శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 03, 2020 , 01:12:51

ఎక్కడి ప్రాజెక్టుకు అక్కడే కూలీలు

ఎక్కడి ప్రాజెక్టుకు అక్కడే కూలీలు

  • ఇతర ప్రాంతాల నుంచి కూలీలు రావొద్దు
  • కరోనా నియంత్రణ చర్యలు పాటించాలి
  • మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, కార్మికుల భద్రత కోసం పలు మార్గదర్శకాలను జారీచేసింది. కేంద్రం ప్రకటించిన తాజా మార్గదర్శకాలను అనుగుణంగా నిర్మాణ పనులకు అనుమతి ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిచింది. వలస కూలీలు ఉన్న నిర్మాణ సైట్ల లో పనులు చేపట్టే క్రమంలో అనుసరించాల్సిన విధానాలను మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ శనివారం విడుదలచేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సైట్లలో పనిచేస్తున్న కూలీలను కొనసాగించాలని, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొనిరావొద్దని స్పష్టంచేశారు. 

ఇవీ మార్గదర్శకాలు

నిర్మాణ స్థలాల దగ్గర నిత్యం తప్పనిసరిగా థర్మల్‌ స్క్రీనింగ్‌ చేపట్టాలి. క్ల్లినిక్‌ ఏర్పాటుచేసి వైద్యులతో తనిఖీచేయించాలి. నిర్ణీత దూరం పాటించాలి. మాస్కు, గ్లవ్స్‌ ధరించాలి. నీరు, సబ్బు, శానిటైజర్‌ ఏర్పాటుచేయాలి. గుట్కా, పాన్‌, ఉమ్మి వేయటం నిషేధం. నిర్దేశిత ప్రాం తాల్లో భోజనాలు పెట్టాలి. పనిప్రదేశంలో, లేబర్‌ క్యాంపు, క్యాంటీన్లు, మరుగుదొడ్ల్లు, ప్రవేశమార్గాల్లో, శానిటైజ్‌ చేయాలి. పని ప్రాంతానికి బయటి వ్యక్తులు, హెడ్డాఫీస్‌ స్టాఫ్‌, కన్సల్టెంట్లను రాకుండా చూడాలి. కార్మికులను బయటికి అనుమతించవద్దు. నిర్మాణ స్థలాలకు దగ్గర్లోని దవాఖానలు, కరోనా చికిత్స అందించే క్లినిక్‌ల జాబితాను ప్రదర్శించాలి. కూలీలకు, వారి కుటుంబసభ్యులకు గుర్తింపుకార్డులు ఇవ్వాలి. కూలీలు వస్తువులను ఇచ్చిపుచ్చుకోవడం నిషేధం. పనిముట్లు, మిషన్ల డోర్‌ హ్యాండి ల్స్‌, నిర్మాణ పరికరాలను క్రిమిసంహారక రసాయనాలతో శుభ్రంచేయాలి. ప్రభుత్వ నియమావళిని తెలుగుతోపాటు కూలీలకు అర్థమయ్యే భాషల్లో ప్రచురించి ఇవ్వాలి. బయటికి సామగ్రి తరలించే కూలీలు ధరించిన గ్లవ్స్‌ను, ఉపకరణాలను మరొకరు ముట్టుకోవద్దు. లాక్‌డౌన్‌ తర్వాత ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొచ్చినా, వారికి పరీక్షలు చేయించాలి.


logo