మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 24, 2020 , 09:10:34

శ్రీశైలం, సాగర్‌కు స్థిరంగా వరద

శ్రీశైలం, సాగర్‌కు స్థిరంగా వరద

హైదరాబాద్‌ : కృష్ణానది ప్రాజెక్టులకు వరద స్థిరంగా ప్రవహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నిండడంతో వచ్చిన ఇన్‌ఫ్లోను దిగువకు వదులుతున్నారు. గురువారం ఉదయం 2,10,420 క్యూసెక్కుల ప్రవాహం జలాశయానికి వస్తున్నది. దీంతో అధికారులు ఎనిమిది గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,52,639 క్యూసెక్కుల దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.20 అడుగుల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వసామర్థం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 210.9946 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. కుడిగట్టులో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. 

సాగర్‌కు 1.33లక్షల క్యూసెక్కుల వరద

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు 1,33,350 క్యూసెక్కుల వరద వస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు నిండడంతో అధికారులు వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 309.6546 టీఎంసీల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 589.20 అడుగులకు వరకు నీరుంది. దీంతో అధికారులు 6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 1,33,350 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

సింగూరుకూ వరద..

సంగారెడ్డి : పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 521.60 మీటర్లు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 523.60 మీటర్లు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 20.284 టీఎంసీల మేర నీరుంది. ప్రస్తుతం 10,015 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.logo