సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 02:45:56

కరోనాకు..అంతమెప్పుడు?

కరోనాకు..అంతమెప్పుడు?

  • ప్రపంచ దేశాల అనుభవాలు చెప్తున్నదేంటి?
  • పలు దేశాల్లో 3 నెలల్లో గరిష్ఠస్థాయికి
  • నాలుగైదు నెలల్లో కేసుల తగ్గుముఖం
  • శాస్త్రీయ విధానాలతో వైరస్‌కు పగ్గం
  • బాధ్యతగా వ్యవహరించిన ప్రజలు
  • అమెరికా మాత్రం ఇంకా అల్లకల్లోలమే
  • భారత్‌లో లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత భారీ సంఖ్యలో పెరిగిన కేసులు
  • జాగ్రత్తగా ఉంటే నవంబర్‌ తర్వాత కేసులు తగ్గేందుకు ఆస్కారం!

లోకమంతా అల్లకల్లోలం చేసిన విశ్వమారికి అంతమెప్పుడు? కరోనా విశృంఖలత్వం ఇంకెంతకాలం? నిన్నమొన్నటి దాకా అతలాకుతలమైన దేశాలు ఇప్పుడు ఎలా తేరుకొంటున్నాయి? మనదేశంలో మాత్రం ఎందుకింత విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతున్నది? మన నెత్తినెక్కి స్వైరవిహారం చేస్తున్న వైరస్‌.. ఈ ఏడాది చివరికైనా మనల్ని వదిలిపెడుతుందా? పలు దేశాల్లో ఉచ్ఛస్థితికి చేరుకోవటానికి 2 నుంచి 3 నెలలు పడితే.. అక్కడి నుంచి తగ్గుముఖం పట్టడానికి మరో నాలుగైదు నెలలు తీసుకున్నది. యూరప్‌ దేశాల్లోనూ ఈ ఉదాహరణలు ఉన్నాయి. అక్కడ కేసులు గణనీయంగా తగ్గిపోవడానికి.. మన దేశంలో అనూహ్యంగా పెరిగిపోవడానికి కారణాలేమిటి? దీని నుంచి విముక్తి ఇంకెప్పుడు? సాధారణ జీవితం గడిపేదెన్నడు? ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిని తొలుస్తున్న ప్రశ్నలివి. వీటికి సమాధానమేమిటి?  

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మానవాళికి పెను సవాలు విసిరిన కరోనా మహమ్మారి ప్రపంచంలోని అగ్రరాజ్యాలన్నింటికీ గర్వభంగంచేసింది. ఆరు నెలల నుంచి అమెరికాను చిగురుటాకులా వణికిస్తున్నది.  చాలా దేశాల్లో మాత్రం ఈ మహమ్మారి ఉచ్ఛస్థితి ముగిసిపోయింది. వైరస్‌ వ్యాప్తి గణనీయంగా తగ్గుముఖం పట్టిందని తాజా గణాంకాలే చెప్తున్నాయి. వైరస్‌ బయటపడిన కొత్తలో నిర్లక్ష్యంగా ఉన్న ఇటలీ, స్పెయి న్‌, బ్రిటన్‌ తదితర దేశాల్లో వేలసంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొద్దిరోజులుగా ఈ దేశాల్లో కొత్తకేసులు వందల్లోకి పడిపోయా యి. కరోనా పుట్టినిల్లు చైనాలో కూడా కేసులు సింగిల్‌ డిజిట్‌ స్థాయికి పడిపోయాయి. మరణా లు కూడా తగ్గాయి. వైరస్‌ వ్యాప్తి ప్రారంభంలో ఎంతో జాగ్రత్తగా ఉన్న భారత్‌లో.. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత కరోనా విజృంభించింది. కొద్దిరోజుల్లో వైరస్‌ వ్యాప్తి ఉచ్ఛస్థితికి చేరవచ్చని నిపుణులంటున్నారు. తర్వాత తగ్గుముఖం పట్టడానికి ఎంతకాలం పడుతుందనేది ప్రశ్నార్థకమైంది. 

యూరప్‌లో ఇలా..

గతేడాది డిసెంబర్‌లో చైనాలో బయటపడిన కొవిడ్‌-19 చికిత్సావిధానం, జాగ్రత్తల గురించి అవగాహన లేకపోవటంతో మెరుపు వేగంతో వైరస్‌ వ్యాపించింది. ఇది కూడా మామూలు వైరస్సే అన్న భావనతో యూరప్‌, అమెరికా నిర్లక్ష్యం వహించాయి. ఇటలీ, స్పెయిన్‌, బ్రిటన్‌ దేశాల్లో జనవరి 31నే మొదటి కరోనా కేసు నమోదు అయ్యింది. ఆ తర్వాత ఇటలీలో మార్చి 21, స్పెయిన్‌లో మార్చి 26, బ్రిటన్‌లో ఏప్రిల్‌ 10న అత్యధిక కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన తర్వాత అతి తక్కువ కేసులు ఇటలీలో జూలై 3న, స్పెయిన్‌లో జూన్‌ 29, బ్రిటన్‌లో జూలై 3న నమోదయ్యాయి. ఫ్రాన్స్‌లో జనవరి 24న మొదటి కరోనా కేసు నమోదుకాగా ఒక రోజు అత్యధిక కేసులు మార్చి 31న నమోదయ్యాయి. అతి తక్కువ కేసులు మే 23న నమోదు అయిన తర్వాత మళ్లీ వైరస్‌ వ్యాప్తి స్వల్పంగా పెరిగింది. జర్మనీలో జనవరి 27న మొదటి కేసు నమోదుకాగా, మార్చి 27 నాటికి ఉచ్ఛస్థితికి చేరింది. జూన్‌ 28న అతి తక్కువ కేసులు నమోదు అయ్యి మళ్లీ స్వల్పంగా పెరుగుతున్నాయి. ఈ దేశాలు వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు అనేక శాస్త్రీయ విధానాలు అవలంబించటంతో త్వరగా కోలుకున్నాయి. వేలల్లో కేసులు వందల్లోకి వచ్చాయి. తొలికేసు నమోదైన తర్వాత కనిష్ఠంగా 50 రోజుల నుంచి గరిష్ఠంగా 70 రోజుల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఉచ్ఛస్థితికి చేరుకున్నది. ఆ తర్వాత తగ్గుముఖం పడుతున్నది. 

భారత్‌లో ఉచ్ఛస్థితి చేరినట్టేనా?

ప్రస్తుతం మనదేశంలో కరోనా వ్యాప్తి ఉచ్ఛస్థితికి చేరుకొంటున్నదని నిపుణులు చెప్తున్నారు. దేశంలో ఇప్పటివరకు 6.51 లక్షల కేసులు నమోదు కాగా, 18,600 పైగా మరణాలు సంభవించాయి. తొలి కరోనా కేసు జనవరి 30న నమోదు కాగా, మార్చి 30 నాటికి రోజూ 227 కేసులు నమోదయ్యాయి. మే 4 నాటికి ఏకంగా రోజూ 4 వేలకు చేరుకున్నది. జూన్‌ 7 నాటికి రోజూ పదివేలు, 27 నాటికి రోజూ 20 వేల కేసులకు చేరుకోగా.. జూలై 6న 24,248 కేసులు నమోదయ్యాయి. ఈ డాటా ప్రకారం దేశంలో వైరస్‌ వ్యాప్తి ఉచ్ఛస్థితికి చేరుకునే సమయం వచ్చిందని వైద్య నిపుణులు అంటున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో వ్యాప్తి ఇలాగే కొనసాగి సెప్టెంబర్‌ నుంచి తగ్గుముఖం పట్టొచ్చని భావిస్తున్నారు. దేశంలో వైరస్‌ వ్యాప్తి వేగం పెరిగినప్పటికీ మరణాల సంఖ్య తక్కువగా ఉండటం సానుకూల పరిణామమని అంటున్నారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వం నిర్దేశించిన కొవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. 

స్వీయ జాగ్రత్తలే శ్రీరామరక్ష

ప్రస్తుతానికి కరోనా బారి నుంచి కాపాడుకోవడానికి అప్రమత్తతే మందు. భౌతికదూరం పాటించడం, శానిటైజర్ల వినియోగం, మాస్కులు ధరించడం వంటివి మాత్రమే రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వైరస్‌కు తొందరగా ప్రభావితమయ్యే చిన్న పిల్లలు, వయోవృద్ధులను ఇండ్లు కదలనివ్వకుండా.. ఎవరితోనూ కాంటాక్ట్‌ కాకుండా అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టిన దేశాలను పరిశీలిస్తే.. ఒక్కో దేశంలో ఒక్కో రకమైన వ్యూహాన్ని అమలు చేశారు. పీక్‌ స్టేజ్‌లో కేసులు నమోదవుతున్న వేళ మన దేశంలోనూ అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆ మూడింటితోనే అంతం


రోగనిరోధక శక్తి: సగానికి పైగా జనాభాలో వైరస్‌ను ఎదురించగలిగే ప్రతిరక్షకాలు ఉత్పత్తి అయితే హెర్డ్‌ ఇమ్యూనిటీ లేదా సమూహ రోగనిరోధక శక్తి సాధ్యమవుతుంది. ఇప్పటివరకు జరిగిన పరిశోధనల్లో చాలామందికి కరోనా వైరస్‌ సోకి వారికి తెలియకుండానే వ్యాధి తగ్గినట్లు తేలింది. అలాంటివారిలో బలమైన ప్రతిరక్షకాలు ఉత్పత్తి అయి ఉంటాయి. దీంతోపాటు కరోనా సోకి, చికిత్స పొంది బయటపడిన వారిలోనూ ప్రతిరక్షకాలు ఉంటాయి. 

వ్యాక్సిన్‌: వైరస్‌కు ప్రతి రక్షకాలను ఉత్పత్తిచేసే వ్యాక్సిన్‌ను అభివృద్ధిచేసేందుకు శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు. 70% మందికి వ్యాక్సిన్‌ వేయగలిగితే కరోనాను జయించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ, ఈ వ్యాక్సిన్‌ రావడానికి కనీసం ఎనిమిది నెలలైనా పట్టొచ్చు. అనంతరం కోట్ల సంఖ్యలో డోసులను ఉత్పత్తిచేసి ప్రపంచానికి అందించడానికి మరో నాలుగైదు నెలల సమయం పట్టొచ్చు. 


సొంతంగానే అంతం: ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ మాత్రం కరోనా వైరస్‌ సొంతంగానే అంతమవుతుందని చెప్తున్నది. గతంలో సార్స్‌ వచ్చినప్పుడు ప్రపంచం ఉలిక్కిపడింది. టీకా తయారు చేసేందుకు ప్రయత్నాలూ జరిగాయి. కానీ, వైరస్‌ జన్యుపరంగా బలహీనపడి మనుషుల మీద ప్రభావం చూపించలేని స్థితికి చేరింది. దీంతో క్రమంగా వైరస్‌ మాయమైంది. కరోనా ఇప్పటికే అనేక ఉత్పరివర్తనాలకు లోనయిందని.. కొన్ని చోట్ల బలహీనపడిందంటున్నారు. దీంతో వైరస్‌ తనంత తానే అంతమవుతుందని భావిస్తున్నారు.

హెర్డ్‌ ఇమ్యూనిటీతోనే తగ్గుముఖం

మన దేశంలో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కానీ లెవల్‌ ఆఫ్‌ ఇన్‌ఫెక్షన్‌ తక్కువగా ఉన్నది. రికవరీ వేగంగా పెరుగుతున్నది. మన దేశంలో రోగనిరోధకశక్తి క్రమంగా అభివృద్ధి చెందుతున్నది. ఈ సమయంలోనే వ్యాధి ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులను కాపాడుకోవాలి. యూకే వంటి దేశాల్లో జనసాంద్రత తక్కువ కాబట్టి భౌతిక దూరం పాటించడం సులువైంది. మనకు మాత్రం ఎస్‌ఎంఎస్‌ -సోషల్‌ డిస్టెన్స్‌, మాస్క్‌, శానిటైజేషన్‌ ఎంతో ముఖ్యం. మొన్నటివరకు 80-90% హెర్డ్‌ ఇమ్యూనిటీ కావాలని అనుకున్నారు..కానీ ఇప్పుడు 50-60% వరకు అయినా చాలని భావిస్తున్నారు. 

- డాక్టర్‌ అమరేశ్‌రావు మాలెంపాటి, కార్డియోథొరాసిక్‌ సర్జన్‌, నిమ్స్‌ దవాఖాన

జాగ్రత్తగా ఉండాల్సిన సమయం

మన దేశంలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. వ్యాప్తి వేగం పెరిగే అవకాశం లేకపోలేదు. ఇలాంటి సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. విటమిన్‌ డీ లోపం లేనివారిలో కరోను తట్టుకునే సామర్థ్యం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తెలుస్తున్నది. అందుకే ప్రతి ఒక్కరు సామర్థ్యం పెంచుకునేందుకు ప్రయత్నించాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. అవసరమైతేనే ఇంటినుంచి బయటికి వెళ్లాలి.నిర్లక్ష్యం ప్రదర్శించడం ప్రమాదకరం.

-డాక్టర్‌ కే మధుమోహన్‌ రావు, నిమ్స్‌ ఆర్‌అండ్‌డీ విభాగం హెడ్‌


యూరప్‌ కరోనా చిత్రం


మొదటి కేసు
ఉచ్ఛస్థితి
అతి తక్కువ కేసులు
ఉచ్ఛస్థితికి పట్టిన రోజులు
ఇటలీ
జనవరి 31
మార్చి 21
జూలై 3
50
స్పెయిన్‌
జనవరి 31
మార్చి 26
జూన్‌ 29
55
బ్రిటన్‌
జనవరి 31
ఏప్రిల్‌ 10
జూలై 3
70
ఫ్రాన్స్‌
జనవరి 24
మార్చి 31
మే 23
64
జర్మనీ
జనవరి 27
మార్చి 27
జూన్‌ 28
59
ఇండియా
జనవరి 30
జూలై 3
--
--logo