సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 02:10:46

తెలంగాణలో కరోనా చర్యలు భేష్‌!

తెలంగాణలో కరోనా చర్యలు భేష్‌!

  • అభినందించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌
  • వ్యూహాన్ని వివరించిన మంత్రి ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకున్నదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ హర్షం వ్యక్తంచేశారు. వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం, పెద్దసంఖ్యలో పరీక్షలు నిర్వహించడం, సకాలంలో అవసరమైనవారికి నాణ్యమైన వైద్యం అందించడం వల్ల రాష్ట్రంలో కరోనా కట్టడి సాధ్యమైందని అభినందించారు. సోమవారం రాష్ర్టాల వైద్యారోగ్యశాఖ మంత్రులతో హర్షవర్ధన్‌ వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్కేభవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్‌.. వైరస్‌ వ్యాప్తి కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. తెలంగాణకు కేంద్రం నుంచి మద్దతు కావాలని కోరారు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రతి 8 మందిలో ఒకరికి వైరస్‌ నిర్ధారణ పరీక్ష చేశామని, దీని కోసం 65 ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్స్‌ పనిచేస్తున్నాయని వివరించారు. మొత్తంగా 48 లక్షల మందికి టెస్టుచేయగా, 5 శాతం మందికే పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. మరణాల రేటు 0.55 శాతంగా ఉన్నదన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేదని, లిక్విడ్‌ ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కరోనా చికిత్స కోసం ప్రత్యేకంగా కేటాయించిన దవాఖానల్లో కేవలం 12 శాతం మాత్రమే పడకలు నిండి ఉన్నాయని అన్నారు. ఒకవేళ కేసులు పెరిగినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. బతుకమ్మ, దసరా పండుగ సమయంలో కేసులు పెరుగుతాయని అనుకున్నప్పటికీ, పెద్దగా మార్పు లేదని తెలిపారు. వ్యాక్సిన్‌ విషయంలో రాష్ట్రాలకు ముందస్తు పూర్తి సమాచారం అందించాలని విజ్ఞప్తిచేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ హెల్త్‌ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, కరోనా నిపుణుల కమిటీ సభ్యులు డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, డాక్టర్‌ గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు. 


వచ్చే ఏడాది తొలి మూడు నెలల్లో వ్యాక్సిన్‌: కేంద్ర మంత్రి

వచ్చే ఏడాది తొలి మూడు నెలల్లోగా కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ చెప్పారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల నుంచి హెల్త్‌ కేర్‌ వర్కర్ల జాబితాలు అందాయని, దీనిని క్రోడీకరించి సమగ్ర నివేదిక తయారుచేస్తున్నట్టు వివరించారు. త్వరలో రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ పంపిణీ, ప్రాధాన్యతా క్రమం గురించి పూర్తి స్పష్టత వచ్చేలా సమాచారం అందిస్తామని కేంద్ర మంత్రి వివరించినట్టు సమాచారం.