బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 27, 2020 , 01:38:57

ప్రజలకు నిరంతర విద్యుత్‌ సేవలు

ప్రజలకు నిరంతర విద్యుత్‌ సేవలు

-ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు 

-పోలీసులు సహకరించాలి: డీజీపీ మహేందర్‌రెడ్డి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విద్యుత్‌ సరఫరా అత్యవసర సేవలకిందకే వస్తుందని, లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సేవలు అందించాలని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు విద్యుత్‌ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. గురువారం ఆయన ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రాతో కలిసి విద్యుత్‌ సంస్థల డైరెక్టర్లు, వివిధ ప్లాంట్ల నిర్వాహకులు, డిస్కంల జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ సీఎండీలు రఘుమారెడ్డి, గోపాలరావు పాల్గొన్నారు. ‘ప్రజారోగ్య పరిరక్షణకు దవాఖానలు రేయింబవళ్లు సేవలందిస్తున్నాయి. నిత్యావసరాలకు కొరతరాకుండా రైతులు పంటలు పండిస్తున్నారు. పోలీసు కార్యాలయాలు అప్రమత్తంగా ఉన్నాయి. ప్రజలంతా ఇండ్లలోనే ఉన్నారు. వీరందరికీ నిరంతర విద్యుత్‌ సరఫరా చాలా అవసరం. దానిని తీర్చేందుకు విద్యుత్‌ సిబ్బంది రేయింబవళ్లు కష్టపడాల’ని ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. ఆపద సమయంలో ముందువరుసలో నిలబడి, చిత్తశుద్ధి చాటుకోవాల్సిన సమయమిదేనని పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ సోకకుండా విద్యుత్‌ ఉద్యోగులు, సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ప్లాంట్లలో హైశానిటేషన్‌ చేపట్టాలని సూచించారు. విద్యుత్‌ ఉద్యోగులు గుర్తింపుకార్డులను మెడలో వేసుకోవాలని, దానిని చూపిస్తే పోలీసులు సహకరిస్తారని చెప్పారు. 

విద్యుత్‌ ఉద్యోగులకు పోలీసుల సహకారం

విధులకు హాజరయ్యే విద్యుత్‌ ఉద్యోగులకు పోలీసులు సహకరించాలని సీఎండీ ప్రభాకర్‌రావు చేసిన విజ్ఞప్తి పట్ల డీజీపీ మహేందర్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. విద్యుత్‌ ఉద్యోగులు ఏ సమయంలోనైనా గుర్తింపుకార్డులు చూపిస్తే వారికి సహకరించాలని పోలీసు అధికారులను డీజీపీ ఆదేశించారు. విద్యుత్‌ ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరుకాలేకపోతే.. రాష్ట్రం అంధకారమవుతుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. వైద్యారోగ్య, విద్యుత్‌, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, మీడియా తదితర అత్యవసర సేవల్ల్లో పాల్గొనేవారు గుర్తింపుకార్డులు చూపిస్తే పోలీసులు సహకరిస్తారని పేర్కొన్నారు. 


logo
>>>>>>