బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 03:04:43

కొంకణి, మణిపురి, నేపాలీ భాషలకు రాజ్యాంగ హోదా

కొంకణి, మణిపురి, నేపాలీ భాషలకు రాజ్యాంగ హోదా

కొంకణి, మెయిటెయి (మణిపురి), నేపాలీ భాషలను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూలులో చేర్చిన ఘనత పీవీ ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ భాషల వారు ఎంతో కాలంగా రాజ్యాంగ హోదా కోసం ఉద్యమాలు సాగిస్తున్నారు. 1992లో 71వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ మూడు భాషలను ఎనిమిదవ షెడ్యూలులో చేర్చింది. ఎనిమిదవ షెడ్యూలులో మొదట పద్నాలుగు భాషలు ఉండేవి. ఆ తరువాత మరికొన్ని భాషలను చేర్చుకుంటూ పోయారు. 1967లో 21వ రాజ్యాంగ సవరణ ద్వారా సింధీ భాషను చేర్చారు. 2004లో బోడో, డోగ్రీ, సంతాలీ, మైథిలి భాషలను 92 రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం చేర్చింది. ప్రస్తుతం ఎనిమిదవ షెడ్యూలులో 22 భాషలున్నాయి. 

కొంకణి భాష గుర్తింపు కోసం చాలా ఉద్యమాలు జరిగాయి. మరాఠీ భాషాభిమానుల ఒత్తిడికి తట్టుకొని నిలబడవలసి వచ్చింది. గోవా రాష్ట్ర సాధన ఉద్యమం, కొంకణి భాషకు ఆధునిక భాషగా సాహిత్య అకాడమీ చేత గుర్తింపు మొదలైన డిమాండ్లతో ఉద్యమం సాగింది. కొంకణికి రాజ్యాంగ హోదా ఇవ్వాలనే డిమాండ్‌ కూడా ఎంతో కాలంగా ఉన్నది. పలు నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, విద్యార్థి, రాజకీయ ఉద్య మాలు చోటు చేసుకున్నాయి. 1987 ఫిబ్రవరిలో గోవా, డయ్యు, డామన్‌లో కొంకణి ఏకైకా అధి కార భాషగా గుర్తింపు పొందింది. అయితే డామన్‌లో మరాఠీ, డయ్యులో గుజరాతీ భాషలకు కొన్ని సౌలభ్యాలు లభించాయి. 1987 మే 30 వ తేదీన గోవా రాష్ట్రం అవతరించింది. 1975 ఫిబ్రవరి 26న కొంకణిని స్వతంత్ర భాషగా కేంద్ర సాహిత్య అకాడమీ గుర్తించింది. ఈ భాషను రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూలులో చేర్చాలనే డిమాండ్‌ పీవీ హయాంలో నెరవేరింది. 

మణిపురి దక్షిణాసియాలోని అతి పురాతన భాషలలో ఒకటి. ఈ భాషకు సొంత లిపి, లిఖిత సాహిత్యం ఉన్నది. మణిపురి భాషను ఎనిమిదవ షెడ్యూలులో చేర్చాలనే ఉద్యమం కొన్ని దశాబ్దాలుగా సాగింది. ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయడం మొదలుకొని ఆందోళనలు, నిరాహార దీక్షలు సాగాయి. మణిపురి సాహిత్య పరిషత్‌, అఖిల మణిపురి విద్యార్థి సంఘం, మణిపురి భాష సమన్వయ కమిటీ మొదలైన సంస్థలు ఉద్యమంలో పాల్గొన్నాయి. రాజకీయ పక్షాలు కూడా ఈ ఉద్యమంలో చేరాయి. పీవీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మణిపురి ప్రజల ఆకాంక్ష నెరవేరింది. 

నేపాలీ భాషకు రాజ్యాంగ హోదా కోసం కూడా కొన్ని దశాబ్దాల పాటు పోరాటం చేయవలసి వచ్చింది. మొదట డార్జిలింగ్‌లో ఈ డిమాండ్‌ మొదలయింది. ఆ తరువాత దేశవ్యాప్తంగా ఉన్న గోర్ఖాలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. నేపాలీని డార్జిలింగ్‌ జిల్లాలో, రాష్ట్ర స్థాయిలో అధికార భాషగా చేయాలని మొదట డిమాండ్‌ చేశారు. తరువాత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూలులో చేర్చాలనే డిమాండ్‌ దేశవ్యాప్తంగా సాగింది. 1961లో భాషా మాన్యతా సమితి ఏర్పాట యింది. ఈ పతాకం కింద దాదాపు గోర్ఖాలంతా ఏకమయ్యారు. 1972లో అఖిల భారత నేపాలీ భాషా సమితి ఏర్పాయింది. దీంతో ఉద్యమం దేశవ్యాప్తమైంది. 1990లో భారతీయ నేపాలీ రాష్ట్రీయ పరిషత్‌ ఏర్పడింది. రాజకీయ పక్షాలు ఉద్యమంలో చేరకుండా ఉద్యమం సాగడం విశే షం. పీవీ ప్రభుత్వం ఏర్పాటయిన తరువాత కొంకణి, మణిపురి భాషలతో పాటు నేపాలీకి కూడా రాజ్యాంగ హోదా కల్పించారు. 

పీవీ మాట

మతం మనుషులను కలిపివేస్తుంది. ఆధ్యాత్మిక చింతనను జనింపచేస్తుంది. భౌతిక ఆధ్యాత్మిక సంక్షేమాన్ని మెరుగుపరుస్తుంది. ఎన్నికలలో ఓట్ల కోసం రాజకీయాలలో మతాన్ని వాడుకోవడం వాంఛనీయం కాదు. ప్రజలు దీనిని అర్థం చేసుకుంటారని, అటువంటి కుట్రలు ఫలించనీయరని ఆశిస్తున్నా. లౌకికవాదం ప్రకారం అల్ప సంఖ్యాకవర్గాలకు పూర్తి భద్రత ఇవ్వాలని మేం నమ్ముతున్నాం... ఇక్కడ ఏ మతానికి ప్రమాదం లేదు. ఫలానా మతం ప్రమాదం ఉందనే నినాదమే బోగస్‌. ఈ దేశంలో ఏ మతానికి ఎన్నడూ ముప్పు ఏర్పడలేదు, ఏర్పడదు. ఇందుకు హామీ ఇవ్వదలుచుకున్నాము. ఏ మతానికి ముప్పు ఏర్పడకూడదనేది ఈ ప్రభుత్వ దృఢ సంకల్పం. ఏదైనా ముప్పు కనుక ఏర్పడితే, దానిని తొలిగిస్తాం. 

- పీవీ నరసింహారావు


logo