సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Aug 21, 2020 , 00:44:33

‘అపెక్స్‌'కు కరోనా ఎఫెక్ట్‌

‘అపెక్స్‌'కు కరోనా ఎఫెక్ట్‌

  • కేంద్రమంత్రి షెకావత్‌కు పాజిటివ్‌
  • 25 నాటి కౌన్సిల్‌ భేటీపై సందిగ్ధత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలుగు రాష్ర్టాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జల్‌శక్తి తలపెట్టిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహణపై కరోనా నీడలు కమ్ముకున్నాయి. కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్మోహన్‌రెడ్డి పాల్గొనే అపెక్స్‌ సమావేశాన్ని ఈ నెల 25న నిర్వహించాలని కేంద్రం ఇప్పటికే ఖరారు చేసింది. కేంద్ర నిర్ణయాన్ని సీఎం కేసీఆర్‌ స్వాగతించారు. కరోనా నేపథ్యంలో సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే జరుగనున్నది. తాజాగా కేంద్ర మంత్రి షెకావత్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని గురువారం ఆయనే స్వయంగా ట్విట్టర్‌లో ప్రకటించారు. వైద్యుల సలహామేరకు దవాఖానలో చేరినట్టు చెప్పారు. దీంతో ఈ నెల 25 నాటి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరుగుతుందా? లేదా? అనే చర్చ మొదలైంది. షెకావత్‌ దవాఖానలో చేరిన దరిమిలా కనీసం 14రోజులపాటు ఐసొలేషన్‌లో ఉండాలని ఇప్పటికే వైద్యులు సూచిస్తున్నారు. సమావేశ నిర్వహణకు ఇంకా 4 రోజులే ఉన్నది. వాస్తవానికి ఆన్‌లైన్‌లోనే ఈ సమావేశం జరుగనున్నప్పటికీ.. ఐసొలేషన్‌లో ఉండే షెకావత్‌ పాల్గొంటారా? అనేది తేలాలి. సమావేశ నిర్వహణపై జల్‌శక్తి అధికారికంగా వెలువరించే ప్రకటనపై ఉత్కంఠ నెలకొన్నది.