ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 13:16:06

రైతు వేదికల నిర్మాణం చారిత్రాత్మకం : మంత్రి గంగుల

రైతు వేదికల నిర్మాణం చారిత్రాత్మకం : మంత్రి గంగుల

పెద్దపల్లి  :  దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక రకాల ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి లో ఆయన రైతు వేదిక నిర్మాణానికి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికా లాంటి దేశాల్లో మాత్రమే రైతుకు, ఉపాధ్యాయుడికి అత్యంత గౌరవం ఇస్తున్నారని ఆయన తెలిపారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రైతులకు సమున్నత గౌరవం లభించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని చెప్పారు. రైతు వేదికల నిర్మాణం ఒక చారిత్రాత్మక అవసరం అన్నారు. రైతు వేదికల నిర్మాణం ద్వారా దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో వ్యవసాయానికి సంబంధించి ఏమేమి జరుగుతున్నాయో  తెలుసుకునేందుకు రైతులకు వీలు కలుగుతుందన్నారు.

 ప్రతి ఐదు వేల మంది రైతులకు ఒక క్లస్టర్ గా విభజించి రైతు వేదికల నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ రైతు వేదికలు రాబోయే రోజుల్లో గ్రామాలోని రైతుల ఆర్థిక పరిస్థితులను పూర్తిగా మార్చివేస్తాయన్నారు. రైతు వేదికలు అత్యంత శక్తివంతమైనవిగా నిలుస్తాయని ఆయన వివరించారు. రైతులు రాష్ట్రంలో సంతోషంగా, ఒక్క రైతుకు నష్టపోకుండా లాభసాటి వ్యవసాయం చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అన్నారు. 



logo