బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 28, 2020 , 10:47:56

ప్రాజెక్టులకు స్థిరంగా కొనసాగుతున్న వరద

ప్రాజెక్టులకు స్థిరంగా కొనసాగుతున్న వరద

నాగర్‌కర్నూల్‌/నాగార్జున సాగర్‌ : కృష్ణా ప్రాజెక్టులకు ఎగువ నుంచి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రాజెక్టులన్నీ నిండికుండలా తొనికిసలాడుతుండటంతో వచ్చిన వరదను వచ్చినట్లు క్రస్టుగేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. అన్నిప్రాజెక్టుల నుంచి కృష్ణమ్మ పాలపొంగులా పరవళ్లు తొక్కుతుండటంతో సుందర దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.

జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద  కొనసాగుతోంది. జలాశయంలోకి 4,21,748 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో 10 గేట్లను 25 అడుగుల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా దిగువ నాగార్జున సాగర్‌కు 5,94,237 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వసామర్థ్యం 885 అడుగులు (215.80 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 884 అడుగులుగా (210.03 టీఎంసీలు) ఉంది.

నాగార్జున సాగర్‌ నుంచి 4 లక్షల క్యూసెక్కులకుపైగా దిగువకు..

నాగార్జున సాగర్‌కు ఎగువ నుంచి వరద  పోతెత్తుతోంది. ఆదివారం ఉదయానికే ప్రాజెక్టు గరిష్ఠనీటిమట్టానికి చేరడం.. వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో  అధికారులు ప్రాజెక్టులో నీటిమట్టాన్ని రెండుఅడుగుల మేర ఖాళీ చేశారు. సాగర్‌కు ఎగువ నుంచి 4,19,251 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 14 గేట్లను 10 అడుగుల మేర, 6 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి స్పిల్‌ వే ద్వారా 3,76,294 క్యూసెక్కులు నదిలోకి విడుదల చేస్తున్నారు. 

కుడికాల్వకు 8,604 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 3,594, ఎస్‌ఎల్‌బీసీకి 1800, లోలెవల్‌ కాల్వకు 300, ప్రధాన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ద్వారా 28,704 క్యూసెక్కులు మొత్తం 4,19,251 క్యూసెక్కుల ప్రవాహం పులిచింతల వైపు వదులుతున్నారు. నాగార్జున సాగర్‌ పూర్తిస్థాయి నీటి నిల్వసామర్థ్యం 590 అడుగులు (312.04 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 589.4 అడుగులు (310.25 టీఎంసీలు)గా ఉంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.




logo