శనివారం 16 జనవరి 2021
Telangana - Nov 28, 2020 , 01:33:10

కరోనా తొలి టీకా తెలంగాణకే దక్కాలి

కరోనా తొలి టీకా తెలంగాణకే దక్కాలి

  • ఈ గడ్డపై రూపొందుతున్న టీకా..
  • తొలి ఫలితం ఇక్కడి ప్రజలకే ఇవ్వాలి
  • దానిని ప్రధాని మోదీ ప్రకటించాలి
  • వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల డిమాండ్‌
  • ప్రపంచ టీకాల ఉత్పత్తి కేంద్రంగా నగరం
  • ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా సిటీ ఇక్కడే
  • పరిశ్రమల కోసం భూములిచ్చిన రైతులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారికి విరుగుడుగా భారత్‌ బయోటెక్‌లో తయారవుతున్న వ్యాక్సిన్‌ను మందుగా తెలంగాణ ప్రజలకే ఇవ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రధాని నరేంద్రమోదీని డిమాండ్‌ చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ తెలంగాణలో తయారుకావటం గర్వకారణమన్నారు. తెలంగాణ గడ్డ మీద వ్యాక్సిన్‌ తయారవుతున్నదన్న ఆయన.. ఆ ఫలితం ఇక్కడి ప్రజలకు ముందుగా అందించాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఇక్కడి ప్రజలకు సరిపోయేన్ని డోసులను ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. కరోనా భయం పూర్తిగా పోవాలంటే వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గం కాబట్టి ప్రజలందరికీ అతి త్వరలో వ్యాక్సిన్‌ అందేలా చూడాలని ప్రధానిని ఈటల కోరారు. 

వందకుపైగా దేశాలకు ఔషధాలు.. వ్యాక్సిన్లు

వందకు పైగా దేశాలకు ఔషధాలు, వ్యాక్సిన్లను హైదరాబాద్‌ సరఫరా చేస్తున్నది. ప్రపంచ ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. కరోనాకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో సైతం హైదరాబాద్‌లో ఉన్న భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌-ఈ, తదితర కంపెనీలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. ఈ స్థాయికి నగరం చేరటంలో ఎన్నో ఏండ్ల శ్రమ దాగున్నది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న విధానాలు ఇందుకు దోహదం చేశాయి. కంపెనీల కోసం పేద ప్రజలు భూములు ఇచ్చారు. వారికి వ్యాక్సిన్‌ ఫలితం ముందుగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. 

తుది దశలో భారత్‌ బయోటెక్‌ టీకా

కరోనాకు వ్యాక్సిన్‌ కనుగొనేందుకు ప్రపంచంలో వందకు పైగా ఫార్మాకంపెనీలు ఎనలేని కృషి చేస్తున్నాయి. మన దేశంలో హైదరాబాద్‌ నుంచి వ్యాక్సిన్‌ అభివృద్ధికి భారత్‌ బయోటెక్‌ చేస్తున్న కృషి తుదిదశకు చేరుకున్నది. ఇప్పటికే మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతుండగా, వచ్చే రెండుమూణ్ణెళ్లలో పూర్తి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానున్నది. ఫార్మారంగానికి తెలంగాణ చూపిన చొరవకు కృతజ్ఞతగా, ప్రపంచానికి కరోనా నుంచి విముక్తి కల్పిస్తున్న సందర్భంగా.. తొలి వ్యాక్సిన్‌ను తమకే ఇవ్వాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు.