బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 02:11:10

బుల్లితెర అభివృద్ధికి సహకరిస్తాం

బుల్లితెర అభివృద్ధికి సహకరిస్తాం

  • మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో బుల్లితెర అభివృద్ధికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడానికి సిద్ధమని టూరిజంశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. అన్ని రకాల సీరియల్‌ షూటింగ్‌లకు అనువైన లొకేషన్లు రాష్ట్రంలో ఉన్నాయని, షూటింగ్‌లకు కావాల్సిన వసతి సదుపాయాలను టూరిజం హోటళ్ల ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. టీవీ సీరియళ్ల షూటింగ్‌లకు ప్రభుత్వం నియమాలతో కూడిన అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో మంత్రి సోమవారం సమీక్షించారు. సీరియల్స్‌ చిత్రీకరణకు కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు, చెరువులు, కొలనులు, అడవులు అందమైన భవనాలు రాష్ట్రమంతటా ఉన్నాయన్నారు. చారిత్రక నేపథ్య సీరియళ్లు తీయడానికి ఓరుగల్లు వంటి కోటలు, శిల్పాలు, దేవాలయాలు ఉన్నాయని చెప్పారు. ఆహ్లాదకర సుందర దృశ్యాల చిత్రీకరణకు జలపాతాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని చెప్పారు. పాత జిల్లాల ప్రకారం ఆయా పర్యాటక ప్రదేశాల్లోని దేవాలయాలు, పురావస్తుశాఖ ప్రాంతాలను కలిపి ఒక డాక్యుమెంటరీ రూపంలో బుల్లితెర షూటింగ్‌లకు అనుకూలంగా తయారుచేసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఆ డాక్యుమెంటరీ తయారీకి తెలంగాణ టీవీ సీరియళ్ల అసోసియేషన్‌ సభ్యులు వెంకటప్రసాద్‌, సందీప్‌, నారాయణ, నితిన్‌, మధు, శ్రీకాంత్‌, టూరిజంశాఖ అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటుచేసి వారికి  సహకరించాలని టూరిజం ఎండీ మనోహరరావుకు సూచించారు.


logo