సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 03:13:11

వలసకూలీకి గుర్తింపుకార్డు

వలసకూలీకి గుర్తింపుకార్డు

  • నిర్మాణరంగ కార్మికులందరికీ మైగ్రేషన్‌ సర్టిఫికెట్లు
  • మూడునెలల్లో నమోదు ప్రక్రియ పూర్తిచేయాలి
  • అన్నిరాష్ర్టాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ
  • తెలంగాణసాయం స్ఫూర్తితో ముందుకొచ్చిన కేంద్రం
  • దేశవ్యాప్తంగా 5 కోట్ల కార్మికులు ఉంటారని అంచనా

లాక్‌డౌన్‌లో వలసకూలీ వెతలు వర్ణనాతీతం.. తినడానికి తిండిలేక, ఉండటానికి స్థలం లేక, స్వస్థలాలకు వెళ్లేందుకు వాహనాల్లేక తీవ్ర ఇబ్బందులుపడ్డారు. నెత్తిన మూట, సంకలో బిడ్డను ఎత్తుకుని.. ఎర్రటి ఎండలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా వేల కిలోమీటర్లు నడిచారు. వారి వివరాలు  సక్రమంగా లేకపోవడంతోనే క్లిష్ట సమయంలో ఆదుకోవడం ప్రభుత్వాలకు వీలుకాలేదు. దేశవ్యాప్తంగా దాదాపు 5 కోట్ల మంది భవన, ఇతర నిర్మాణరంగాల్లో పని చేస్తుండగా.. లాక్‌డౌన్‌లో 1.80 కోట్ల మందికే ప్రభుత్వ సాయమందింది. అదేసమయంలో  తెలంగాణ ప్రభుత్వం వలసకార్మికుల వివరాలు సేకరించి నేరుగా సాయమందించడాన్ని గుర్తించిన కేంద్రం దేశవ్యాప్తంగా వివరాలు సేకరించి.. మైగ్రేషన్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భవన, ఇతర నిర్మాణరంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఏ రాష్ర్టాలకు వలసవెళ్లినా ఆపద సమయంలో ఆదుకొనేందుకు గుర్తింపుకార్డు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రకృతివైపరీత్యాల వంటి సమయాల్లో అందించే సాయం నేరుగా చేరేలా కార్మికులందిరికీ మైగ్రేషన్‌ సర్టిఫికెట్లు ఇవ్వనున్నది. కార్మికుల నమోదు ప్రక్రియను మూడునెలల్లో పూర్తిచేయాలని అన్నిరాష్ర్టాలకు కేంద్రం మార్గదర్శకాలు పంపించింది. రిజిస్ట్రేషన్‌ సమయంలో ఆధార్‌, బ్యాంక్‌ఖాతా వివరాలు మినహా ఎలాంటి పత్రాలు అడగవద్దని స్పష్టంచేసింది. ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా స్వీయ రిజిస్ట్రేషన్‌కూ అవకాశం కల్పించింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ చేసుకున్న కార్మికులు ఆన్‌లైన్‌లో కానీ, టెలిఫోనిక్‌ యాక్సెస్‌ ద్వారా రెన్యువల్‌ చేసుకోవాలని సూచించింది. మిషన్‌ మోడ్‌ ప్రాజెక్టు ప్రకారం కార్మికులు, వారి మొబైల్‌ నంబర్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయబడుతారు. తర్వాత వారందరికీ మైగ్రేషన్‌ సర్టిఫికెట్లు ఇస్తారు. కార్మికుడు ఉపాధికోసం వేరేరాష్ర్టానికి వలసవెళ్లినా జాతీయపోర్టల్‌లో అప్‌లోడ్‌ అవుతుంది. ఏ రాష్ట్రంలో పనిచేయడానికి వెళతాడో ఆ రాష్ట్రం కొత్త రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఇస్తుంది.

కరోనా సాయమందింది 1.80 కోట్ల మందికే

దేశవ్యాప్తంగా 3,48,62,288 భవన, ఇతర నిర్మాణరంగ కార్మికులు రిజిస్టర్‌ అయి ఉన్నారు. ఇందులో తెలంగాణలో 11,75,531 మంది ఉన్నారు. వాస్తవానికి నిర్మాణరంగాల్లో దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది కార్మికులు ఉంటారని కేంద్రకార్మికశాఖ అంచనా. ఇందులో 3,48,62,288 మంది రిజిస్టరయినా.. లాక్‌డౌన్‌ సమయంలో ప్రత్యక్ష నగదు బదిలీ పథకం కింద 1.80 కోట్ల మంది కార్మికులకే ఆర్థికసహాయం అందినట్టు కేంద్రం గుర్తించింది. ఆధార్‌కార్డు, బ్యాంక్‌ ఖాతాలు సక్రమంగా లేకపోవడంతోపాటు, పంపిణీ వ్యవస్థలో లోపంకూడా ఇందుకు కారణమని తేలింది. కేంద్రం వద్ద కార్మికులకు సంబందించి ప్రత్యేక పోర్టల్‌ లేదు. రాష్ర్టాల నుంచి వచ్చిన డాటాపైనే ఆధారపడుతున్నది. ఈ నేపథ్యంలోనే కార్మికుల వివరాలు సేకరించేందుకు సిద్ధమైంది.

ఉపయోగించని నిధి రూ.38 వేల కోట్లు

భవననిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం ప్రకారం నిర్మాణపనులపై రాష్ర్టాలు ఒక శాతం సెస్‌ వసూలుచేస్తాయి. ఇలావచ్చిన సొమ్మును కార్మికుల సంక్షేమానికి వాడాలి. ఈ ఏడాది మే వరకు అన్నిరాష్ర్టాలు రూ.61, 049 కోట్ల సెస్‌ వసూలు చేశాయి. ఇందులో కార్మికుల సంక్షేమానికి 40% కూడా ఆయా రాష్ర్టాలు వినియోగించలేదు. కరోనా కష్టకాలంలోనూ రూ.38వేల కోట్లు వృథాగా ఉండిపోయాయి.

మైగ్రేషన్‌ కార్డు ద్వారా  ప్రయోజనాలు

  • ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్యబీమా ద్వారా ఆరోగ్యబీమా
  • ప్రమాదవశాత్తు మరణించినా, అంగవైకల్యం చెందినా పీఎం జీవన్‌జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షబీమా యోజన కింద పరిహారం. 
  • పీఎం శ్రమ్‌యోగి మన్‌ధాన్‌ యోజన కింద జీవిత కాలపెన్షన్‌.
  • ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో జీవనాధార భత్యం.

తెలంగాణ స్ఫూర్తిగా...

రాష్ట్ర అభివృద్ధిలో వలసకూలీలు కూడా భాగస్వాములేనని భావించిన తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ సమయంలో వారిని పెద్దఎత్తున ఆదుకున్నది. వలసకార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా ఆదేశించారు. ఒక్కరోజులోనే వలసకార్మికుల లెక్కలు తెప్పించారు. వారికి ఒక్కొక్కరికి నెలకు ఆరుకిలోల బియ్యం, కుటుంబానికి రూ.500 నగదు అందజేశారు. స్వగ్రామాలకు వెళ్లేవారికి ప్రభుత్వమే ఖర్చులు భరించి ప్రత్యేక రైళ్ల ద్వారా పంపింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన నగదు పంపిణీ కేంద్రం దృష్టిని ఆకర్షించింది. దీనిని స్ఫూర్తిగా తీసుకుని దేశవ్యాప్తంగా వలస కార్మికులకు మైగ్రేషన్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది.


logo