గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 00:33:04

పెట్టుబడులను తరలించే కుట్ర

పెట్టుబడులను తరలించే కుట్ర

  • 67 వేల కోట్లతో హైదరాబాద్‌ను అభివృద్ధిచేసిన టీఆర్‌ఎస్‌
  • అందులో కేంద్రం వాటా ఎంత? 
  • పక్కరాష్ట్రంలోనే పసలేనోడు ఇక్కడేం చేస్తడు?
  • ప్రభుత్వవిప్‌ బాల్క సుమన్‌ ఫైర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సారథ్యంలో హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, వాటిని బీజేపీ పాలిత రాష్ర్టాలకు తరలించుకుపోయేందుకు ఆ పార్టీనేతలు కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ఆరోపించారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలంటే భయపడేలా సురక్షితంగా ఉన్న హైదరాబాద్‌లో విద్వేషపూరిత వాతావరణం సృష్టించాలని చూస్తున్నారని తెలిపారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ నేతలు గట్టు రాంచందర్‌రావు, పట్లోళ్ల కార్తీక్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపు, దార్శనికతతో ఎవరి ఆటలు సాగనీయరని బాల్క సుమన్‌ స్పష్టంచేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ. 67 వేల కోట్లతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిందని, అందులో కేంద్రం ఎంత వాటా ఇచ్చిందో బీజేపీ నాయకులకు దమ్ముంటే చెప్పాలని డిమాండ్‌ చేశారు. రూ.67 వేల కోట్లలో కేంద్రం నుంచి కనీసం 67 పైసలు కూడా తీసుకురాకుండా.. అంతా వాళ్లే చేశారంటూ బీజేపీ నాయకులు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆరేండ్లుగా ప్రశాంతంగాఉన్న నగరంలో బీజేపీ అరాచకాలు సృష్టించాలని, విద్వేషాలు రగిలించాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. హైదరాబాద్‌ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ విజ్ఞతతో ఆలోచించి టీఆర్‌ఎస్‌కు ఓటేయాలని కోరారు. కులాలు, మతాలు, మనుషుల మధ్య చిచ్చుపెట్టడమే కమలనాథుల అసలు నైజమని అన్నారు. 

టీఆర్‌ఎస్‌తోనే దళితవర్గాలు సౌఖ్యం

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే సామాజిక న్యాయం జరుగుతున్నదని ప్రజలంతా భావిస్తున్నారని బాల్క సుమన్‌ చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న అన్నివర్గాలు ప్రత్యేకించి దళితవర్గాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోని అరాచకం తెలంగాణ గడ్డమీదకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీజేపీపాలిత రాష్ర్టాలైన గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ర్టాల్లో దళితులపై వరుసగా జరుగుతున్న దాడులను గుర్తెరిగి టీఆర్‌ఎస్‌కు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈసారి టీఆర్‌ఎస్‌ సెంచరీ కొడుతుందని బాల్కసుమన్‌ ధీమా వ్యక్తం చేశారు. అన్ని పార్టీలకంటే ముందుగా రికార్డుస్థాయిలో అభ్యర్థులను ప్రకటించి, బీ-ఫామ్స్‌ సమర్పించి ప్రజల ముందు ప్రగతి నివేదనంతో తమ పార్టీ ప్రచారంలో దూసుకెళుతుందని అన్నారు. పక్కరాష్ట్రంలో రెండుస్థానాల్లో పోటీచేసి ఓడిపోయిన వ్యక్తి జీహెచ్‌ఎంసీలో బరిలో దిగుతాననడం హాస్యాస్పదంగా ఉన్నదని బాల్క సుమన్‌ అన్నారు. ఏపీలో జనసేనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పుడు పవన్‌ వెంట లేడని, అలాంటి పార్టీని బీజేపీ కలుపుకుపోవడం విడ్డూరంగా ఉన్నదన్నారు. ఏపీలో ఏమీ చేయలేనోడు ఇక్కడేం చేస్తాడని ఎద్దేవా చేశారు.