శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Aug 25, 2020 , 19:48:59

ద‌స‌రా, దీపావ‌ళిలోగా డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి కావాలి

ద‌స‌రా, దీపావ‌ళిలోగా డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి కావాలి

జనగాం : ద‌స‌రాలోగా కొన్ని, దీపావ‌ళిలోగా మ‌రికొన్ని, మొత్తంగా డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌న్నీ పూర్తి కావాల‌ని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ లోగా పూర్తయిన ఇండ్ల ప్రవేశాలకు తేదీలు, ముహూర్తాలు ఖ‌రారు చేయాల‌ని సూచించారు. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని పాల‌కుర్తి, దేవ‌రుప్పుల, కొడ‌కండ్ల మండ‌లాల వారీగా వేర్వేరుగా ఆయా మండ‌లాల ప్రజాప్రతినిధులు, అధికారులు, ముఖ్య నేత‌లు, క‌లెక్ట‌ర్ నిఖిలతో క‌లిసి మంత్రి ప‌లు అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు, క‌రోనా వంటి ప‌లు అంశాల మీద చ‌ర్చించారు.

ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద‌స‌రా లోగా రికొన్ని, దీపావ‌ళిక‌ల్లా పూర్తిగా అన్ని ఇండ్లు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఒక‌వేళ ఎవ‌రైనా కాంట్రాక్టర్లు అల‌స‌త్వం వ‌హిస్తే వెంట‌నే వారి కాంట్రాక్ట్ ను నిలిపివేయ‌డ‌మేగాక‌, వారిని బ్లాక్ లిస్టులో పెట్టాల‌న్నారు. డ‌బుల్ బెడ్ రూం ఇండ్లకు నిధుల కొర‌త లేద‌ని, స‌మస్యలు ఉంటే ఉంటే, త‌న‌కు వెంట‌నే తెలుపాలన్నారు. రైతు వేదిక‌లు, క‌ల్లాలు, ప్రకృతివ‌నాలు, సీసీ రోడ్లు వంటి అనేక అంశాల మీద మంత్రి ఎర్ర‌బెల్లి స‌మీక్షించారు. 

వేగంగా క‌ల్లాలు, రైతు వేదిక‌లు పూర్తి కావాల‌ని ఆదేశించారు. వ‌ర్షాల కార‌ణంగా జ‌రిగిన పంట న‌ష్టాలు, తెగిన రోడ్లు, చెరువులు, ఇత‌ర‌త్రా ఏమైనా ఉంటే వాటి అంచ‌నాలు పూర్తి చేసి పంపాల‌ని మంత్రి అధికారులకు సూచించారు. కాగా, క‌రోనా విస్తృతి పెరుగుతున్నందున గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.


logo