శనివారం 04 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 02:18:22

నిర్లక్ష్యం.. ప్రాణాంతకం

నిర్లక్ష్యం.. ప్రాణాంతకం

 • మాటువేసి కాటేస్తున్న కరోనా మహమ్మారి
 • కొంపముంచుతున్న ‘నాకేమైతది’ అనే అశ్రద్ధ
 • ఆదమరిస్తే మూల్యం తప్పదన్న నిపుణులు
 • జాగ్రత్త, స్వీయనియంత్రణే కరోనాకు మందు
 • భౌతికదూరం, ముఖానికి మాస్క్‌ తప్పనిసరి
 • విందులు, వినోదాలకు దూరంగా ఉండాలి
 • చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవాలి
 • గుంపులు కూడవద్దు.. బైక్‌పై ఒక్కరే వెళ్లాలి

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నా, ప్రాణాలు గాలిలో కలుస్తున్నా కొందరి చెవికెక్కడంలేదు. భౌతికదూరం పాటించాలంటూ ప్రభుత్వం ఎంత చెప్పినా మార్పు రావడంలేదు. యథేచ్ఛగా లాక్‌డౌన్‌ నిబంధనలను తుంగలోతొక్కుతున్నారు. మృగశిర కార్తె నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌ రాంనగర్‌ చేపల మార్కెట్‌లో కనిపించిన జనసందోహం కరోనా పట్ల వారికి ఉన్న నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. 

మాస్క్‌ పెట్టుకోను! భౌతికదూరం పాటించను!శానిటైజరూ ఉపయోగించను.. నాకేమైతది.. అనే నిర్లక్ష్యం నేడు ప్రాణాంతకంగా మారుతున్నది. కరోనా సోకితే తనతోపాటు కుటుంబసభ్యులకు, తోటివారికి ముప్పని తెలిసినా ఖాతరుచేయకపోవడం కొంపముంచుతున్నది. వైరస్‌ వ్యాప్తికీ కారణమవుతున్నది. కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.


హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నాకేమవుతుంది అనే నిర్లక్ష్యమే కరోనా రూపంలో నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నది. లాక్‌డౌన్‌ సడలింపులతో భౌతికదూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా ఆదమరిచి ప్రవర్తించడంతో మూల్యం చెల్లించుకోక తప్పడంలేదు. కరోనాను తేలిగ్గా తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. కొందరు అశ్రద్ధగా విందులు, వినోదాలతో చిందులేస్తూ వైరస్‌ను ఆహ్వానిస్తున్నారు. 

ఫలితంగా ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. జూదమాడుతూ, పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటూ, నిర్లక్ష్యంగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, ద్విచక్రవాహనాలపై ముగ్గురు, నలుగురు ప్రయాణిస్తూ, పదేండ్లలోపు పిల్లలను తీసుకొని యథేచ్ఛగా తిరుగుతూ, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు బయటకు వస్తూ, గుంపులు గుంపులుగా చేరుతూ.. ఇలా ఎంతోమంది తెలిసీతెలియక కరోనా వ్యాప్తికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకులవుతున్నారు. దీంతో వైరస్‌ రోజురోజుకు చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్నది. అనూహ్యంగా పెరుగుతున్న కేసులు సామాజిక వ్యాప్తి రేఖను దాటే పరిస్థితి నెలకొన్నది. వారం క్రితంవరకు తక్కువ కేసులు నమోదవడం వల్ల వైద్యులు రోగులకు చికిత్సచేయడం సులభంగా ఉండేది. 

కానీ కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో చికిత్స అందించడం కష్టంగా మారుతున్నది. లాక్‌డౌన్‌లో కొంత అదుపులో ఉన్న కరోనా వ్యాప్తి సడలింపులతో కోరలు చాస్తున్నది. నిర్లక్ష్యంగా విహరిస్తున్నవారిని వైరస్‌ మాటేసి మరీ కాటేస్తున్నది. భౌతికదూరం పాటించాలి, మాస్కులు ధరించాలి, శానిటైజర్‌ను వాడాలనే కనీస జాగ్రత్తలను కూడా విస్మరిస్తుండటంతో కరోనాకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్రంలో వెయ్యిలోపు ఉన్న కేసులు కేవలం నెలరోజుల్లోనే మూడు రెట్లు పెరుగడం ఆందోళన కలిగిస్తున్నది. కోటి జనాభా గల గ్రేటర్‌ హైదరాబాద్‌లో మొన్నటివరకు పదుల సంఖ్యల్లో నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య నేడు మూడంకెలను దాటుతున్నది. 

మార్కెట్లను చూస్తే, కరోనా కేంద్రాలుగా కనిపిస్తున్నాయి. ముట్టుకుంటే అంటుకొనే రోగాన్ని మరిచి ప్రవర్తిస్తూ అనారోగ్యాన్ని కోరితెచ్చుకోవడమే కాకుండా, వారి కుటుంబసభ్యులు, ఇరుగూ పొరుగువారికీ అంటిస్తూ వాహకాలుగా మారారు. రోడ్లు, మార్కెట్లు, రైతుబజార్లు, కిరాణా, మటన్‌, చికెన్‌ షాపులు ఇలా చాలాచోట్ల భౌతికదూరం ఇసుమంతైనా కనిపించడంలేదు. మాస్క్‌ ఉన్నా దానిని కిందకు పెట్టి మాట్లాడుతూ అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది గుట్కా, పాన్‌ వంటివి నములూతూ ఇష్టానుసారంగా రోడ్లపైనే ఉమ్మేస్తున్నారు. ఇలా కనీస నిబంధనలు పాటించని ప్రజలను చూసి వైద్యులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు.

నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యాలు

హైదరాబాద్‌ పాతబస్తీలోని జియాగూడ ఉదంతాన్ని పరిశీలిస్తే అక్కడి నిర్లక్ష్యం వల్ల పరిసర ప్రాంతాలతోపాటు రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి, పహాడీషరీఫ్‌, శంషాబాద్‌, షాద్‌నగర్‌, తదితర ప్రాంతాల వరకు వైరస్‌ విస్తరించి సుమారు 500 మందికి సోకింది. పదుల సంఖ్యలో ప్రాణాలు బలిగొన్నది. ఒక్క జియాగూడలోనే దాదాపు 200 వరకు కేసులు నమోదయ్యాయి. మే నెలలో బోరబండకు చెందిన ఓ వ్యక్తి నాకేమైతది అనే నిర్లక్ష్యంతో జియాగూడలోని తన బంధువు ఇంటికి వెళ్లి అక్కడినుంచి పహడీషరీఫ్‌లోని మరో బంధువు ఇంట్లో విందుకు హాజరయ్యారు. ఈ వేడుకలో సుమారు 50 మందికిపైగా పాల్గొన్నారు. ఈ ఉదంతంలో ముందుగా బోరబండకు చెందిన వ్యక్తికి తీవ్ర జ్వరం రావడంతో అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో అతడి ప్రైమరీ కాంటాక్ట్‌లపై కూపీ లాగడంతో బోరబండ, యూసుఫ్‌గూడ, పహాడీషరీఫ్‌, శంకర్‌పల్లి, శంషాబాద్‌, షాద్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో సుమారు 79 మందికి వైరస్‌ వ్యాప్తి చెందింది. ఇలాంటి ఉదంతాలు ఎన్నో.

పాటించాల్సిన నియమాలు

 • గుంపులుగా ఉండకూడదు. భౌతికదూరం పాటించాలి.
 • ముఖానికి మాస్క్‌ తప్పనిసరి.
 • మార్కెట్లు, అంగళ్లలో అప్రమత్తంగా ఉండాలి.
 • ఏటీఎంలలో డబ్బు డ్రా చేశాక చేతులు కడుక్కోవాలి.  
 • బార్బర్‌ షాపులు, బ్యూటీపార్లర్లలో జాగ్రతగా ఉండాలి.
 • బయటకి వెళ్లి వచ్చినప్పుడు కాళ్లు, చేతులు కడుక్కోవాలి.
 • కరోనా అనుమానితులు ఎదురైతే స్నానంచేయాలి.
 • చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకపోవడం మంచిది.
 • దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు అప్రమత్తంగా ఉండాలి. 
 • బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయరాదు.
 • సాధ్యమైనంత వరకు డిజిటల్‌ లావాదేవీలే ఉత్తమం.
 • కరచాలనం చేయకూడదు. సమస్కారం శ్రేయస్కరం.
 • అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దు.
 • పెండ్లిళ్లు, విందులు, వినోదాలకు దూరంగా ఉండాలి. 
 • కేకులు కట్‌చేసి తినడం, చేతుల ద్వారా పరస్పరం స్వీట్లు పంచడం చేయకూడదు.
 • సాధ్యమైనంత వరకు షాపింగ్‌కు దూరంగా ఉండాలి.

వానకాలం మరింత జాగ్రత్త

ఒకరి నిర్లక్ష్యం వల్ల వందల మందికి వైరస్‌ సోకే ప్రమాదం ఉంటుంది. నిమ్స్‌లోని కార్డియాలజీ విభాగంలో అదే జరిగింది. దవాఖాన మొత్తంలో ప్రతి ఒక్కరిని ఎంతో జాగ్రత్తగా స్క్రీన్‌ చేసినప్పటికీ ఎవరో ఒకరి నిర్లక్ష్యమో, అవగాహనా లోపమో దాదాపు 22 మంది వరకు వైరస్‌ బారినపడ్డారు.వానకాలం, చలి కాలం మధ్య వైరస్‌ మరోసారి విజృంభించి ‘పీక్‌ స్టేజి’కి చేరే అవకాశముంటుంది. వైరస్‌ ప్రభావం పీక్‌ స్టేజి నుంచి ఫ్లాట్‌ స్టేజికి చేరుకొని డౌన్‌స్టేజికి రావాల్సి ఉంటుంది. అప్పుడే దాని ప్రభావం తగ్గుతుంది.

- పరంజ్యోతి, నిమ్స్‌  పల్మనాలజీ విభాగాధిపతి

నియమాలు పాటిస్తే కరోనా కట్టడి

కరోనా అనేది గాలి ద్వారా రాదు. వైరస్‌ ఉన్నవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు నోటినుంచి వచ్చే తుంపర్లద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ తుంపర్లు ఎదుటివారి నోట్లోకి, ముక్కులోకి, కండ్లల్లోకి పోతేనే వైరస్‌ సోకుతుంది. భౌతికదూరం, ముఖానికి మాస్కు ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకొంటే వైరస్‌ మన దరిచేరదు. 

- రాజారావు, సూపరింటెండెంట్‌, గాంధీ దవాఖాన

రెండునెలలు కీలకం 

వచ్చే రెండునెలల్లో కరోనా కేసులు భారీస్థాయిలో పెరిగే అవకాశాలున్నాయి. క్రమశిక్షణ, వ్యక్తిగత దూరం పాటించకపోవడంతో  ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉన్నది. తెలంగాణలో మరణాల రేటు తక్కువగా ఉండడం ఆశాజనకమైన పరిణామం. కేసు లు పెరిగే కొద్ది వైద్య సదుపాయాలు సమృద్ధిగా అందించలేం.

- రాకేశ్‌మిశ్రా, సీసీఎంబీ డైరెక్టర్‌

వారంలో కేసులు ఇలా..

జూన్ ‌1
94
జూన్ 2
99
జూన్ 3 
129
జూన్ 4
127
జూన్ 5
143
జూన్ 6 
206
జూన్ 7
154


logo