మంగళవారం 26 మే 2020
Telangana - May 15, 2020 , 01:29:05

కరోనా మరణాలు 2శాతమే

కరోనా మరణాలు 2శాతమే

  • వయసుల వారీగా మరణాలు
  • 1,414 మంది బాధితుల్లో 34 మందే మృతి
  • కొత్తగా 47 పాజిటివ్‌ కేసులు నమోదు
  • 13 మంది డిశ్చార్జి.. 428 మందికి చికిత్స
  • సూర్యాపేట, వికారాబాద్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌ వైరల్‌ ఫ్రీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా బారిన పడి మరణిస్తున్నవారి సంఖ్య అతి తక్కువగా ఉన్నది. ప్రభుత్వం అప్రమత్త చర్యలు, గాంధీ దవాఖానలో వైద్యులు అందిస్తున్న ప్రత్యేక సేవల కారణంగా బాధితులు అధిక సంఖ్యలో కోలుకొంటున్నారు. రాష్ట్రంలో నమోదైన కేసుల ప్రకారం మృతులు 2శాతమే ఉన్నారు. గురువారం వరకు 1,414 మందికి వైరస్‌ సోకగా, వీరిలో 34 మంది మరణించారు. వీరిలో పురుషులు 27 మంది, మహిళలు ఏడుగురు ఉన్నారు.  కరోనా మృతులను వయసులవారీగా పరిశీలిస్తే.. 9 ఏండ్లలోపు చిన్నారి ఒకరు ఉండగా, 30-39 ఏండ్ల మధ్య ఒకరు, 40-49 ఏండ్ల మధ్య ఐదుగురు ఉన్నారు. 50-59 ఏండ్ల మధ్య 9 మంది, 60-69 మధ్య ఏడుగురు, 70-79 ఏండ్ల మధ్య 9 మంది, 80-89 ఏండ్ల మధ్యవారు ఇద్దరు ఉన్నట్టు వైద్యశాఖ పేర్కొన్నది. కాగా, గురువారం కొత్తగా 47 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

 ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 40 మంది, రంగారెడ్డి జిల్లాలో ఐదుగురు, వలస కార్మికులు ఇద్దరు ఉన్నారు. ఇప్పటివరకు 952 మంది డిశ్చార్జి అయ్యారు. 428 మంది చికిత్స పొందుతున్నట్టు ప్రజారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. కరోనా చికిత్స కోసం దాతలు ఇస్తున్న ప్లాస్మా కాలపరిమితి 6 నెలలని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు. దాతలు ఇచ్చిన ప్లాస్మా వృథాకాదని, అవసరమైనవారికి ప్లాస్మా థెరపీ చేసేందుకు మైనస్‌ 90 డిగ్రీల వద్ద భద్రపరుస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 15 మంది దాతలు ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు వివరించారు.

కరోనా ఫ్రీ జిల్లాలు మరో నాలుగు

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు హైదరాబాద్‌ తర్వాత అత్యధిక సంఖ్యలో నమోదైన సూర్యాపేట జిల్లాతోపాటు వికారాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌ వైరస్‌ ఫ్రీగా మారాయి. ఇక్కడ వైరస్‌ సోకినవారందరూ కోలుకొని డిశ్చార్జి కావడంతో యాక్టివ్‌ కేసులు జీరో అయ్యాయి. సూర్యాపేట జిల్లాలో ఏప్రిల్‌ 2న తొలి పాజిటివ్‌ నమోదు కాగా, 21 రోజుల్లో బాధితుల సంఖ్య 83కు చేరిన విషయం తెలిసిందే. వారంతా గాంధీ దవాఖానలో చికిత్స పొందగా, బుధవారం నాటికి 70 మంది డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 13 మంది గురువారం ఇండ్లకు చేరుకున్నారు. జిల్లా సాధారణ స్థితికి చేరుకున్నది. హోం క్వారంటైన్లలో ఉన్న 6,509 మంది గడువు కూడా త్వరలోనే ముగియనున్నది. 

24 రో జులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. వికారాబాద్‌ జిల్లాలో నమోదైన 38 కేసుల్లో 65 ఏండ్ల వృద్ధుడు మృతి చెందగా, మిగిలిన 37 మంది కోలుకొని ఇంటికి చేరుకొన్నారు. గత నెల 20 నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఆదిలాబాద్‌ జిల్లాలో 21 మందికి కరోనా సోకగా, అందరూ  డిశ్చార్జి అయ్యారు. నిర్మల్‌ జిల్లాలోనూ 20 మందికి వైరస్‌ సోకగా, మరో ముగ్గురు మృతి చెందారు. పాజిటివ్‌ వచ్చిన 20 మంది గాంధీలో చికిత్స పొంది కోలుకొన్నారు. గత నెల 24 నుంచి కొత్త కేసులు నమోదు కాలేదు. దీంతో జిల్లా గ్రీన్‌జోన్‌గా మారనున్నది.


రాష్ట్రంలో కేసుల వివరాలు

వివరాలు
గురువారం
మొత్తం 
పాజిటివ్‌కేసులు
47 1,414  
కోలుకున్న/డిశ్చార్జి అయినవారు
13952
మరణాలు
-34
చికిత్స పొందుతున్నవారు
-428


logo