గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 11, 2020 , 20:05:36

వివేకానందుని మాటలు, రచనల ద్వారా నిరంతర స్ఫూర్తి : తమిళిసై

వివేకానందుని మాటలు, రచనల ద్వారా నిరంతర స్ఫూర్తి : తమిళిసై

హైదరాబాద్ : స‌్వామి వివేకానందుని మాటలు, రచనల ద్వారా తాను నిరంతరం స్ఫూర్తి పొందుతున్న‌ట్లు రాష్ర్ట గ‌వ‌ర్న‌ర్‌ తమిళిసై సౌంద‌ర‌రాజ‌న్ తెలిపారు. వివేకానందుని చారిత్రాత్మక చికాగో ఉపన్యాసం 127వ వార్షికోత్సవం సందర్భం అదేవిధంగా వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్ లెన్స్ 21వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం సంద‌ర్భంగా రామకృష్ణ మఠం, సంస్థలు సంయుక్తంగా సంప్రీతి దినోత్సవం నిర్వహించాయి. ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సంధర్భంగా డా. తమిళిసై మాట్లాడుతూ తాను ఎప్పుడైనా నిరాశకు గురైనా స్వామి వివేకానందుని రచనలు చదివి పునరుత్తేజితమౌతానని తెలిపారు. 

విద్యార్థులు, యువత స్వామి వివేకానందుని బోధనలను ఆదర్శంగా తీసుకుని, స్ఫూర్తితో కృషి చేసి తమ శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్ధులు, యువతలో ఆత్మహత్య సంఘటనలు పెరుగుతుండటం పట్ల గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. జీవితంలో సమస్యలను పూర్తి ధైర్యంతో ఎదుర్కోవడానికి, విజయం సాధించడానికి వివేకానంద బోధనలు అత్యంత ఉపయుక్తమైనవిగా పేర్కొన్నారు. సమస్తమైన శక్తి మనలోనే దాగుందని, ఆ శక్తితో యువత అనుకున్నది సాధించవచ్చన్నారు. ఇదే అంశాన్ని స్వామి వివేకానంద చాటి చెప్పాడన్నారు. 

127 సంవత్సరాల క్రితం చికాగోలో వివేకానందుడు భారతీయ వేదాంత చింతన గూర్చి ఒక సింహం వలె గర్జించాడన్నారు. ప్రపంచ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లో స్వామి చేసిన ప్రసంగాలలో అతి ముఖ్యమైన అంశాలు మూఢత్వాన్ని, ద్వేషాన్ని వదలాలని చెప్పడం. ప్రపంచంలో శాంతి, సౌభ్రాతృత్వం, అభివృద్ధి కోసం వివిధ మతాలు ఒకదానినొకటి గౌరవించడం అత్యంత ఆవశ్యకమైనవిగా స్వామి వివేకానంద తెలిపార‌న్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠం వైస్ ప్రెసిడెంట్ స్వామి గౌతమానంద, మఠం అధ్యక్షులు స్వామి జ్ఞానదానంద, వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ సంస్థ డైరెక్టర్ స్వామి బోధమయానంద, రాకా సుధాకర్, అజిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.



logo