సోమవారం 25 జనవరి 2021
Telangana - Dec 28, 2020 , 22:17:46

తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర : అదనపు ఈఓ ధర్మారెడ్డి

తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర : అదనపు ఈఓ ధర్మారెడ్డి

తిరుమల :  తిరుమల ఆలయంపై విష ప్రచారం చేయడం ద్వారా ఆలయ పవిత్రతను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి అన్నారు.  టీటీడీ హిందూధర్మ వ్యాప్తికి దశాబ్దాలుగా కృషి చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. శ్రీవారి ఆలయం ఎదుట సోమవారం రాత్రి మీడియాతో ఆయన మాట్లాడారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రాకారంపై పూర్ణకలశ  ఆకారంలోని విద్యుత్ అలంకరణను శిలువగా మార్ఫింగ్ చేసి  తాళపత్ర  నిధి పేస్‌బుక్‌ యూఆర్‌ఎల్‌తోపాటు మరికొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారన్నారని ఆక్షేపించారు.

శ్రీవారి ఉత్సవాల నిర్వహణ సమయంలో హనుమంత, గరుడ, పూర్ణకుంభ అలంకరణలు చేయడం దశాబ్దాలుగా వస్తున్నదని అన్నారు.  తాళపత్ర నిధి ఫేస్‌బుక్‌ యూఆర్‌ఎల్‌, కొందరు పవిత్రమైన కలశాన్ని శిలువగా మార్ఫింగ్ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని మండిపడ్డారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేశామన్నారు. హిందువుల ఆరాధ్య దైవమైన వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల క్షేత్రంపై  తరచూ కొందరు  పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే  వారిని ఉపేక్షించబోమని ఇలాంటి వారిపై  టీటీడీ చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మీడియాతోపాటు భక్తులకు సదరు కలశం విద్యుత్ అలంకరణను చూపించారు. చీఫ్ ఇంజినీర్ రమేశ్‌ రెడ్డి, ఎస్ఈ నాగేశ్వరరావు, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఆలయ ఓఎస్డీ పాలశేషాద్రి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

అది శిలువ కాదు :  భక్తులు

    శ్రీవారి ఆలయ ప్రాకారం మీద ఏర్పాటు చేసిన పూర్ణకుంభంలో పువ్వులా విద్యుత్ అలంకరణ చేశారని, అది శిలువ కాదని ప్రత్యక్షంగా చూసిన పలువురు భక్తులు  స్పష్టంచేశారు. పూర్ణకుంభాన్ని మార్ఫింగ్ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని వారు చెప్పారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే వారిని  ఉపేక్షించవద్దని టీటీడీకి సూచించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo