట్రెండింగ్‌

Advertisement