గురువారం 09 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 03:03:40

బడికి పోతామా?

బడికి పోతామా?

  • 2 నెలల్లో కరోనా తగ్గదా? లేకుంటే పరిస్థితేంటి?
  • జీరో అకడమిక్‌ ఇయర్‌ చేస్తారా? సాధ్యమా?
  • కరోనా తగ్గితే స్కూళ్లకు.. తల్లిదండ్రుల మాట
  • దేశవ్యాప్తంగా చర్చ.. భిన్నాభిప్రాయలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు అనేక రంగాలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా విద్యారంగం తీవ్రంగా ప్రభావితమైంది. ఇప్పటికే చాలా పరీక్షలను రద్దుచేయాల్సి వచ్చింది. ఇప్పుడిక కొత్త విద్యాసంవత్సరానికి సమ యం ఆసన్నమైనది. ఇంతటి కఠిన పరిస్థితుల్లో బడులు తెరువటం సాధ్యమేనా? తెరిచినా పిల్లల్ని బడికి పంపేందుకు తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? స్కూళ్లకు పం పినా విద్యార్థులు మాస్కులు పెట్టుకొని, భౌతిక దూరం పాటిస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో కొత్త వాదన తెరపైకి వచ్చింది. ఒక ఏడాది పాటు విద్యాసంవత్సరం లేకుండా చేయాలని (జీరో అకడమిక్‌ ఇయర్‌) తల్లిదండ్రులు కోరుతున్నారు. కొవిడ్‌-19 బారిన పడేకంటే ఒక సంవత్సరం పిల్లలకు చదువు లేకపోవడమే మేలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, హర్యానా రాష్ర్టాల్లో జీరో ఇయర్‌ను ప్రకటించాలని తల్లిదండ్రులు ప్రభుత్వానికి వినతిపత్రాలు అందజేశారు. కరోనా తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడులోనూ జీరో ఇయర్‌ చేస్తే మం చిదన్న అభిప్రాయానికి వస్తున్నారు. స్కూళ్లు తెరిచినా తమ పిల్లల్ని బడికి పంపబోమని 1-5 తరగతుల పిల్లల తల్లిదండ్రులు తెగేసి చెప్తున్నారు. 

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో పడ్డట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలోనూ కొన్ని ఉపాధ్యాయ సంఘాలు సర్వే ప్రారంభించినట్టు తెలిసింది. జీరో ఇయర్‌ కంటే ఆన్‌లైన్‌ బోధన మేలని కొందరు తల్లిదండ్రులు అంటున్నారు. ఇప్పటికే పరీక్షలు రద్దయ్యాయని, దీంతో విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

జీరో ఇయర్‌ వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం

విద్యాసంవత్సరాన్ని జీరో ఇయర్‌గా చేయాలన్న నిర్ణయం మంచిది కాదు. దానివల్ల విద్యార్థులు నష్టపోతారు. అయితే, కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో చిన్న పిల్లల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.

- ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి

జీరో ఇయర్‌ వద్దు

కరోనా వైరస్‌ వ్యాప్తి వేళ జీరో అకడమిక్‌ ఇయర్‌ చేయాలని కొంత మంది తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. జీరో ఇయర్‌ చేయాల్సిన అవసరం లేదు. ఉదయం ఒక బ్యాచ్‌, మధ్యాహ్నం రెండో బ్యాచ్‌కు తరగతులు నిర్వహించాలి. దానివల్ల స్కూళ్లలో గుంపులుగా తిరిగే పరిస్థితులు ఉండవు. ఉదయం, మధ్యాహ్నం ప్రతిరోజు స్కూళ్లలో శానిటైజ్‌చేయాలి. సిలబస్‌ను తగ్గించి విద్యా సంవత్సరాన్ని, తరగతుల సమయాన్ని తగ్గించాలి.

- ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి

బడికి పంపే ప్రసక్తే లేదు

స్కూళ్లు తెరిచినా మా పిల్లల్ని పంపే ప్రసక్తే లేదు. ఒక విద్యా సంవత్సరం నష్టపోయినా ఫర్వాలేదు. కరోనా వైరస్‌ సోకితే ఇంట్లోవాళ్లమంతా బాధపడాల్సి వస్తుంది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నయ మార్గాలు అన్వేషించాలి.

- వేణుకుమార్‌, ఓ విద్యార్థి తండ్రి


logo