బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 08, 2020 , 01:17:36

ధాన్యం కొనుగోళ్లపై కంట్రోల్‌రూం

ధాన్యం కొనుగోళ్లపై కంట్రోల్‌రూం

  • ఫిర్యాదులకు 7288894807,7288876545 నంబర్లు 
  • సాఫీగా మక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లు
  • కంట్రోల్‌ రూం అధికారులతో రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్‌ పల్లా సమీక్ష

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లోనూ పంటల విక్రయంలో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతున్నది. వ్యవసాయ, మార్కెటింగ్‌, పౌర సరఫరాలశాఖ, రైతుబంధు సమితుల ఆధ్వర్యంలో యాసంగి సీజన్‌లో మక్కజొన్న, వరి ధాన్యాల కొనుగోలుకు రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలుకేంద్రాలను ఏర్పాటుచేసింది. ధాన్యం, మక్కజొన్న సేకరణలో వచ్చే సమస్యలను తక్షణ పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ కమిషనర్‌ కార్యాలయంలో మంగళవారం కంట్రోల్‌రూంను ఏర్పాటుచేశారు. 

ఈ కంట్రోల్‌రూంలో వ్యవసాయశాఖ, రైతుబంధు సమితి, వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ, పౌరసరఫరాలశాఖ అధికారులు అందుబాటులో ఉంటారు. రోజూ జిల్లాలవారీగా ఏర్పాటుచేసిన ధాన్యం సేకరణ కేంద్రాలు, సేకరించిన ధాన్యం, ఎన్ని ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి తదితర వివరాలపై రాష్ట్రస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారు. మంగళవారం రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ కంట్రోల్‌రూంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయిలో ధాన్యం సేకరణలో రైతులు ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కారం తదితర అంశాలపై చర్చించిన రాజేశ్వర్‌రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. 

కొనుగోలు కేంద్రాలు, ధాన్యం సేకరణ సమస్యలపై రైతులు ఈ కంట్రోల్‌ రూంను ఉపయోగించుకోవాలని రైతులకు సూచించారు. ఈ కంట్రోల్‌ రూం రోజూ ఉదయం 9నుంచి సాయంత్రం 5గంటల వరకు పనిచేస్తుంది. రైతులు తమ సమస్యలపై 7288894807 లేదా 7288876545 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చు. ఈ కంట్రోల్‌ రూంకు వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత అధికారుల ద్వారా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకొంటారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. సమావేశంలో వ్యవసాయశాఖ అదనపు కమిషనర్‌ విజయ్‌కుమార్‌, మార్క్‌ఫెడ్‌ ఎండీ భాస్కరాచారి, డీడీ బాలాజీ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


logo