శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Sep 27, 2020 , 03:00:19

సాధారణ వ్యాధిగా కరోనా!

సాధారణ వ్యాధిగా కరోనా!

  • తొలగిపోతున్న భయాందోళనలు
  • ఇంటివద్దే 85 శాతం మంది రికవరీ
  • కొవిడ్‌ దవాఖానల్లో ఖాళీగా పడకలు
  • గాంధీలో త్వరలో నాన్‌కొవిడ్‌ సేవలు

ప్రపంచమంతటినీ గడగడలాడించిన కరోనా వ్యాధి పట్ల నెలకొన్న భయాందోళనలు క్రమంగా మాయమవుతున్నాయి. దేశంలో వైరస్‌ సోకినవారు త్వరగా కోలుకోవడం, మరణాలు ఒక్కశాతం వరకే ఉండటమే దీనికి కారణం. వైరస్‌పై అప్పుడున్న భయాలు, అపోహలు ఇప్పుడు లేవు. వ్యాధిసోకినవారిలో 85శాతం మంది ఇంట్లోనే ఉండి కోలుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ చికిత్స కోసం కేటాయించిన ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానల్లో పడకలు ఖాళీగా ఉంటున్నాయి. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తి, ప్రభావం, చికిత్స.. తదితర అంశాలపై మొదట్లో సాధారణ ప్రజల్లోనే కాకుండా వైద్య సిబ్బందికి సరైన అవగాహన ఉండేది కాదు. కాలక్రమేణా వ్యాధిపై అందరికీ అవగాహన పెరిగింది. మాస్కులు ధరించడం, భౌతికదూరం, పరిశుభ్రత పాటించడం, పౌష్టికాహారం తీసుకోవటం వంటి అలవాట్లు ఎక్కువయ్యాయి. దీంతో వైరస్‌ వ్యాప్తి తగ్గింది. ప్రస్తుతం పెద్దమొత్తంలో పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ పాజిటివ్‌ కేసుల రేటు ఐదుశాతంలోపే ఉంటున్నది. ఒకవేళ వైరస్‌ సోకినా ముందస్తు చర్యలతో వైరస్‌ ప్రభావం తక్కువగా ఉంటున్నది. దీనికితోడు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండటంతో కొవిడ్‌ బారిన పడినప్పటికీ స్వల్ప లక్షణాలు ఉండి బయటపడుతున్నారు. పాజిటివ్‌ వచ్చినప్పటికీ ఇంట్లోనే ఉంటూ పూర్తి ఆరోగ్యవంతులుగా బయటికివస్తున్నారు.

85 శాతం మందికి ఇల్లే దవాఖాన!

రాష్ట్రంలో 1.83 లక్షల మందికి కరోనా సోకగా అందులో 1.52 లక్షల మంది కో లుకున్నారు. మరో 30 వేలమంది ప్రస్తు తం ఇంట్లో, దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. పాజిటివ్‌ కేసుల్లో 85శాతం మంది ప్రభుత్వవైద్యుల సూచనలు పాటి స్తూ ఇంట్లో ఉండి కోలుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 15శాతంలో పదిశాతం మందికి సాధారణ లేదా ఆక్సిజన్‌ పడకలు అవసరమవుతుండగా, 5 శాతం మందికే ఐసీయూ చికిత్స అవసరం అవుతున్నది. దీర్ఘకాలిక రోగాలుండి ఐసీయూ వరకు వెళ్లిన వారిని కాపాడేందుకు శ్రమించాల్సి వస్తున్నట్లు వైద్యులు చెప్తున్నారు.   

ఖాళీగా కొవిడ్‌ పడకలు

రాష్ట్రంలో వైరస్‌ ఎక్కువగా విజృంభిస్తే ఎదురయ్యే పరిస్థితులను ముందే ఊహించిన ప్రభుత్వం పెద్దమొత్తంలో కొవిడ్‌ పడకలను ఏర్పాటుచేసింది. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో కొవిడ్‌ చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చింది. చాలామంది ఇంట్లోనే ఉండి చికిత్స పొందటంతో ఐసొలేషన్‌ కోసం దవాఖానల్లో చేరేవారి సంఖ్య తగ్గిపోతున్నది. సాధారణ, ఆక్సిజన్‌ పడకలకు డిమాండ్‌ తగ్గి దాదాపు అన్ని దవాఖానల్లో పడకలు ఖాళీగా ఉంటున్నాయి. కొవిడ్‌ కోసం వివిధ ప్రభుత్వ దవాఖానల్లో 8,841 పడకలు ఏర్పాటుచేయగా, 6,564 పడకలు ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటులో 9,469 పడకలు ఉండగా, 6,097 పడకలు ఖాళీగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గాంధీ దవాఖానలో త్వరలో నాన్‌కొవిడ్‌ సేవలు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నది. విదేశాల నుంచి వచ్చిన వారిని, పరిమితికి మించి ప్రైవేటు దవాఖానలకు వస్తున్నవారిని ఐసొలేషన్‌లో ఉంచేందుకు ప్రత్యేకంగా హోటళ్లను ఏర్పాటుచేశారు.