శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 02:57:04

బీసీల కోసం జాతీయ కమిషన్‌

బీసీల కోసం జాతీయ కమిషన్‌

సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినవర్గాల కోసం జాతీ యకమిషన్‌ ఏర్పాటు చేయడం పీవీ నరసింహారావు ప్రభుత్వం తీసుకున్న ప్రధానమైన నిర్ణ యం. 1993 ఆగస్టు 14న ఈ కమిషన్‌ ఏర్పాటయింది. 1993లో తీసుకువచ్చిన చట్టానికనుగుణంగా ప్రభు త్వం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. పీవీ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు దశాబ్ద కాలం నుంచి రిజర్వేషన్ల కోసం ఇతరత్రా ఉద్యమాలు చెలరేగాయి. అయితే రాజ్యాంగబద్ధంగా, సామాజిక విభేదాలకు తావులేకుండా సామాజికం గా వెనుకబడిన వర్గాల అభ్యున్నతిని సాధిస్తామని పీవీ స్పష్టం చేశారు. ఈకోవలోనే పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్‌ (ఎన్‌సీబీసీ) ఏర్పాటు కీలకమైంది.  గతంలో వెనుకబడిన తరగతుల కోసం కలేకర్‌ కమిషన్‌, బీపీ మండల్‌ కమిషన్లు ఏర్పాట య్యాయి. బీసీలు జనాభాలో 52 శాతం ఉంటారని 1980లో మండల్‌ కమిషన్‌ నివేదిక వెల్లడించింది. దేశంలోని 1, 357 సామాజికవర్గాలను వెనుకబడినవిగా గుర్తించింది. ఎస్సీ, ఎస్టీలతోపాటు బీసీలకు కూడా రిజర్వేషన్‌ కల్పించాలని సూచించింది. ఈ మేరకు రిజర్వేషన్ల శాతాన్ని 22.5 శాతం నుంచి 49.5 శాతానికి పెంచాలని పేర్కొన్నది. దశాబ్దం తరువాత ఈ సూచనలను కేంద్ర ప్రభుత్వం అమలు పరచ తలపెట్టినప్పుడు ఆందోళనలు చెలరేగాయి. 

1992లో ఇందిరాసహానీ కేసు విచారణ నేపథ్యం లో వెనుకబడిన తరగతులకోసం శాశ్వత కమిషన్‌ ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజ్యాంగం ప్రకారం సామాజిక, విద్యాపరంగా వెనుకబాటును మాత్రమే గుర్తించగలమని, ఆర్థికకోణం లేదని స్పష్టంచేసింది. ఈ రకంగా బీసీలకు లబ్ధి చేకూర్చ డం, భద్రత ఇవ్వడం కోసం బీసీ జాబితాలో ఆయా కులాల పేర్లను చేర్చేందుకు, తొలగించేందుకు ఈ కమిషన్‌ అవసరమైంది. జాతీయ పరిస్థితులు, న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేయాలని పీవీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 1993 జాతీయ వెనుకబడిన తరగతుల చట్టాన్ని తెచ్చింది. తర్వాత కాలంలో ఈ చట్టం స్థా నంలో 2017లో  కేంద్రం మరో చట్టాన్ని తెచ్చింది. 2018లో రాజ్యాంగహోదాతో కొత్త జాతీయ బీసీ కమిషన్‌ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. 

సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగం హామీ ఇచ్చిన అన్ని రక్షణలను ఈ కమిషన్‌ దర్యాప్తు చేస్తుంది, పర్యవేక్షిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ వర్గాల సామాజిక ఆర్థిక పురోభివృద్ధికి అవసరమైన సూచనలు చేస్తుం ది. రాష్ట్రపతికి నివేదికలను సమర్పిస్తుంది. వాటిపై పార్లమెంటు చర్చిస్తుంది. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ఉంటే ఆ రాష్ర్టానికి కూడా పంపిస్తారు. ఒకప్పుడు బీసీలకు రిజర్వేషన్లు కల్పించడమే ప్రధానాంశంగా ఉండేది. అయితే ఇప్పుడు వారి పురోభివృద్ధికి చర్యలు తీసుకోవాలనే భావన ముందుకొచ్చింది. అందువల్ల కమిషన్‌ పరిధి కూడా ఆ మేరకు మారిపోయింది. అయితే కమిషన్‌ సూచనలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరచాలని లేదు. ఈ కొత్త కమిషన్‌ ఏర్పాటుచేయడంలో సుప్రీంకోర్టు ఆదేశాలన్నీ అమలు చేయలేదు. 


logo