గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 01, 2020 , 02:10:54

జిన్నింగ్‌ మిల్లులకు సహకారం

జిన్నింగ్‌ మిల్లులకు సహకారం

  • అన్నిరకాలుగా ఆదుకొనేందుకు ప్రభుత్వం సిద్ధం
  • lపత్తి రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలి 
  • మిల్లుల సంఘాలతో మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఈసారి పత్తి దిగుబడి అధికంగా రానున్నదని.. అందుకనుగుణంగా జిన్నింగ్‌ సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఇందుకోసం జిన్నింగ్‌ మిల్లులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. సోమవారం వ్యవసాయశాఖమంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ జిన్నింగ్‌ మిల్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం చెప్పినట్టు డిమాండ్‌ ఉండే పంటలనే వేశారని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయవిస్తీర్ణం భారీగా పెరిగిందని చెప్పారు. సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర రైతాంగానికి అచంచలమైన విశ్వాసం ఉన్నదని.. దీనివల్లనే నియంత్రిత సాగువిధానం విజయవంతమయిందని తెలిపారు. ఇప్పటికే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు మంచి డిమాండ్‌, ధర లభించేలా ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. నూతనంగా పెట్టుబడులు తీసుకొస్తున్న సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిశ్రమలు, ఆయావర్గాలపట్ల కూడా ప్రోయాక్టివ్‌గా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని సీఎం కేసీఆర్‌ మార్గదర్శనం చేస్తున్నారని, ఆ దిశగానే జిన్నింగ్‌ మిల్స్‌ యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటుచేశామని వివరించారు. పరిశ్రమలను ఆదుకొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని, అదే సమయంలో పరిశ్రమలు కూడా సహకరించాలని కేటీఆర్‌ కోరారు. తెలంగాణలో పెద్దఎత్తున పత్తిపంట వచ్చే అవకాశమున్నందున రైతులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత మిల్స్‌పైనా ఉన్నదన్నారు.

ప్రభుత్వం సహకారంతోనే..: జిన్నింగ్‌ మిల్స్‌ అసోసియేషన్‌

మిల్స్‌ యాజమాన్యాల సమస్యలను మంత్రులు సావధానంగా విన్నారు. పరిశ్రమకు రావాల్సిన రాయితీ బకాయిలపై స్పందిస్తూ.. ప్రస్తుత కరోనా సంక్షోభ పరిస్థితుల్లో విడుదల కావాల్సిన మొత్తంలో కొంత ఉపశమనం కల్పిస్తామని తెలిపారు. స్పిన్నింగ్‌ మిల్స్‌తో సమానంగా విద్యుత్‌ రాయితీలివ్వాలన్న అంశాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళుతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 323 జిన్నింగ్‌ మిల్లుల్లో 150కిపైగా తెలంగాణ ఏర్పడ్డాకే నెలకొల్పినట్టు యాజమాన్యాలు తెలిపాయి. మొత్తం మిల్లులకు కలిపి కోటి బేళ్ల పత్తిని జిన్నింగ్‌ చేసే సామర్ధ్యం ఉన్నదని,  రాష్ట్రంలో ఈసారి 60 లక్షల పత్తి బేళ్ల దిగుబడి వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నామన్నారు. ప్రభుత్వం తమను పిలిచి సమస్యలను సానుకూలంగా వినడంపై అసోసియేషన్‌ హర్షం వ్యక్తం చేసింది. సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ మాణిక్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు


logo