మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 17:12:51

తుదిదశకు ‘రామప్ప పంప్ హౌస్’ నిర్మాణ పనులు

తుదిదశకు ‘రామప్ప పంప్ హౌస్’ నిర్మాణ పనులు

వరంగల్ రూరల్: రామప్ప ట్యాంక్ వద్ద ఉన్న రామప్ప నుంచి పాఖాలకు గోదావరి జలాలను తరలించే పంప్ హౌస్ నిర్మాణ పనులను పర్యవేక్షించినట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. రామప్ప-రంగాయ చెరువు పంప్ హౌస్ నిర్మాణ పనులను ఆయన తెలంగాణ రాష్ట్ర జలవనరుల సంస్థ చైర్మన్ వి. ప్రకాశ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పంస్ హౌస్ నిర్మాణాలకు సంబంధించిన మోటర్లును బిగించే కార్యక్రమం కూడా వేగవంతంగా జరుగుతుందని చెప్పారు.

మరో 15 రోజుల్లో మోటార్ల బిగింపు కార్యక్రమం పూర్తి కానుందని వివరించారు. గత యాసంగి పంటకు రామప్ప నుంచి రంగాయ చెరువు ప్రాజెక్టుకు సంబంధించి పంపు ద్వారా మోటర్లను ఆన్ చేసి ట్రయల్ నిర్వహించి నీటిని విడుదల చేశామన్నారు. రెండో ప్రాజెక్టు అయిన రామప్ప- పాఖాలకు సంబంధించిన పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. రాబోయే యాసంగి పంటకు కచ్చితంగా నర్సంపేట నియోజకవర్గంలోని పాఖాల ఆయకట్టు, రంగాయ చెరువు రైతులకు రెండు ప్రాజెక్టుల ద్వారా సుమారు 70 వేల ఎకరాలకు సాగు నీరిచ్చే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

వాటికి సంబంధించి పెండింగ్ లో ఉన్న పనులను సూక్ష్మ స్థాయిలో పర్యవేక్షించి మీక్షించినట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జలవనరుల సంస్థ చైర్మన్ వి. ప్రకాష్, దేవాదుల ప్రాజెక్టు ఇంజినీర్ ఇన్ చీఫ్ బంగారయ్య, ఈఈ సాయిబాబా, డీఈ రాజు, మెగా ఏజెన్సీ కంపెనీ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.


logo