శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Dec 01, 2020 , 02:05:32

పచ్చని భాగ్యనగరంలో మత చిచ్చుకు కుట్ర

పచ్చని భాగ్యనగరంలో మత చిచ్చుకు కుట్ర

 • స్మార్ట్‌ఫోన్‌ సాక్షిగా బండిబ్యాచ్‌ బాగోతం
 • వాట్సాప్‌ చాట్‌తో బయటపడ్డ బండారం
 • వాకింగ్‌ పేరుతో నెక్లెస్‌ రోడ్డుకు బండి సంజయ్‌ 
 • ఫోన్‌ రావడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు
 • సంజయ్‌ని కారులో పంపించిన పోలీసులు
 • బండి ఉన్నాడని వచ్చిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు
 • అప్పటికే ఈట్‌స్ట్రీట్‌లో టిఫిన్‌ చేసి వెళ్లిన బండి
 • వెనుక కారును అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు
 • పైసలు పంచుతున్నారని టీఆర్‌ఎస్‌ నిలదీత
 • జరిగింది ఇదైతే.. బీజేపీ వంకర ప్రచారం
 • సంజయ్‌పై హత్యాయత్నమంటూ అబద్ధాలు
 • కారులోనే లేని సంజయ్‌పై దాడి ఎలాసాధ్యం?
 • ముస్లింలే చేశారంటూ వాట్సాప్‌లో బొంకులు
 • దీన్నే ప్రచారం చేయాలని రాకేశ్‌రెడ్డి సందేశం
 • 9000522400 ఫోన్‌ నంబర్‌ నుంచి మెస్సేజ్‌
 • అతడు బీజేపీ అధికార ప్రతినిధి, బండి మనిషి

దెబ్బతిన్న కారులో సంజయ్‌ లేరు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఊహించినట్టే జరుగుతున్నది. పచ్చని నగరంలో చిచ్చుపెట్టే కార్యక్రమం ఎన్నికలకు ముందే ప్రారంభమైంది. బీజేపీ నేతలు మతపరమైన గొడవలు సృష్టించేందుకు ‘గిల్లి పంచాయితీ’ పెట్టుకొనే చర్యలకు దిగారు. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌.. గతంలో దుబ్బాకలో చేసినట్టుగానే హైదరాబాద్‌లోనూ మతపరమైన విద్వేషరాజకీయాలకు విత్తనం వేశారు. కొద్దిగంటల్లో పోలింగ్‌ సమీపిస్తున్న తరుణంలో ఓటర్లలో భయాందోళనలను సృష్టించడానికి.. తనపై ముస్లింలు దాడిచేశారని తన అనుచరులతో సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున దారుణమైన ప్రచారాన్ని మొదలుపెట్టారు. ప్రశాంతంగా ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో ఒక రాజకీయపరమైన దాడిని మతపరమైన దాడిగా చిత్రీకరించి నాలుగు ఓట్లు సంపాదించేందుకు చిల్లర చేష్టలకు దిగారు. ప్రచారం ముగిసిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే వాకింగ్‌ పేరుతో రోడ్డుపై పడి గొడవకు పురికొల్పాడు. రాత్రిపూట అవసరం లేని ప్రదేశానికి వెళ్లటంతో అనుమానించిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అక్కడ గుమికూడటంతో అదే అదనుగా బీజేపీ కార్యకర్తల చేత గొడవ చేయించాడు. 

ఇదీ జరిగింది..

రాత్రి 9 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. గోశాల, హుసేన్‌సాగర్‌, నెక్లెస్‌రోడ్డు, గోకుల్‌చాట్‌ పర్యటనకు బయలుదేరనున్నట్టు ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. కొద్దిసేపటికే బండి సంజయ్‌ తన అనుచరులతో నాలుగైదు కార్లలో వాకింగ్‌ కోసమంటూ వచ్చి గోశాల వద్ద మకాం వేశారు. అక్కడ కాసేపు ఉన్న తర్వాత కాలినడకన నెక్లెస్‌రోడ్‌లో వెళ్తుండగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమందించారు. సమాచారం అందుకొన్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని బండిసంజయ్‌తో మాట్లాడారు. ఈ సమయంలో ఇక్కడ ఉండటం భావ్యం కాదు వెళ్లిపోండి అని సంజయ్‌కి ఎంతో సంయమనంతో చెప్పారు. అయితే పోలీసుల మాట లెక్కచేయకుండా దుబ్బాకలో చేసినట్టు చీప్‌ ట్రిక్స్‌ ప్లే చేయబోయిన సంజయ్‌ విఫలమయ్యాడు. పోలీసులు ఎక్కువ మంది ఉండటంతో, ఫ్లయింగ్‌ స్వాడ్‌ కూడా రావటంతో అక్కడి నుంచి సంజయ్‌ బయలుదేరి దగ్గర్లోని ఈట్‌ స్ట్రీట్‌ హోటల్‌కు వెళ్లి అక్కడ టీ తాగారు. హోటల్‌లోనే కాసేపు ఉండి.. వెళ్లిపోయారు. 

ఆయన వెళ్లిపోయిన కొద్దిసేపటికే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయారెడ్డి అక్కడి చేరుకొని సంజయ్‌కు చెందిన మరో కారును అడ్డుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సంజయ్‌ డబ్బుతో వచ్చారని,  డబ్బు సంచులున్న కారును ఎలా వదిలేస్తారని నిలదీశారు. బీజేపీ కార్యకర్తలు ఆమెతో కావాలని కయ్యం పెట్టుకున్నారు. కొద్దిసేపు వాదులాట జరిగింది. ఈలోగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బీజేపీ నేతల కారు అద్దాలు పగులగొట్టారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉండటంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పంపించివేశారు. 

ధ్వంసమైన కారులో బండి సంజయ్‌ లేనేలేడు. అయినా తనపై హత్యాయత్నం జరిగినట్టుగా సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు. సాక్షాత్తూ బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్‌ రెడ్డి ఈ గోబెల్స్‌ ప్రచారానికి నాయకత్వం వహించారు. బీజేపీ మీడియా ఫ్రెండ్స్‌ అనే వాట్సాప్‌ గ్రూపులో ‘ముస్లింలు బండి సంజయ్‌పై దాడిచేశారు’ అన్న సందేశాలు పెట్టి మీడియాను తప్పుదోవ పట్టించారు. 

వెంటనే సంజయ్‌ అనుచరగణం సోషల్‌ మీడియాలో చెలరేగిపోయింది. తమ నాయకుడిపై జరగని దాడిని జరిగినట్టుగా.. అది కూడా ముస్లింలు దాడిచేసినట్టుగా ప్రచారంలోకి తేవాలన్న రాకేశ్‌రెడ్డి సందేశాన్ని వైరల్‌ చేయటం మొదలు పెట్టింది. వార్తా చానళ్లకు కూడా సంజయ్‌పై ముస్లింలు దాడి చేశారన్న లైన్‌లోనే సందేశాలు పంపించారు. 

దాడి జరిగిన కారులో బండి లేరు

దాడి జరిగిన కారులో బండి సంజయ్‌ లేరని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి రాత్రి 10.30కు నిర్వహించిన మీడియా సమావేశంలో ధృవీకరించారు. కిషన్‌రెడ్డితోపాటు బీజేపీ నేతలంతా మీడియాకు ఎక్కి టీఆర్‌ఎస్‌పై విమర్శలకు దిగారు. చేతనైతే చేసిన అభివృద్ధి గుంచి చెప్పుకోవాలి కానీ.. విపక్షాలపై భౌతిక దాడులకు దిగుతారా అంటూ కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించటం కొసమెరుపు.

చంపాపేటలో బీజేపీ దౌర్జన్యం డబ్బు పంచుతూ పట్టుబడి.. ఆపై బుకాయింపు

ఎల్బీనగర్‌: బీజేపీ నేతల దౌర్జన్యానికి చంపాపేట డివిజన్‌లోని దుర్గానగర్‌ వేదికైంది. ఓటర్లను కొనేందుకు కమలనాథులు సోమవారం రాత్రి డబ్బులు పంచుతూ టీఆర్‌ఎస్‌ నేతలకు అడ్డంగా దొరికిపోయారు. అసలు రంగు బయటపడుతుందనే భయంతో.. టీఆర్‌ఎస్‌ వాళ్లే డబ్బు పంచుతున్నారని బుకాయించారు. ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్‌ ముద్రబోయిన శ్రీనివాస్‌రావు సంఘటనా స్థలికి చేరుకోగా, మరోవైపు బీజేపీ నేతలకు మద్దతుగా ఆ పార్టీ అభ్యర్థి వంగా మధుసూదన్‌రెడ్డి తన అనుచరవర్గంతో అక్కడకు వచ్చారు.  మధుసూదన్‌రెడ్డి అయ్యప్ప మాల వేసుకున్న సంగతి మరిచి అబద్ధాలాడుతూ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో దుర్భాషలాడారు. తీవ్ర వాగ్వాదానికి దిగారు. సుధీర్‌రెడ్డిపై దాడికి యత్నించారు. ఇరుపార్టీల నాయకుల అరుపులు, కేకలతో దుర్గానగర్‌ దద్దరిల్లింది. రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ అక్కడకు చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని తామంతా ప్రయత్నిస్తుంటే బీజేపీ నాయకులు రెచ్చగొట్టి దాడులకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆరోపించారు. దుర్గానగర్‌లో బీజేపీ అభ్యర్థి మధుసూదన్‌రెడ్డి, ఆ పార్టీ నాయకులు డబ్బు పంచుతుంటే టీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకున్నారని తెలిపారు. కానీ, మధుసూదన్‌రెడ్డి బుకాయించి దౌర్జన్యం చేయాలని ప్రయత్నించాడని చెప్పారు. ఎస్వీ కాలనీకి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు రోజారెడ్డి, నర్మదల నివాసాలపై దాడులుచేసి, ఇంట్లో వస్తువులను ధ్వంసం చేశారని పేర్కొన్నారు.

ఇది బండి సంజయ్‌ ఎన్నికల స్టంట్‌: విజయారెడ్డి

ఖైరతాబాద్‌ : బండి సంజయ్‌ డబ్బులు పంచేందుకు వచ్చి అడ్డంగా దొరికి దాడి డ్రామాలకు తెరలేపాడని కార్పొరేటర్‌ పీ విజయా రెడ్డి విమర్శించారు.  నెక్లెస్‌రోడ్‌లో జరిగిన ఉదంతాన్ని ఆమె సోమవారం రాత్రి మీడియాకు వివరించారు. పోలింగ్‌కు  కొద్ది గంటలు ముందు  రెండు వాహనాల్లో కార్యకర్తలతో బండి సంజయ్‌ ఎంఎస్‌ మక్తా ప్రాంతానికి వచ్చాడని, అక్కడ ఖాళీ స్థలంలో కొద్ది మంది అనుచరులతో ఫుట్‌బాల్‌ ఆడుతుండగా, మరికొందరు ఎంఎస్‌ మక్తాలో డబ్బులు పంపిణీ కార్యక్రమానికి ఉపక్రమించారని తెలిపారు. ఆ విషయం తెలుసుకొని స్థానిక కార్పొరేటర్‌గా పోలీసులకు సమాచారం అందించానని, అయితే అక్కడికి పోలీసులు చేరుకున్న క్రమంలో తాపీగా నడుచుకుంటూ అక్కడే హోటల్‌లో టీ తాగుతానని చెప్పి నాటకాలు ఆడారని ఆరోపించారు. వాహనాలు తనిఖీ చేయాలని కోరగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారని, తనపై కూడా దాడి చేసి పక్కకు నెట్టివేసి కారు స్టార్ట్‌ చేసి వెళ్లిపోయారని మండిపడ్డారు. కచ్చితంగా వాహనాల్లో డబ్బులు ఉన్నాయన్నారు. ఎన్నికల సమయంలో బాధ్యతగల ఎంపీ హోదాలో, రాష్ట్ర అధ్యక్షుని స్థానంలో ఉండి ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ ప్రదర్శించడం సరికాదన్నారు. బండి సంజయ్‌, అతని అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

‘బీజేపీ మీడియా ఫ్రెండ్స్‌' అనే వాట్సాప్‌ గ్రూపులో 90005 22400 నంబర్‌తో రాకేశ్‌రెడ్డి చాటింగ్‌ ఇదీ

రాత్రి 9.27 గంటలకు: ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్‌రెడ్డి తదితర నాయకులపై నెక్లెస్‌ రోడ్డులో దాడికి ముస్లింల యత్నం.. అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు’ అంటూ రాకేశ్‌రెడ్డి సందేశాలు పంపాడు.  గరికపాటి, నర్సాపూర్‌ గోపి కూడా ఉన్నారు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ కార్యకర్తలు.. సేఫ్‌గా బండి సంజయ్‌ను అక్కడి నుంచి పంపించివేసిన బీజేపీ కార్యకర్తలు అని మరో మూడు మెసేజ్‌లు పెట్టారు. 

రాత్రి 9.31 గంటలు: నెక్లెస్‌ రోడ్డుపై గొడవకు సంబంధించి రాకేశ్‌రెడ్డి పోస్ట్‌ చేసిన వీడియోనుకు రిైప్లె ఇస్తూ అగస్త్య టీవీ9 అనే వ్యక్తి ‘థ్యాంక్యూ భయ్యా’ అని మసేజ్‌ పెట్టారు. 

9.48 గంటలకు: ‘ఇప్పుడు అన్న ఎక్కడ ఉన్నారు, ఎవరు దాడి చేశారు?’ అని జ్యోతి కిరణ్‌ అనే నంబర్‌ (9394450108) నుంచి మెసేజ్‌ వచ్చింది.

రాత్రి 9.49గంటలకు: దాడి చెసింది విజయారెడ్డి వాళ్లా అని రామకృష్ణ అనే మరో వ్యక్తి అడిగారు.

9.55 గంటలకు:  కాదు.. ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్‌రెడ్డి తదితర నాయకులపై నెక్లెస్‌ రోడ్డులో దాడికి ముస్లింల యత్నం.. అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు’ అనే మెసేజ్‌ను మళ్లీ పంపిన రాకేశ్‌రెడ్డి.. ఇదే లైన్‌లో ప్రసారం చేయండి అని కోరారు. దీనిపై 10.30 గంటలకు ప్రెస్‌ మీట్‌ పెడుతున్నట్టు కూడా చాటింగ్‌లో పేర్కొన్నాడు.  

ఫేస్‌బుక్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారని, వాట్సాప్‌లో ముస్లింలు దాడి చేశారని ప్రచారం చేసుకున్నారు. ముస్లింలు హత్యాయత్నం చేస్తే విజయారెడ్డి వారికి మద్దతు పలికారని పోస్టులు పెట్టాడు. 

సంజయ్‌పై దాడి జరగలేదు: విశ్వప్రసాద్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఎటువంటి దాడి జరగలేదని సెంట్రల్‌ జోన్‌ జాయింట్‌ కమిషనర్‌ విశ్వప్రసాద్‌ పేర్కొన్నారు. నెక్లెస్‌ రోడ్‌ ఘటన వివరాలను ఒక ప్రకటనలో తెలిపారు. 

1. వార్తా చానెళ్లలో వచ్చినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై దాడి జరుగలేదు.

2. బండిపై హత్యాయత్నం జరుగలేదు. ఆయనకు గాయాలు కాలేదు.

3. ఓటర్లకు పంపిణీ చేయడం కోసం బండి నగదు తీసుకుని వెళుతున్నారన్న అనుమానంతో రెండు రాజకీయ పార్టీల మధ్య జరిగిన గొడవే అది.

4. వాస్తవం ఏమిటంటే ఈవెనింగ్‌ వాక్‌ కోసం బండి నెక్లెస్‌ రోడ్డుకు వచ్చారు. 

5. రాత్రి సుమారు 8.30 గంటలకు, నెక్లెస్‌ రోడ్డులో తిరుగుతున్నారన్న సమాచారం పోలీసులకు వచ్చింది.

6. ఈ సమాచారం అందడంతో రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ తన సిబ్బందితో నెక్లెస్‌ రోడ్డుకు చేరుకున్నారు. అక్కడ తిరగడం మంచిది కాదని, భద్రతా సమస్య ఏర్పడుతుందని, అక్కడ నుంచి వెళ్లిపోవాలని బండిని కోరారు. 

7. బండి అంగీకరించి, ఈట్‌ స్ట్రీట్‌ రెస్టారెంట్‌లో టిఫిన్‌ తిని వెళ్లిపోతానని చెప్పారు. టిఫిన్‌ చేసిన అనంతరం ఆయన హోటల్‌ నుంచి వెళ్లిపోయారు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అక్కడకు వచ్చారు. 

8. ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకునేలోపే బండి సంజయ్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

9. సంజయ్‌ అనుచరుడి కారును తనిఖీ చేసేందుకు అక్కడ ఉన్నవారు ఆపారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అంతలోనే కొందరు వ్యక్తులు చేతులతోనే కారు ముందు అద్దం పగులగొట్టారు.

10. కారులో ఉన్నవారిని రక్షించేందుకు పోలీసులు ఆ కారును అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. గుమికూడినవారిని చెదరగొట్టారు.

11. కారు యజమానులు రామ్‌గోపాల్‌ పేట్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. 

12. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.