శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 02:40:43

సీఎం కేసీఆర్‌ను బలహీనపర్చేందుకు కుట్ర

సీఎం కేసీఆర్‌ను బలహీనపర్చేందుకు కుట్ర

  • ప్రజల్లో విద్వేషాలు పెంచేలా తప్పుడు వ్యాఖ్యలు
  • మండలి చైర్మన్‌ గుత్తా 

నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును బలహీనపర్చేందుకు కుట్ర జరుగుతున్నదనీ, అలా జరిగితే  మనల్ని మనం బలహీనపర్చుకోవడమేనని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆరున్నరేండ్లలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో మతసామర స్యం పరిఢవిల్లిందని చెప్పారు. దీన్ని ఓర్వలేని కొన్ని శక్తులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నాయని విమర్శించారు. ఎవ్వ రు అధికారంలో ఉన్నా గోల్కొండ కోట, ఎర్రకోటపై ఎగురేయాల్సింది జాతీయ జెండానేనని పేర్కొన్నారు. గురువారం నల్లగొండలోని తన నివాసంలో గుత్తా మీడియాతో మాట్లాడారు. మత సామరస్యానికి ప్రతీకగా తెలంగాణ నిలిచిందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని చెప్పా రు. 

వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రైతుల పట్ల ప్రేమ కలిగిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రమేనని స్పష్టం చేశారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కొత్త వాటిని ప్రారంభించారని.. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల లాంటి పథకాలన్నీ పూర్తై రాష్ట్రం పూర్తిగా సస్యశ్యామలం కావాలంటే కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపర్చాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, గెలిచినంత మాత్రా న రోడ్లపై దుంకాయించాల్సిన పని లేదన్నా రు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధు ల్లో భాషావిధానం కొరవడతున్నదని.. దీన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉ న్నదన్నారు. ధరణి పోర్టల్‌తో అవినీతిరహిత, సత్వర సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు ఆరు వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. సన్నరకం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు  సిద్ధంగా ఉన్నదని, రైతులు సంయమనం పాటించాలని సూచించారు.  

గత ఆరున్నరేండ్లుగా తెలంగాణ రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నది.

 - మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి