మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 02:01:07

2,046 చదరపు అడుగుల్లో రైతు వేదిక నిర్మాణం

2,046 చదరపు అడుగుల్లో రైతు వేదిక నిర్మాణం

  • ఒక హాల్‌, 2 గదులు, టాయ్‌లెట్స్‌
  • నమూనాకు సీఎం కేసీఆర్‌ ఆమోదం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతులు ఒకచోటికి చేరి వ్యవసాయం, పంటలు, మార్కెటింగ్‌పై చర్చించుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రైతువేదికల నమూనాకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపినట్టు తెలిసింది. ఒక్కో రైతువేదికను 2,046 చదరపు అడుగులలో నిర్మించనున్నారు. హాల్‌, రెండు ప్రత్యేక గదులు, టాయ్‌లెట్స్‌తో ఈ నిర్మాణం ఉండనున్నది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఎర్రవల్లి, మర్కూక్‌లో వీటి నిర్మాణానికి భూమి పూజచేశారు. 

అధికారులు, రైతులు, రైతుబంధు సమితి కోఆర్డినేటర్‌ ఒకేచోట కూర్చొ ని చర్చించుకోవడానికి 1,498 చదరపు అడుగుల వేదికతో 154 మంది కూర్చునేలా హాల్‌ నిర్మించనున్నట్టు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,604 వ్యవసాయ విస్తరణాధికారుల క్లస్టర్లలో రైతువేదికను నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం..  రూ. 350 కోట్లు కేటాయించింది. ఒక్కోదానికి రూ.20 లక్షలు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు. ఇందులో రూ.12 లక్షలు వ్యవసాయశాఖ నుంచి, మరో రూ.8 లక్ష లు ఉపాధి హామీ నిధుల నుంచి వినియోగించనున్నారు. ఇప్పటికే 2,534 క్లస్టర్లలో స్థలాలను వ్యవసాయశాఖ ఆధీనంలోకి తీసుకున్నది.


logo