e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home Top Slides విషపు రాతల విచ్చుకత్తులు

విషపు రాతల విచ్చుకత్తులు

విషపు రాతల విచ్చుకత్తులు
  • బతికున్న వ్యక్తి చనిపోయాడని రాసిన వైనం
  • తాను బతికే ఉన్నానంటూ రోగి బక్కారెడ్డి ఆవేదన
  • ప్రభుత్వ వైద్యవ్యవస్థను దెబ్బతీసేందుకు కుట్ర
  • వైద్యుల మానసిక ైస్థెర్యాన్ని బలహీనపరిచే రాతలు

68 ఏండ్ల ఓ వృద్ధుడు.. కరోనా సోకడంతో సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో చేరి చికిత్స పొందుతున్నాడు. వైద్యులు, సిబ్బంది ఎప్పటికప్పుడు తగిన వైద్యసేవలు అందిస్తున్నారు. కానీ, ఏం పాడు కామెర్లొచ్చినయేమో.. పెట్టుబడిదారీ విషపుత్రికైన ఓ పత్రిక ఆ వృద్ధుడిని బతికుండగానే చంపేసింది. వైద్యులు ఆక్సిజన్‌ పెట్టకపోవడంవల్లనే చనిపోయాడంటూ నోటికొచ్చినట్టు కారుకూతలు కూసింది. తీరా చూస్తే.. ఆ వృద్ధుడు నేను బతికున్నానంటూ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇదేం దుర్మార్గం? ఇదేమి పాత్రికేయం? ప్రభుత్వాన్నో, ముఖ్యమంత్రినో లక్ష్యం చేసుకోవడం కోసం మొత్తం వ్యవస్థనే విధ్వంసం చేసే కూటనీతి కాక మరేమిటిది? వైద్యుల విశ్వసనీయతను దెబ్బతీసే కుట్ర కాక మరేమిటి?
సిద్దిపేట, మే 22 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గాంధీ, ఎంజీఎం దవాఖానలకు వెళ్లి ఒక్కో రోగిని పలకరిస్తూ.. నేనున్నానంటూ ధైర్యం కలిగించేందుకు కృషిచేస్తున్నారు. అటు కొవిడ్‌, ఇటు బ్లాక్‌ ఫంగస్‌.. రెంటినీ సమాంతరంగా ఎదుర్కొంటూ.. ఎప్పటికప్పుడు వైద్య సౌకర్యాలను మెరుగుపరుస్తూ.. ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యాన్నిచ్చి దేశంలోనే సమర్థమైన వైద్యసేవలను అందిస్తున్నారు. కానీ, కొన్ని పత్రికలు.. పెట్టుబడిదారీ వ్యవస్థ విష పుత్రికలు.. తెలంగాణ ఆరోగ్య వ్యవస్థను ధ్వంసం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది మానసిక ైస్థెర్యాన్ని దెబ్బతీసేలా.. వారిని అవమానించేలా.. ఆందోళనకు గురిచేసే విధంగా పిచ్చిరాతలు.. అబద్ధాల కూతలు రాస్తున్నాయి.. కూస్తున్నాయి. ప్రభుత్వ వైద్య వ్యవస్థపైన, ప్రభుత్వ దవాఖానలపైన గత ఏడేండ్లుగా ప్రజల్లో పెరిగిన నమ్మకాన్ని బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి.

వాస్తవంగా ప్రభుత్వ దవాఖానలు లేకుంటే.. ప్రభుత్వం దీర్ఘకాల దృష్టితో వైద్య వ్యవస్థను పటిష్ఠం చేయకపోతే.. తెలంగాణలో కొవిడ్‌ను తట్టుకోవడం సాధ్యమయ్యే పనేనా? కనీసం ఈ ఇంగితం కొంచెమైనా లేకుండా.. ప్రభుత్వ వైద్యవ్యవస్థను, వైద్యులను, నర్సులను అప్రదిష్టపాల్జేయడం ఎవరి ప్రయోజనాలు కాపాడటానికి? ఇలాంటి దిగజారుడు రాతలతో వీళ్లు ఎవరికి మేలు చేస్తున్నట్టు? ఎందుకింత దుర్మార్గానికి పాల్పడుతున్నారు? వాస్తవాలు పట్టించుకోకుండా ఇష్టారీతిగా ఓ పత్రిక నిరుపేదలకు అందుతున్న వైద్యం చూసి ఓర్వలేక విషాన్ని చిమ్ముతున్నది. పేదలకు అందుతున్న వైద్యాన్ని చూసి ఓర్వలేక, ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కళాశాల దవాఖానలో రోగులను పట్టించుకుంటలేరంటూ అబద్ధపు ప్రచారానికి ఒడిగట్టింది.

ఇదీ నిజం..

సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన బక్కారెడ్డి ఈనెల 17న ఆక్సిజన్‌ లెవల్స్‌ 89 శాతానికి తగ్గడంతో సిద్దిపేట మెడికల్‌ కళాశాలలో చేరారు. అతనికి ఐదు రోజులుగా డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్‌ సైతం ఇచ్చారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం మెరుగుపడుతున్నది. ఆక్సిజన్‌ లెవెల్స్‌ 96 శాతం చేరుకున్నాయి. అతను బెడ్‌పై నిద్రపోతుండగా శుక్రవారం కొంతమంది వీడియోలు, ఫొటోలు తీసి చనిపోయాడని తప్పుడు ప్రచారంచేస్తూ సోషల్‌ మీడియాలో ప్రచారంచేశారు.ఈ ఫొటోలు పట్టుకొని ఓ పత్రిక బక్కారెడ్డి చనిపోయినట్టుగా చిత్రించి తప్పుడు కథనాన్ని అల్లి నానాయాగీ చేసింది.

అయ్యా నేను బతికే ఉన్న: బక్కారెడ్డి

అయ్యా నేను బతికే ఉన్నా.. నేను చనిపోయానంటూ రాసిండ్రు అంటూ రోగి బక్కారెడ్డి ఆ పేపర్‌లో తన ఫొటోతో వచ్చిన కథనాన్ని చూపించిండు. ‘నాకు దవాఖానకు వచ్చినప్పటి నుంచి పాణం మంచిగైతంది. డాక్టర్లు మంచిగ చూస్తున్నరు. ఐదు రోజుల నుంచి దవాఖానలోనే ఉన్న. నేను పడుకున్నప్పుడు ఎవరో వచ్చి ఫొటోలు తీసిండ్రంట.. గిట్ల ఉంటదా.. నేను బతికే ఉంటిని.. ఇదెట్టా సచ్చిపోయింది తెలియదా వాళ్లకు? గిట్ల రాసిండ్రు’ అంటూ బక్కారెడ్డి వాపోయాడు.
సీఎంను వ్యతిరేకించడం అంటే వ్యవస్థల ధ్వంసం కోరుకోవడమేనా?
ఆ పత్రిక లక్ష్యం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును వ్యతిరేకించడం.. ఏ పనిచేసినా ఏదోవిధంగా బద్నాం చేయాలె.. ఇందుకోసం ఎంతకైనా తెగించాలె.. నిత్యం ఇదే పని. కానీ, వైద్యం అన్నది ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశం. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడివడిన తర్వాత ప్రభుత్వ వైద్య రంగం ఎంతో మెరుగుపడింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. నిర్ణయాలు తీసుకొంటూ దేశంలోనే పటిష్ఠంగా తయారుచేస్తున్నారు. అందుకే.. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో తెలంగాణకు రోగులు వచ్చి వైద్యం చేయించుకొంటున్నారు. వైద్యంకోసం వచ్చిన వారిని కాదనకుండా.. ఓపికగా తెలంగాణ వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రజలకు ఆసరాగా నిలబడి.. వారికి మంచి వైద్యాన్ని అందించడం కోసం కృషిచేయాల్సిన పత్రిక బాధ్యతారాహిత్యంతో వ్యవహరించడం క్షమించరాని దుర్మార్గం.

హడావిడి.. హంగామా

ఇదే సిద్దిపేట దవాఖానకు అంతకుముందు ఈ నెల 16 న బిపాషా అనే వృద్ధురాలు చికిత్సకోసం వచ్చింది. ఆమె ఆక్సిజన్‌ లెవల్స్‌ 36 శాతం ఉన్న అత్యంత విషమ సమయంలో ఆమెను దవాఖానకు తీసుకొచ్చారు. రోగి పరిస్థితి విషమంగా ఉన్న విషయాన్ని వైద్యులు కుటుంబ సభ్యులకు ముందే చెప్పారు. అయినా ప్రయత్నించాలని వారు కోరడంతో చికిత్స ప్రారంభించారు. కానీ.. దురదృష్టవశాత్తూ ఆమె ఈ నెల 20న చనిపోయింది. కానీ.. ఆమె కుటుంబ సభ్యులు, కొందరు రాజకీయనాయకులు దవాఖానలో తిరుగుతూ.. వైద్యులను, సిబ్బందిని దూషించారు. కానీ నిజానిజాలు తెలుసుకోకుండా ఆ పత్రిక ప్రభుత్వ దవాఖానల్లో పట్టించుకుంటలేరంటూ చిత్తం వచ్చినట్టుగా వార్తలు రాసేసింది.

కార్పొరేట్‌ను తలదన్నేలా సిద్దిపేట దవాఖాన

సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు ఒకసారి వెళ్లిచూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఏ కార్పొరేట్‌ దవాఖాన కూడా దీనిముందు దిగదుడుపే. ఈ దవాఖానలో అందుతున్న వైద్య సేవల నాణ్యతా ప్రమాణాలు, ఏర్పాటుచేసిన పరికరాలు, ల్యాబులు, సర్జరీ వ్యవస్థలను చూస్తే విస్మయం కలుగుతుంది. దేశంలోనే ఏ ప్రైవేటు వైద్యశాల కూడా దీనికి సాటిరాదు. ఇక్కడి వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, ల్యాబ్‌ టెక్నిషియన్ల నైపుణ్యం తిరుగులేదు. ఇలాంటి దవాఖానలో వైద్యసేవలు సక్రమంగా అందడం లేదంటే కనీసంగా కూడా ఎవరూ నమ్మరు. అలాంటి వైద్యశాలను దారుణంగా బద్నాంచేసేందుకు ఈ విషపత్రిక కుట్రచేసింది.

ఆపత్కాలంలో ఇలాగేనా వ్యవహరించేది?

ఎన్నికలప్పుడు రాజకీయాలు చేయవచ్చు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవచ్చు. కానీ ఒక విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు.. ఆపత్కాలం దాపురించినప్పుడు ఒకరికొకరు తోడై.. పేద ప్రజల ప్రాణాలను కాపాడటానికి కృషి చేయాల్సిన తరుణంలో తప్పుడు రాతలతో ప్రజలను భయాందోళనలకు గురిచేయడం ఎక్కడి దుర్మార్గం? రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ప్రాణాలే ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని దవాఖానలో అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించింది. అవసరమైనమేర మందులు, ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచింది. నయా పైసా ఖర్చు లేకుండా కరోనా రోగులకు ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్యం అందిస్తున్నది. రాత్రింబవళ్లు పనిచేస్తున్న వైద్యుల కష్టం ఈ పత్రికకు కనిపించడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే, హోం ఐసొలేషన్‌, మెడికల్‌ కిట్ల పంపిణీ, లాక్‌డౌన్‌ వంటివాటితో పాజిటివ్‌ కేసులు తగ్గాయి. మన రాష్ర్టాన్ని స్ఫూర్తిగా తీసుకొన్న కేంద్రం దేశవ్యాప్తంగా జ్వర సర్వే నిర్వహిస్తున్న విషయాన్ని ఈ పత్రిక గుర్తెరగడంలేదు.

నిందితుల అరెస్టు

సిద్దిపేట ప్రభుత్వ దవాఖానపై దాడి చేసి వైద్యులు, సిబ్బందిని అవమానపర్చి విధులకు ఆటంకపర్చిన రెండు కేసుల్లో నిందితులను శనివారం సిద్దిపేట వన్‌టౌన్‌ సీఐ శ్రీనివాస్‌ అరెస్టు చేశారు. సిద్దిపేట ప్రభుత్వ దవాఖాన కొవిడ్‌ ఐసొలేషన్‌ వార్డులో జరిగిన ఘటనలో ఒక కేసులో ఇద్దరిని, మరో కేసులో ముగ్గురిని అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించామని శ్రీనివాస్‌ తెలిపారు. మునీర్‌పాషా, ముక్తార్‌పాషా పరారీలో ఉన్నారని, వారిని పట్టుకుంటామని చెప్పారు.

అవాస్తవ ప్రచారం..

నిద్రపోతున్న రోగి బక్కారెడ్డి ఫొటో తీసి చనిపోయాడంటూ పెట్టారు. ఈ విషయంపై సిబ్బందితో మాట్లాడగా, అతను బతికే ఉన్నాడని చెప్పారు. అతని ఆక్సిజన్‌ లెవల్‌ ప్రస్తుతం 96శాతం ఉంది. బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ తప్పుడు ప్రచారం చేశారు. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వైద్య సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవద్దు.
జయశ్రీ, సిద్దిపేట ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌

ఆ వార్త తప్పే.. సారీ..

సదరు పత్రికలో వచ్చిన సిద్దిపేట దవాఖాన వార్తలపై విచారం వ్యక్తం చేస్తున్నాను. ఇలాంటివి మళ్లీ జరగకుండా మా పత్రికా సిబ్బందికి తగిన జాగ్రత్తలు ఇవ్వడం జరిగింది. వ్యక్తిగతంగా నేను సిద్దిపేటలో హరీశ్‌రావు చేసిన అభివృద్ధ్దిని ఇష్టపడుతాను.
వివేక్‌ వెంకటస్వామి, ఆ పత్రిక యజమాని

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విషపు రాతల విచ్చుకత్తులు

ట్రెండింగ్‌

Advertisement