శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 23, 2020 , 01:33:14

పుట్టగొడుగులతో కరోనా ఖతం!

పుట్టగొడుగులతో కరోనా ఖతం!

  • రోగనిరోధక శక్తిని పెంచే ‘కరోనాయిడ్‌'ను రూపొందించిన సీసీఎంబీ
  • డిసెంబర్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం l  వైరస్‌ విరుగుడు పరిశోధనల్లో కీలక అడుగు

కరోనాకు మందు లేదు.. వ్యాక్సిన్‌ అంతకన్నా లేదు..  విటమిన్లు, గుడ్లు, చికెన్‌ వంటి పౌష్ఠికాహారంతోనే రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ వైరస్‌పై పోరాడుతున్నాం. అవి తినే కరోనాను జయిస్తామన్న పూర్తి నమ్మకం లేదు. ఈ సందర్భంలో.. వైరస్‌ను దీటుగా ఎదుర్కొని, దాన్ని ఛిన్నా భిన్నం చేసే ఆహార పదార్థాన్ని సీసీఎంబీ శాస్త్రవేత్తలు తయారుచేశారు. కరోనాను 

ఖతం చేసే ఈ ఇమ్యూనిటీ బూస్టర్‌కు ‘కరోనాయిడ్‌' అని పేరుపెట్టారు.

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా భరతం పట్టాలని యావత్తు ప్రపంచం కసిగా ఉన్నది. దేశాలన్నీ వ్యాక్సిన్‌ తయారీలో బిజీగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు టీకాను తీసుకొద్దామా! ఈ మహమ్మారి మరణాన్ని ఎప్పుడు శాసిద్దామా! అని ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీసీఎంబీ-హైదరాబాద్‌ గొప్ప వార్తను అందించింది. కొవిడ్‌-19ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి కలిగిన ఆహార పదార్థాన్ని తయారుచేసినట్టు ప్రకటించింది. కరోనాయిడ్‌ పేరుతో డిసెంబర్‌ నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. సీసీఎంబీ సహకారంతో నడుస్తున్న క్లోన్‌ డీల్స్‌ అనే స్టార్టప్‌.. హిమాలయాల్లో దొరికే  కార్డిసెప్స్‌ మిలిటరిస్‌ అనే పుట్టగొడుగుల నుంచి దీన్ని అభివృద్ధి చేసినట్టు వెల్లడించింది. పుట్టగొడుగుల్లోని కార్టిసెఫిన్‌, పసుపులోని కర్క్యూమిన్‌ సమ్మేళనంతో తయారు చేసిన కరోనాయిడ్‌లో అనేక పోషక విలువలున్నాయని, ఇది యాంటీవైరల్‌గా, ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు. కొవిడ్‌-19 కణాల అభివృద్ధిని ఇది సమర్థంగా అడ్డుకొంటుందని, డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ గొలుసుల తయారీని అడ్డుకొంటుందని తెలిపారు. క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం అనుమతికి దరఖాస్తు చేసుకున్న క్లోన్‌డీల్స్‌.. ఇప్పటికే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ అనుమతులు తీసుకున్నది.  కరోనాయిడ్‌ ఫార్ములేషన్‌పై నాగపూర్‌, ముంబై, భోపాల్‌లోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ సెంటర్లలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నది. ఈ సందర్భంగా సీసీఎంబీ డైరెక్టర్‌  డాక్టర్‌ రాకేశ్‌మిశ్రా గురువారం మీడియాతో  మాట్లాడుతూ స్వదేశీ సహజ ఉత్పత్తులను ఉపయోగించి విలువైన పదార్థాల తయారీకి అంకుర పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. అటు..  వ్యాక్సిన్‌ అభివృద్ధిలో భాగంగా సీసీఎంబీ శాస్త్రవేత్తలు ప్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్ట్‌ను తయారుచేసేందుకు సిద్ధమయ్యారు. ‘అరబిందో ఫార్మా’ భాగస్వామ్యంతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయనున్నారు.

మూడో దశలోకి  భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్‌ మూడోదశ ట్రయల్స్‌కు డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) గురువారం అనుమతిచ్చింది. దీంతో  మూడోదశ ప్రయోగాల్లో భాగంగా సుమారు 28వేల మందికి డోస్‌ ఇవ్వనున్నారు.  28 రోజుల్లో రెండు సార్లు  వాక్సిన్‌ను ఇచ్చి పరీక్షించనున్నారు. వచ్చే నెలలో ట్రయల్స్‌ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.