వనపర్తి జిల్లా సమగ్రాభివృద్ధికి సహకారం : మంత్రి ప్రశాంత్ రెడ్డి

వనపర్తి : వనపర్తి జిల్లా సమగ్రాభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని రాష్ట్ర గృహనిర్మాణ, ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో సుమారు రూ.95 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అప్పాయిపల్లి సమీపంలో మొదటి విడుత పూర్తయిన 24 డబుల్ బెడ్రూంలను ప్రారంభించి లబ్ధిదారులకు ముంజూరు పత్రాలు అందజేసి మాట్లాడారు. మంత్రి నిరంజన్ రెడ్డి కారణంగానే వనపర్తి జిల్లా ఏర్పడిందని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అన్నారు. అడిగిన వెంటనే సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రంలో సెంట్రల్ లైటింగ్, రహదారుల విస్తరణకు రూ. 50 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. వ్యవసాయశాఖ మంత్రి విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్తో మాట్లాడి నియోజకవర్గానికి అదనంగా 1500 డబుల్ బెడ్రూంలను మంజూరు చేయించేందుకు కృషిచేస్తానని అన్నారు.
అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. అప్పాయిపల్లి, చిట్యాల ,పెద్దగూడేల్లో చేపట్టిన డబుల్ బెడ్రూం నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. తొలివిడత అప్పాయిపల్లిలో నిర్మించిన 160 ఇండ్లలో 24 గృహాలను లబ్ధిదారులకు కేటాయించినట్లు చెప్పారు. రెండు రోజుల్లో మిగినవి కేటాయిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, జడ్పీచైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్ష్యులు లక్ష్మయ్య, ఎంపీపీ కిచ్చా రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.