శనివారం 04 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 18:06:45

ఎగుమతి ఆధారిత క్లస్టర్స్ ఏర్పాటుకు సమన్వయం చేయండి

ఎగుమతి ఆధారిత క్లస్టర్స్ ఏర్పాటుకు సమన్వయం చేయండి

హైదరాబాద్ : రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న నాణ్యమైన పసుపు, మిర్చి, మామిడి లను ఎగుమతి (ఎక్స్ పోర్ట్) చేసేందుకు క్లస్టర్స్ ను ఏర్పాటు చేసేందుకు వాణిజ్య శాఖతో సమన్వయం చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ కులేఖ రాశారు. కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలలో పసుపు, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో మిర్చి, రాష్ట్ర వ్యాప్తంగా మామిడి ఉత్పత్తులు ప్రత్యేకతను సంతరించుకున్నాయని వినోద్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు. కొవిడ్-19 నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ కింద ఈ క్లస్టర్స్ ను చేపట్టాలని వినోద్ కుమార్ కోరారు.

మేలు రకం పసుపు, మిర్చి, మామిడిని విదేశాలలో ఎగుమతి చేసేందుకు కేంద్ర వాణిజ్య శాఖ ఆధ్వర్యంలోని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్ పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (అపేడ), వరంగల్ స్పైస్ బోర్డ్ లు కలిసి అధ్యయనం చేసి నివేదిక సిద్ధం చేశాయని వినోద్ కుమార్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ రూ. 226.17 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు పంపిందని వినోద్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో తక్షణమే జోక్యం చేసుకుని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖతో సమన్వయం చేసి రాష్ట్రంలో ఎక్స్ పోర్ట్ ఓరియెంటెడ్ యూనిట్స్ క్లస్టర్స్ ల ఏర్పాటుకు కృషి చేయాలని వినోద్ కుమార్ కోరారు.


logo