గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 01:46:31

రూ.3.5 వేల మందు 40 వేలకు!

రూ.3.5 వేల మందు 40 వేలకు!

  • కరోనా మందుల బ్లాక్‌దందా
  • అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు 
  • రూ.35.55 లక్షల మందులు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా మందుల బ్లాక్‌మార్కెట్‌ దందా గుట్టురట్టయింది. కరోనా చికిత్సకు ఉపయోగించే రూ.3,500 విలువైన యాంటీ వైరల్‌ మందులను బ్లాక్‌మార్కెట్‌లో రూ.40 వేలకు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా పట్టుబడింది. వారినుంచి రూ. 35.55 లక్షల విలువైన మందులను సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌.. టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ చక్రవర్తితో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. కరోనా చికిత్సలో యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ రెమిడిసివిర్‌, యాక్టిమెరా, ఫ్యాబిఫ్లూ తదితర మందులకు మంచి డిమాండ్‌ ఉన్నది. సికింద్రాబాద్‌కు చెందిన కే వెంకట సుబ్రహ్మణ్యం అలియాస్‌ ఫణి మల్కాజిగిరిలో శ్రీమెడిక్యూర్‌ ప్రొడక్ట్స్‌ (ఓపీసీ) ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో మెడిసిన్‌ వ్యాపారం చేస్తున్నాడు. 

అతనితోపాటు ముషీరాబాద్‌కు చెందిన సంతోష్‌కుమార్‌, కిశోర్‌, ఫీల్‌ఖానకు చెందిన మహ్మద్‌ షకీర్‌, నారాయణగూడకు చెందిన రాహుల్‌ అగర్వాల్‌, ఢిల్లీకి చెందిన గగన్‌ కురాన, తలాబ్‌కట్టకు చెందిన సైఫ్‌ అలీ మహ్మద్‌, సైదాబాద్‌కు చెందిన ఫిర్దోస్‌ మహ్మద్‌ ముఠాగా ఏర్పడ్డారు. అంతా మెడికల్‌ ఫీల్డ్‌కు చెందినవారు కావడంతో మందులను సులువుగా బ్లాక్‌మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఫణి సంగారెడ్డిలో మందులను కొనుగోలు చేస్తుండగా.. అతని నుంచి చేతులు మారుతున్నాయి. ఒక్కో స్టేజీలో మూడు నాలుగువేల లాభం చూసుకుంటూ రూ.3,500 విలువైన మందును చివరకు రోగులకు రూ.30 వేల నుంచి రూ.40 వేలకు అమ్ముతున్నారు. 

ఈ మందు లు దవాఖానల్లోనే విక్రయించాలనే నిబంధన ఉన్నది. కానీ, వాటిని ఉల్లంఘిస్తున్నారు. సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌ బృందం.. చాదర్‌ఘాట్‌ పోలీసులతో కలిసి మంగళవారం ఈ ముఠాను పట్టుకున్న ది. వారినుంచి రూ.35.55 లక్షల మందు లు, కరోనా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు, రూ.50 వేల నగదు, ఎనిమిది సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నది. మరోవైపు, రెమిడిసివిర్‌ మందును రూ.64 వేలకు అమ్మిన పంజాగుట్టకు చెం దిన మహ్మద్‌ సిద్దిఖీని మంగళవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు.

తాజావార్తలు


logo