మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 03:08:52

అప్రమత్తతతోనే కరోనా నియంత్రణ

అప్రమత్తతతోనే కరోనా నియంత్రణ
  • మంత్రి ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేరళలో కొత్తగా ఐదు కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సంబంధిత విభాగాలను ఆదేశించారు. హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతి దవాఖానను మంత్రి ఆదివారం సందర్శించా రు. దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఆయా దవాఖానల్లో ఏర్పాటుచేస్తున్న ఐసోలేషన్‌ వార్డులను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. ఛాతి దవాఖానలో 55 పడకల ఐసోలేషన్‌ వార్డును రెండురోజుల్లో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఇటీవల కేరళ రాష్ర్టాన్ని సందర్శించిన దవాఖాన సూపరింటెండెంట్‌ మహబూబ్‌ఖాన్‌తో అక్కడి ఉష్ణోగ్రతలు, వైరస్‌ వ్యాప్తి గురించి అడిగి తెలుసుకున్నారు. ముందస్తుచర్యల్లో భాగంగా జిల్లాకేంద్రాల్లో కూడా ఐసోలేషన్‌ వార్డులను సిద్ధం చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. అనంతరం ప్రైవేటు దవాఖానాల్లో ప్రదర్శించేందుకు కరోనా మార్గదర్శకాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ కే చంద్రశేఖర్‌రావు, చీఫ్‌ ఇంజినీర్‌ లక్ష్మారెడ్డి, ఆర్‌ఎంఓలు వినోద్‌, పుష్ప తదితరులు పాల్గొన్నారు.  


గాంధీలో 17మందికి  కరోనా పరీక్షలు

విదేశాలకు వెళ్లివచ్చిన 17మందికి ముందుజాగ్రత్త చర్యగా ఆదివారం గాంధీ దవాఖానలో కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం వీరిని ఐసోలేషన్‌వార్డులో వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. పరీక్షల రిపోర్టులు సోమవారం వస్తాయని దవాఖాన అధికారులు తెలిపారు. కాగా ఇప్పటికే ఐసోలేషన్‌వార్డులో ఉన్న 19మంది అనుమానితులకు సంబంధించిన మెడికల్‌ రిపోర్టుల్లో నెగెటివ్‌ రావడంతో వారిని శనివారం డిశ్చార్జ్‌ చేసినట్లు వైద్యాధికారులు చెప్పారు.


 


logo