శనివారం 06 జూన్ 2020
Telangana - May 14, 2020 , 01:35:52

తల్లిపాలతో కరోనా సోకదు

తల్లిపాలతో కరోనా సోకదు

  • గాంధీ వైద్యుల వెల్లడి
  • మరో కరోనా గర్భిణికి పురుడుపోసిన డాక్టర్లు
  • గాంధీ గైనకాలజీ విభాగం వెల్లడి 
  • గాంధీలో మరో కరోనా గర్భిణికి పురుడు
  • మగ శిశువు జననం.. తల్లీబిడ్డ క్షేమం

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ తల్లిపాలను తాకడంలేదు. కొవిడ్‌-19 బాధిత గర్భిణులు ప్రసవించిన శిశువులకు పాజిటివ్‌ రావడంలేదని గాంధీ దవాఖాన గైనకాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్‌ మహాలక్ష్మి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, డాక్టర్‌ అనిత వెల్లడించారు. బుధవారం మరో కరోనా పాజిటివ్‌ గర్భిణి మగబిడ్డకు జన్మనిచ్చిందని, బిడ్డకు వైరస్‌ సోకలేదని తెలిపారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్టు చెప్పారు. పాజిటివ్‌ సోకిన తల్లిపాలలో కొవిడ్‌-19 వైరస్‌ ఉండదని, ఆ తల్లి పాలను బిడ్డకు పట్టవచ్చని పేర్కొన్నారు. వైరస్‌ గ్రంథుల నుంచి స్రవించే ద్రవాల్లో మాత్రమే.. అంటే చెమట, లాలాజలం వంటి వాటిలోనే ఉంటుందని డాక్టర్‌ అనిత తెలిపారు. గర్భస్థ శిశువుకుగానీ లేదా ప్లజెంటా (మాయ) ట్రాన్స్‌మిషన్‌కుగాని వైర స్‌ ఉన్నట్టు నిర్ధారణ కాలేదని చెప్పారు. ప్రసవ సమయంలో జాగ్రత్తగా ఉండాలని, ఇది పేషెంట్‌తోపాటు వైద్యసిబ్బందికి పెద్ద చాలెంజ్‌ అని చెప్పారు. ఏ మాత్రం ఏమరపాటు జరిగినా బిడ్డకు వైరస్‌సోకే ప్రమాదం ఉం టుందన్నారు. పాజిటివ్‌ గర్భిణికి జన్మించే శిశువుకు కరోనాసోకే అవకాశం ఒక్కశాతమేనని తేల్చిచెప్పారు.

మరో ఎనిమిదిమందికి చికిత్స

గాంధీలో మొత్తం 10 మంది గర్భిణులు చికిత్స పొం దుతున్నారు. వీరిలో ఇద్దరికి ప్రసవమైంది. పుట్టిన ఇద్దరు పిల్లలకు కరోనా సోకలేదు. రెండ్రోజుల కిందట పాతబస్తీ బహుదూర్‌పురాకు చెందిన మరో గర్భిణి ప్రసవం కోసం పేట్లబుర్జు ప్రసూతి దవాఖానకు వెళ్లగా, అక్కడ కరోనా అని తేలడంతో గాంధీకి తరలించారు. గర్భిణికి అధిక రక్తపోటుతోపాటు ఇది 6వ ప్రసవం. అయినా బుధవారం ప్రొఫెసర్‌ షర్మిల, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రాణి బృందం శస్త్రచికిత్సచేయగా.. మగబిడ్డ జన్మనిచ్చింది. మరో ఎనిమిది మందికి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. 

 తల్లీబిడ్డ భౌతికదూరం పాటించాలి

కరోనా పాజిటివ్‌ సోకిన తల్లి పాలలో కొవిడ్‌-19వైరస్‌ ఏమాత్రం ఉండదు. ఆ తల్లి పాలను బిడ్డకు పట్టవచ్చు. కానీ భౌతికదూరం పాటించాలి. మాతాశిశువుల మధ్య దూరం అనేది చాలా ముఖ్యం. అందుకే తల్లికి నెగెటివ్‌ వచ్చే వరకు తల్లీబిడ్డను వేర్వేరుగా పెడుతాం. 

- డాక్టర్‌ మహాలక్ష్మి, గైనకాలజీ విభాగాధిపతి, గాంధీ దవాఖాన


logo