గురువారం 28 మే 2020
Telangana - May 23, 2020 , 01:41:00

నిర్మాణరంగంలో న్యాక్‌ శిక్షణ

నిర్మాణరంగంలో న్యాక్‌ శిక్షణ

  • జిల్లా యూనిట్‌గా నిరుద్యోగుల సమీకరణ
  • ప్రత్యేక యాప్‌ ద్వారా కార్మికుల రిజిస్ట్రేషన్‌

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా భయంతో వలసకూలీలు స్వస్థలాలకు వెళ్లడంతో ఏర్పడిన కార్మికుల కొరతను అధిగమించేందుకు నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌(న్యాక్‌) పూనుకున్నది. గ్రామాల్లో నిరుద్యోగ యువతకు భవననిర్మాణ రంగంలో ఉపాధి కల్పించేందుకు సిద్ధమవుతున్నది. ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, న్యాక్‌ డీజీ సభ్యకార్యదర్శిగా మరో  ఏడుగురు సభ్యులతో ఎక్స్‌పర్ట్‌ కమిటీని  రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో క్రెడాయ్‌, బిల్డర్స్‌ అసోసియేషన్‌, ట్రెడా నుంచి ప్రతినిధులు ఉన్నారు. ఈ కమిటీ భవననిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, కూలీలు, నిపుణుల కొరతపై అధ్యయనంచేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. నివేదిక ఆధారంగా న్యాక్‌ నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వనుంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నిర్మాణరంగం వేగంగా వృద్ధి చెందుతున్నందున నిపుణులైన కార్మికుల అవసరం పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని కూలీలు, నిరుద్యోగులకు శిక్షణనిచ్చి నిపుణులుగా తయారు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. వారికి మంచి జీతాలు ఇవ్వాలని నిర్ణయించింది. జిల్లాలవారీగా నిరుద్యోగుల వివరాలను ప్రత్యే క యాప్‌ ద్వారా సేకరించాలని న్యాక్‌ భావిస్తున్నది. యాప్‌లో పేర్లను నమోదు చేసుకున్నవారికి 15రోజులు ఉచితశిక్షణ ఇచ్చి నిపుణులైన వర్కర్స్‌గా తయారుచేసి అందించనున్నది. స్కిల్డ్‌ వర్కర్లకు మంచి వేతనాలివ్వాలని, ఇతర రాష్ర్టాల నుంచి రావడానికి ఇష్టపడ్డ కూలీలకు శిక్షణ ఇప్పించాలని అధికారులు నిర్ణయించారు. 


logo