గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 12, 2020 , 12:39:40

సీఎం కేసీఆర్‌ను బలహీనపర్చేందుకు కుట్ర : శాసన మండలి చైర్మన్ గుత్తా

సీఎం కేసీఆర్‌ను బలహీనపర్చేందుకు కుట్ర : శాసన మండలి చైర్మన్ గుత్తా

నల్లగొండ : గత ఆరున్నర ఏండ్లలో  రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎలాంటి విద్వేషాలు లేకుండా మత సామరస్యంగా పాలన సాగుతున్నది. అలాంటి కేసీఆర్‌ను బలహీన పర్చాలనే కుట్ర జరుగుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత 70 సంవత్సరాల్లో ఎన్నడూ లేనన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని పేర్కొన్నారు.

పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం సీఎం కేసీఆర్ తోనే సాధ్యం సాధ్యమైందని తెలిపారు. రైతుల పట్ల గతంలో ఎవ్వరూ చూపని ప్రేమను కేసీఆర్ చూపెడుతున్నారని ప్రశంసించారు. ఇంకా రాష్ట్రంలో మరిన్ని పనులు పూర్తి కావాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరవేస్తాం లాంటి మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా ఎగరాల్సింది జాతీయ జెండానేనని హితువు పలికారు. 

ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని దుబ్బాక ఫలితాలపై వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవతున్నాయని తెలిపారు. ధాన్యం కొనేందుకు ఆరు వేల కొనుగోలు కేంద్రాలు, పత్తి కోసం సీసీఐ కేంద్రాలను ఏర్పటు చేశామని వివరాలను వెల్లడించారు. ప్రతి గింజను కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు కూడా సహకరించాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో ఈ సారి భారీగా పంట దిగుబడి వచ్చిందన్నారు. ప్రభుత్వం సామర్థ్యాన్ని మించి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు.

సన్న ధాన్యం రైతుల్లో ఆందోళన వద్దని, కొంత సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ధరణి పోర్టల్‌తో అవినీతిరహిత, పారదర్శకంగా రెవెన్యూ సేవలు అందుబాటులోకి వచ్చాయని అభినందించారు. ఇక నకిరేకల్ నుంచి నాగార్జునసాగర్ వరకు మధ్యలోనే నిలిచిపోయిన 565 జాతీయ రహదారి నిర్మాణ పనులకు మళ్లీ టెండర్లు పిలిచారని చెప్పారు. త్వరలోనే పనులు మొదలు అవుతాయని గుత్తా పేర్కొన్నారు.