శనివారం 30 మే 2020
Telangana - Apr 08, 2020 , 02:16:58

ఖజానాకు కరోనా కాటు

ఖజానాకు కరోనా కాటు

  • ఆర్థిక సంవత్సరం చివర్లో కరోనా దెబ్బ
  • మార్చిలో భారీగా తగ్గిన రాబడి
  • ఒక్క వారంలో రూ.5 వేల కోట్ల నష్టం
  • రోజుకు రూ.350 కోట్ల పైమాటే
  • అత్యయిక పరిస్థితిని అధిగమించేందుకు ఆర్థికశాఖ ప్రత్యామ్నాయ ప్రణాళిక

కరోనా.. ఇప్పుడు ఏ నోట విన్నా ఈ వైరస్‌ మాటే. నిత్యం వేలమంది ప్రాణాలను కబళిస్తూ యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నఈ మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుంగదీస్తున్నది. దీని కాటు మన రాష్ట్ర ఆర్థికవ్యవస్థకూ తప్పలేదు. సరిగ్గా ఆర్థిక సంవత్సరం చివర్లో ఇది పంజా విసరడంతో గతనెలలో రాష్ట్ర రాబడులు భారీగా తగ్గాయి. కేవలం ఒక్క వారంలోనే రూ.5 వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఏప్రిల్‌ మొదటి వారం నుంచి పరిస్థితి మరింత విషమించడంతో తెలంగాణ ఆదాయం 95 శాతానికిపైగా పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణాలను, వారి సంక్షేమాన్ని కాపాడేందుకు పెద్ద యుద్ధమే చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలో ఎక్కడా ఆకలికేకలు, ఆర్తనాదాలకు తావులేకుండా ప్రతి పౌరుడినీ కంటికి రెప్పలా కాపాడుకొనేందుకు నిధులను సమీకరిస్తున్నది. 

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఆర్థికమాంద్యం తీసుకొచ్చిన సవాళ్లను, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఒడిదుడుకులను తట్టుకొని స్థిరంగా రాబడిని సాధిస్తున్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై కరోనా పిడుగు పడింది. ఆర్థిక మందగమన ప్రభావం వల్ల సొంత రాబడుల్లో వృద్ధిరేటు తగ్గినప్పటికీ ఇతర రాష్ర్టాల కంటే ఎక్కువ ఆదాయాన్ని సాధిస్తున్న తెలంగాణకు కరోనా మహమ్మారి పెనుశాపంగా పరిణమించింది. కేంద్రం నుంచి పన్నుల వాటా తగ్గినా.. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బకాయిలు సకాలంలో సర్దుబాటుకాకపోయినా సొంత రాబడులపై ఆధారపడి ముందుకుసాగుతున్న తెలంగాణపై అత్యంత ప్రధానమైన మార్చి నెలలోనే కరోనా పంజా విసిరింది. గతనెల 22న జనతాకర్ఫ్యూ, ఆ తర్వాత విధించిన లాక్‌డౌన్‌తో కార్యకలాపాలన్నీ స్తంభించడం ప్రభుత్వ రాబడులను కుంగదీసింది. దీంతో రాష్ట్ర ఖజానాకు ఒక్క మార్చి చివరివారంలోనే దాదాపు రూ.5 వేల కోట్ల గండి పడింది. ఏప్రిల్‌ మొదటి వారం నుంచి పరిస్థితి మరింత విషమించడంతో నెలకు రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు రావలసిన ఆదాయం 95 శాతానికిపైగా పడిపోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని కాపాడేందుకు పెద్ద యుద్ధమే చేస్తున్నది. రాష్ట్రంలో ఎక్కడా ఆకలికేకలు, ఆర్తనాదాలకు తావులేకుండా ప్రతి పౌరుడినీ కంటికి రెప్పలా కాపాడుకొనేందుకు నిధులను సమీకరిస్తున్నది. కరోనాతో యుద్ధం ముగిసిన తర్వాత ఆర్థిక రథచక్రాలను మళ్లీ పరుగులు పెట్టించేందుకు ప్రణాళికలను సిద్ధంచేసుకొంటున్నది.

సరిగ్గా ఆర్థిక సంవత్సరం చివర్లో పంజా

వాస్తవానికి మన ఆర్థిక సంవత్సరంలో మార్చినెల అత్యంత కీలకమైనది. ఈ నెలలో రాబడులను విపరీతంగా పెంచుకొనేందుకు, బడ్జెట్‌ అంచనాలకు-వాస్తవాలకు మధ్య లోటును పూడ్చుకొనేందుకు ప్రభుత్వాలు అన్నివిధాలా ప్రయత్నిస్తుంటాయి. బడ్జెట్‌ అంచనాల్లో నిర్దేశించుకొన్న లక్ష్యాల సాధనకు మార్చినెలనే ప్రధాన టార్గెట్‌గా ఎంచుకుంటారు. దీంతో మిగిలిన అన్ని నెలలలో వచ్చే సగటు ఆదాయం కంటే ఆర్థిక సంవత్సరంలో చివరిదైన మార్చినెలలో రెట్టింపు రాబడి వస్తుంటుంది. కానీ సరిగ్గా మార్చి నెలలోనే కరోనా మహమ్మారి విజృంభిచడంతో రాష్ట్ర సొంత రాబడుల్లో రూ.8 వేల కోట్లకుపైగా గండిపడింది. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక కార్యకలాపాలన్నీ స్తంభించడంతో జీఎస్టీతోపాటు విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌), స్టాంపుల అమ్మకాలు, స్థిరాస్థి రిజిస్ట్రేషన్లు, వాహన రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయంలో భారీగా కోత పడింది. సొంత పన్నులు, పన్నేతర రాబడులు, కేంద్ర పన్నుల్లో వాటా రూపంలో నెలవారీగా రాష్ర్టానికి వచ్చే మొత్తం రాబడి రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు ఉంటుంది. అలాగే జీఎస్టీ, వ్యాట్‌ ద్వారా రూ.3 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 500 కోట్ల నుంచి రూ.600 కోట్లు, ఆబ్కారీశాఖ ద్వారా దాదాపు రూ.1,166 కోట్లు, రవాణా, మైనింగ్‌ ఇతర పన్నుల ద్వారా సుమారు రూ.833 కోట్ల ఆదాయం వస్తుంది. కానీ లాక్‌డౌన్‌ వల్ల ప్రస్తుతం ఈ రాబడి 90 శాతానికిపైగా తగ్గింది. దీంతో రాష్ట్ర ఖజానాకు రోజూ రూ.5 కోట్లు రావడమే గగనమైంది. 

జీఎస్టీ, వ్యాట్‌ రాబడులకు బ్రేక్‌

జీఎస్టీ, వ్యాట్‌ ద్వారా రాష్ర్టానికి గతేడాది రూ.45,379 కోట్ల రాబడి వచ్చింది. ఈసారి దానిని రూ.51 వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ అది రూ.47,500 కోట్లకే పరిమితమైంది. జీఎస్టీ, వ్యాట్‌ వసూళ్ల కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా శ్రమిస్తున్న తరుణంలోనే లాక్‌డౌన్‌ విధించాల్సి రావడంతో రాబడులకు బ్రేక్‌ పడింది. దీంతో మార్చి నెలలో రూ.6 వేల కోట్లుగా నిర్దేశించుకొన్న రాబడులు రూ.4,950 కోట్లకే పరిమితమయ్యాయి. గతేడాది మార్చినెలలో రూ.5,180 కోట్లుగా ఉన్న రాబడులు ఈసారి తగ్గాయి. సాధారణంగా ప్రతి నెలలో రాబడుల వృద్ధిరేటు 6 శాతం మేరకు పెరుగుతుంది. కానీ  ఈసారి ఇది -5 శాతం తక్కువగా ఉన్నది. అంటే ఒక్కనెలలో సరాసరి రాబడి 11 శాతం తగ్గింది. 

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయానికి గండి

మరోవైపు గత నెలలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా బాగా తగ్గింది, స్థిరాస్తి క్రయవిక్రయాలు జోరుమీదున్నప్పుడే లాక్‌డౌన్‌ విధించాల్సి రావడంతో మొత్తం కార్యకలాపాలు స్తంభించాయి. ఫిబ్రవరి వరకు 15,42,000 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లతో రూ.6,509 కోట్ల రూపాయల రాబడి వచ్చింది. మార్చినెలలో 1,15,886 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. దీనిద్వారా రూ.520 కోట్ల రాబడి వచ్చింది. వాస్తవానికి గతనెలలో దాదాపు రూ.1,000 కోట్ల రాబడి వస్తుందని అంచనావేసినప్పటికీ కరోనా కాటుతో అది రూ.480 కోట్లు తగ్గింది. వాహన రిజిస్ట్రేషన్ల ద్వారా మార్చినెలలో రూ. 380 కోట్ల వరకు రాబడి వస్తుందనుకొంటే అందులో సగం కూడా రాలేదు. అలాగే అలాగే ఆబ్కారీశాఖకు గతనెలలో దాదాపు రూ.400 కోట్ల నష్టం వచ్చినట్లు తెలుస్తున్నది.

ప్రతిపైసా ప్రజల కోసమే డిపాజిట్ల వివరాల కోసం ఆర్థికశాఖ ఉత్తర్వులు

కరోనా మహమ్మారి బారినుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుక్షణం ఎంతో అప్రమత్తతతో వ్యవహరిస్తున్నది. ఓవైపు ఆర్థిక సంక్షోభాన్ని దీటుగా ఎదుర్కొంటూనే మరోవైపు ప్రజారోగ్య రక్షణకు ఎలాంటి ముప్పులేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది. కరోనాపై మరో మూడు వారాలపాటు అలుపెరుగని పోరాటం చేసేందుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం.. ప్రజలకు అత్యవసర సేవలతోపాటు ఆహారానికి, ఆరోగ్యానికి ఆటంకం లేకుండా చూసేందుకు ప్రతి పైసానూ పక్కాగా లెక్కించి వెచ్చిస్తున్నది. ఈ క్రమంలో గతనెలాఖరు వరకు అన్ని బ్యాంకుల్లో వివిధ డిపాజిట్ల రూపంలో ఉన్న నగదు వివరాలను అందించాలని రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. అన్ని కార్పొరేషన్లు, సంస్థలు, సహకార సంఘాల్లోని సేవింగ్స్‌, కరెంట్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వివరాలను తక్షణమే అందజేయాలని ఆయా శాఖల అధిపతులను, యూనిట్‌ ఆఫీసర్లను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ప్రొఫార్మాను ఉత్తర్వులతో జతచేశారు.


logo