e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home తెలంగాణ స్థిరంగా అల్పపీడనం

స్థిరంగా అల్పపీడనం

స్థిరంగా అల్పపీడనం
  • పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు
  • హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడి

నమస్తే నెట్‌వర్క్‌: రాష్ట్రంలో అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండురోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సోమవారం తెలిపింది. బంగాళాఖాతంలో ఆంధ్రా, ఒడిశా తీరం వద్ద ఆదివారం ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నది. అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.
మంగళవారం నిజామాబాద్‌, మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతారణ కేంద్రం తెలిపింది. అలాగే అదిలాబాద్‌, కుమ్రం-భీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, వికారాబాద్‌, సంగారెడ్డి, ఖమ్మం, సిద్దిపేట, కరీంనగర్‌, పెద్దపల్లి, మెదక్‌ జిల్లాల్లో భారీ వర్షాలు, కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాల్‌పల్లి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. బుధవారంనాడు అదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం జయశంకర్‌ భూపాల్‌పల్లి జిల్లా టేకుమట్లతో 8.45 సెం.మీ., మహబూబాబాద్‌ జిల్లా గూడూరులో 8.13, జయశంకర్‌ భూపాల్‌పల్లి జిల్లా రేగొండలో 7.25, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 7.23, ములుగు జిల్లా తాడ్వాయిలో 6.85, వెంకటాపూర్‌ మండలం లక్ష్మిదేవిపేటలో 6.50 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇద్దరి మృతి
ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల వాగులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్‌ నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీటిలోనే ఉండగా, అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఉమ్మడి జిల్లాలో వంతెన దాటుతూ ఒకరు, పిడుగుపడి మరొకరు మృతి చెందారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో సింగరేణి ఏరియా కేటీకే ఓసీపీ-2 గనిలో సోమవారం రెండవ షిప్టులో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో వాగులు, నదులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంతో పలు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండి మత్తడి దుంకుతున్నాయి. గతంలో తాగేందుకే నీరు దొరకని కరువు మండలం గన్నేరువరంలో కాళేశ్వర జలాలతోపాటు వానలు పడుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

హైదరాబాద్‌లో భారీ వర్షం
సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రాత్రి 10గంటల సమయానికి హయత్‌నగర్‌ ప్రాంతంలో అత్యధికంగా 4.8 సెం.మి. వర్షపాతం నమోదయ్యింది. వనస్థలిపురం ప్రశాంత్‌నగర్‌, వెస్ట్‌మారెడ్‌పల్లిలో 3.8, మోండామార్కెట్‌లో 3.3, కంటోన్మెంట్‌ ప్రాంతంలో 3.2, ఉస్మానియా యూనివర్సిటీ 2.9, ముషీరాబాద్‌, రాజేంద్రనగర్‌, భవానినగర్‌లలో 2.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

ఎస్సారెస్పీకి భారీ వరద
హైదరాబాద్‌, జూలై 12 (నమస్తే తెలంగాణ)/మెండోరా/కాళేశ్వరం/అయిజ : అల్పపీడన ప్రభావంతో ఎగువన మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. సోమవారం సాయంత్రానికి ఎస్సారెస్పీకి దాదాపు 89,349 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా 1074.30 అడుగుల వద్ద (38.076 టీఎంసీలు) నీటి నిల్వ ఉన్నదని ఎస్సారెస్పీ ఏఈఈ వంశీ తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి సైతం 15 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీబరాజ్‌కు 58,320 క్యూసెక్కుల నీరు వస్తున్నది. కృష్ణా బేసిన్‌లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులకు స్వల్ప వరద చేరుతున్నది. తుంగభద్ర డ్యాంకు 1,701 క్యూసెక్కుల వచ్చి చేరుతుందగా.. 1610.48 అడుగుల వద్ద 36.176 టీఎంసీలు నిల్వ ఉన్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
స్థిరంగా అల్పపీడనం
స్థిరంగా అల్పపీడనం
స్థిరంగా అల్పపీడనం

ట్రెండింగ్‌

Advertisement