బుధవారం 03 జూన్ 2020
Telangana - May 01, 2020 , 01:28:47

దేశ సగటు కంటే మెరుగు

దేశ సగటు కంటే మెరుగు

  • రాష్ట్రంలో పక్కా వ్యూహంతో పాజిటివ్‌ కేసుల గుర్తింపు 
  • ఐసీఎమ్మార్‌ నిబంధనల మేరకే వైరస్‌ నిర్ధారణ పరీక్షలు
  • ప్రతిపక్షాలది అశాస్త్రీయవాదన

కరోనా నిర్ధారణ పరీక్షలనేవి ఆయా దేశాలు, రాష్ర్టాల శక్తి సామర్థ్యాలు, కీర్తిని చాటుకునేందుకు కాదు. వైరస్‌ వ్యాప్తి సరళి ఆధారంగా పరీక్షలు నిర్వహిస్తారు. దేశంలోని రాష్ర్టాల మధ్యనే కాదు, ప్రపంచంలోని దేశాల మధ్య కూడా పరీక్షలు నిర్వహించే తీరులో, సంఖ్యలో వైరుధ్యం కనిపిస్తుంది. ఒక్కో పరీక్షకే ప్రస్తుతం కొన్ని గంటల సమయం పడుతున్నది. ఈ పరిస్థితుల్లో అనుమానితులను కాకుండా అందరికీ గుండుగుత్తగా పరీక్షలు చేసుకుంటూపోతే, ఆ సమయంలో వైరస్‌ వ్యాప్తికి తలుపులు తెరిచినట్టే. అందుకే ప్రభుత్వం వైరస్‌ వాహకుల గొలుసును గుర్తించి పరీక్షలు చేస్తూ పాజిటివ్‌లను గుర్తిస్తున్నది. లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలుచేస్తూ సామాజికవ్యాప్తికి అడ్డుకట్ట వేసింది. ఫలితంగా రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచ దేశాలకు కరోనా మహమ్మారి వంటి విపత్తును ఎదుర్కొన్న అనుభవంలేదు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పక్కావ్యూహంతో అనుమానితులకే పరీక్షలు చేసి ఎక్కువ ఫలితం సాధిస్తున్నది. ఐసీఎమ్మార్‌(ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) నిబంధనల ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రంలో 19,200 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 1,038 (5.3శాతం) మం దికి పాజిటివ్‌ వచ్చింది. పక్కనే ఉన్న ఏపీలో 94,558 మందికి పరీక్షలుచేస్తే 1,403 (1.4 శాతం) మందికి పాటిజివ్‌ వచ్చింది. గుజరాత్‌లో 59,488మందికి పరీక్షలు చేసి 4,395 (7.3శాతం) మందికి, మహారాష్ట్రలో 1,35, 694 మందిని పరీక్షించి 9,915 (7.3 శాతం)మందికి పాజిటివ్‌గా తేల్చారు. దేశవ్యాప్తంగా 8,30,201 మందిని పరీక్షిస్తే 34,007(4.1శాతం)మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సరైనఅంచనాతో పాజిటివ్‌ కేసులను గుర్తించడంలో దేశసగటు కంటే రాష్ట్రసగటే ఎక్కువగా ఉన్నది. కరోనా బాధితుల డిశ్చార్జిరేటు తెలంగాణలో 33.69శాతం, ఏపీలో 19.21శాతం ఉన్న ది. ప్రభుత్వం పక్కాగా వైరస్‌ను కట్టడి చేస్తుంటే, ప్రతిపక్షాలు అవగాహనలేమితో తక్కువపరీక్షలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నాయి. 

ప్రయాణ చరిత్ర ఉన్నవాళ్లకు పరీక్షలు

మర్కజ్‌ లింకుతోనే వైరస్‌ వ్యాప్తి జరిగిందని గుర్తించిన ప్రభుత్వం పక్కావ్యూహంతో అనుమానితులను వెతికిపట్టుకొంటున్నది. ఈ లింకు పై దేశం మొత్తాన్ని అప్రమత్తం చేసిన ఘనత రాష్ర్టానిదే. విదేశాల నుంచి రాష్ర్టానికి వచ్చిన 25,937 మందిలో 32 మందికి, వారిని కలిసిన 918 మందిలో 18 మందికి పాజిటివ్‌గా నిర్ధారణఅయింది. మర్కజ్‌ వెళ్లివచ్చిన 1,345 మందిలో 240 మందికి పాజిటివ్‌గా తేలగా,  వారిని కలిసిన 3,193 మందిలో 560 మందికి వైరస్‌ సోకింది. ఈ మధ్య కొందరికి లక్షణాల్లేకున్నా పాజిటివ్‌గా నమోదుకావడంతో ప్రభు త్వం మరోఅడుగుముందుకేసి.. ట్రావెల్‌ హిస్టరీ, అత్యవసరసేవల్లో ఉన్నవారికి.. పరిస్థితులను బ ట్టి నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. 

డిశ్చార్జి రేటులోనూ మెరుగు

పాజిటివ్‌ కేసులకు చికిత్స అందించి సంతోషంగా ఇంటికి పంపడంలో తెలంగాణ ప్రభు త్వం మెరుగైన సేవలు అందిస్తున్నది. దేశ సరాసరి కంటే తెలంగాణ సరాసరి ఎక్కువగా ఉన్న ది. ఏపీలో డిశ్చార్జి రేటు 19.21 శాతం ఉండగా, తెలంగాణలో 33.69 శాతం ఉన్నది. అస్సాం-73.68%, బీహార్‌-16.07%, ఢిల్లీ-30.12%, గుజరాత్‌-8.14%, కర్ణాటక-36.44%, కేరళ-73.73%, మహారాష్ట్ర-11.70%, మధ్యప్రదేశ్‌-12.96%, రాజస్థాన్‌-29.40% ఉండగా దేశ సరాసరి 30.65 శాతంగా ఉన్నది. 

పరీక్షలపై ఐసీఎమ్మార్‌ మార్గదర్శకాలు 

14రోజుల్లోపు అంతర్జాతీయ ప్రయాణాల చరిత్ర ఉన్నవారికి, వైరస్‌ లక్షణాలు ఉన్నట్టు నిర్ధారయితే, తీవ్ర జ్వరం, జలుబు, శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉంటే, వైరస్‌ సోకిన వ్యక్తితో నేరుగా కాంటాక్టులోకి వెళ్లిన వ్యక్తికి లక్షణాలు లేనప్పటికీ పరీక్షలుచేయాలి. 

డబ్ల్యూహెచ్‌వో సూచనల్లో కీలకమైనవి 

ఎవరికైనా కరోనా లక్షణాలున్నట్టు గుర్తిస్తే పరీక్షలు చేయాలి. పాజిటివ్‌వస్తే ఐసొలేషన్‌లో ఉం చాలి. ఎంతమంది కాంటాక్టులోకి వెళ్లారో గుర్తిం చి, పరీక్షలు నిర్వహించాలి. అనుమానం లేనివారిని 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచాలి. 

మనదగ్గరే తక్కువ మరణాలు

అమెరికా వంటి దేశాల్లో భారీ ఎత్తున పరీక్షలు నిర్వహించారు. అయినప్పటికీ అక్కడ మరణాల రేటు ఎక్కువగానే ఉంది. భారత్‌సహా మరికొన్ని దేశాలు ముందుగా అప్రమత్తమై లాక్‌డౌన్‌ విధించడంతో పరీక్షలు తక్కువ సంఖ్యలో చేసినప్పటికీ మరణాలు నియంత్రణలో ఉన్నాయి.


దేశం 
పాజిటివ్‌ కేసులు 
మరణాలు (రేటు)
అమెరికా
10,73,463
62,257 (30%)
స్పెయిన్
2,39,639
24,543 (15%)
ఇటలీ
2,05,463
27,967 (27%)
ఫ్రాన్స్‌
1,66,420
24,087 (33%)
రష్యా
82,862
4,633 (6%)
ఇరాన్‌
94,640
6,028 (7%)
పాకిస్థాన్
16,117 
4,105 (8%)
ఇండియా
24,162
1075 (4.4%)logo