సోమవారం 25 మే 2020
Telangana - Apr 02, 2020 , 21:23:46

నిర్మల్‌ జిల్లాలో కరోనాపై కట్టుదిట్టం

నిర్మల్‌ జిల్లాలో కరోనాపై కట్టుదిట్టం

నిర్మల్ : నిర్మల్‌ జిల్లాలో కరోనా నియంత్రణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇటీవల ఢిల్లీలోని మల్కజ్‌కు వెళ్లి వచ్చిన నిర్మల్‌లోని జవహార్‌లాల్‌నగర్‌కు చెందిన ఒకరు కరోనా అనుమానిత లక్షణాలతో మార్చి 30న గాంధీ దవాఖానలో  చేరాడు. చికిత్స నిర్వహిస్తుండగా బుధవారం చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. కరోనా నిర్ధారణ నివేదిక రావాల్సి ఉండగానే ఆయన మృతి చెందడంతో జిల్లా అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. శుక్రవారం నుంచి సోమవారం వరకు నాలుగు రోజుల పాటు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ పారూఖీ నిర్ణయించారు. అంబులెన్స్‌లు, నిత్యావసర వాహనాలు తప్ప ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు అనుమతి లేదు. పట్టణంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో మార్కెట్‌ను పూర్తిగా మూసివేశారు. 

వేర్వేరు ప్రదేశంలో మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వైద్య బృందాలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. పట్టణంలోని అన్ని వీధులను హైపోక్లోరైడ్‌ నీటితో శుభ్రం చేస్తున్నారు. సదరు వ్యక్తి విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రాగా.. హైదరాబాద్‌ నుంచి నిర్మల్‌కు కారులో ముగ్గురు వ్యక్తులతో కలిసి వచ్చారు. వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉంచిన వారందరినీ తొలుత చికిత్స చేసిన ఆర్‌ఎంపీ వివరాలు తీసుకొని రక్తనమూనాలు సేకరించారు. జవహార్‌నగర్‌ పరిధిలోని అర కిలోమీటరు వరకు 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. జవహర్‌నగర్‌ వార్డుల్లో ప్రజలు బయటకు రాకుండా ఇండ్లను సీజ్‌ చేశారు. పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. వీరికి నిత్యావసర సరుకులు, రేషన్‌ బియ్యం ఇంటి వద్దనే అందించనున్నారు. logo