మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 16:05:18

కరోనా ఎఫెక్ట్‌.. భారీగా పడిపోయిన మద్యం అమ్మకాలు

కరోనా ఎఫెక్ట్‌.. భారీగా పడిపోయిన మద్యం అమ్మకాలు

హైదరాబాద్‌ : మాయదారి కరోనా వైరస్‌ అన్ని వ్యాపారాలను కుదేలు చేస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌, మార్కెటింగ్‌, ఆహార ఉత్పత్తి వ్యాపారాలు తీవ్రంగా నష్టపోయాయి. తాజాగా ఆ కోవలోకి లిక్కర్‌ బిజినెస్‌ కూడా వచ్చి చేరింది.  లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో మద్యం దుకాణాలు పూర్తిగా బంద్‌ పాటించాయి. ఆ తరువాత లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా మద్యం దుకాణాల ఓపెన్‌కు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఓ నాలుగు రోజులు మద్యం కోసం జనం ఎగబడ్డారు. దుకాణాల ఎదుట బారులుతీరి మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా మద్యం కొనుగోలు చేశారు.

ఆ తరువాత నెమ్మదిగా విక్రయాలు తగ్గాయి. లాక్‌డౌన్‌ ఉన్నప్పుడు మందు కోసం గోల చేసినవారు ఇప్పుడు అటువైపు కూడా చూడడం లేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మందుబాబులు వైన్స్‌కు వెళ్లాలంటే జంకుతున్నారు. గతంతో పోల్చుకుంటే రాష్ట్రంలో 44 శాతం బీర్ల అమ్మకాలు పడిపోయాయి.  లిక్కర్‌దీ అదే పరిస్థితి. గతేడాది జూన్‌ 1నుంచి17 వరకు రాష్ట్రంలో 30.20లక్షల కేసుల బీర్లు అమ్ముడయితే.. ఈ ఏడాది జూన్‌లో ఇప్పటివరకు కేవలం 17లక్షల కేసుల బీర్లు మాత్రమే విక్రయించినట్లు ఎక్సైజ్‌ శాఖ తెలియజేసింది. మద్యం అమ్మకాలు భారీగా పడిపోయాయని దీంతో ఆదాయం కూడా సగానికి పడిపోయిందని వైన్స్‌ నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. 


logo