సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 20, 2020 , 12:41:05

ఆగాగు.. క‌రోనాచార్యదేవా!.. 'దానవీర శూర కరోనా'

ఆగాగు..  క‌రోనాచార్యదేవా!.. 'దానవీర శూర కరోనా'

ఇప్పుడు ప్రపంచం కరోనా భయాన్ని జపిస్తున్నది. ఎక్కడ చూసినా, ఎవ్వరి నోట విన్నా ఇదే మాట... కరోనా.. కరోనా అంటూ కంగారెత్తిపోతున్నారు. కరోనాపై సోషల్‌మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్న సంర్భంలో.. అదెంతటి కరోనా.. దాని తాతను కూడా తరిమికొట్టిన గడ్డ ఇది అంటూ కరోనాను దానవీర శూరకర్ణ సినిమాలో దుర్యోధనుడి డైలాగులకు అన్వయిస్తూ  రాసిన కరోనా పేరడీ 'దానవీర శూర కరోనా' మీకోసం..

ఆగాగు..

క‌రోనాచార్యదేవా!

అహ్హ‌హ్హా.. ఏమంటివి? ఏమంటివి ?

వైర‌స్‌ నెపమున మ‌నిషి మ‌నుగ‌డ‌కింత నిలువ‌నీడ లేదందువా?

ఎంత మాట? ఎంత మాట?

ఇది ఉత్త ప‌రీక్ష‌యేగానీ ఉప‌యోగ‌ప‌డే పరీక్ష కాదే ?

కాదు.. కాకూడదు.

ఇది మ‌ర‌ణ‌ ప‌రీక్ష అందువా?

ఎబోలా వైర‌స్ జ‌న‌న‌మెట్టిది? అతి జుగుప్సాకరమైన నిఫా వైర‌స్ సంభ‌వ‌మెట్టిది?

మట్టిలో క‌లిసెను క‌దా?

అహ్హ‌హ్హా.. అదికాదనటుయా మీ భీతి?

ఇంతయేల.. లోకమంతయూ వ్యాపించి.. జనుల వ‌ణికించి.. క‌బ‌ళించి.. క‌కావిక‌లం చేస్తున్న మ‌హ‌మ్మారిల‌ను మేం త‌రిమేయ‌లేదా? వాటిదే ప‌రీక్ష‌?

మాన‌వాళి భ‌విష్య‌త్‌ను అంధ‌కారం చేసి.. స‌క‌ల ఖండాల‌ను చుట్ట‌బెట్టి.. కోట్లాది ప్రాణాల‌ను హ‌రించిననూ మేం పున‌ర్ జ‌నించ‌లేదా? వాటిదే ప‌రీక్ష‌?

నాతో చెప్పింతువేమయ్యా..

మా వంశమునకు మూలపురుషులైన ఆదిమాన‌వులు.. వారి అనంతరము వచ్చిన మేమూ మాయల మ‌హ‌మ్మారిలను త‌ట్టుకొనలేదా?

అంత‌కంత‌కూ వ్యాపిస్తూ ఆందోళ‌న క‌లిగించిన అంటువ్యాధిని.. ఆ వ్యాధిని అంటిపెట్టుకొని తిరిగిన క‌ల‌రాను..

దానిని దాటేసుకుంటూ వ‌చ్చిన మ‌శూచిని..

ఆ వ్యాధికి తోడుగా వ‌చ్చిన ప్లేగును..

ఆ త‌ర్వాత వ‌చ్చిన హెచ్ఐవీని..

దానికంటే పరమ ప్రమాదమైన క్యాన్స‌ర్‌ను..

ఆ పిద‌ప వ‌చ్చిన సార్స్‌ను..

అంత‌టితో ఆగ‌కుండా దూసుకొచ్చిన స్వైన్‌ఫ్లూను..

ఆవుల నుంచి వ‌చ్చిన క్ష‌య‌ను..

బాతుల నుంచి వ‌చ్చిన ఫ్లూను..

మా ఇండ్ల‌లో అప్పుడ‌ప్పుడూ వ‌చ్చి పిల‌గాండ్ల‌ను ప‌ల‌క‌రించే ఆట‌ల‌మ్మ‌ను..

అంత‌కంత‌కూ త‌ట్ట‌కుని బ‌తికి బ‌ట్ట‌క‌ట్ట‌లేదా?

సందర్భావసరములనుబట్టి క్షేత్రభీజప్రాధాన్యములతో సంకరమైన ఈ వైర‌స్ వంశ‌ము ఏ నాడో మా చేతుల కుక్క చావు చ‌చ్చిన‌ది.

కాగా నేడు క‌రోనా.. క‌రోనా అను వ్య‌ర్థ వాద‌ములెందులకు.. ??

..

నాయ‌నా శుయ్యోధ‌నా..!!

--దాయి శ్రీశైలం


logo