ఎండాకాలంలో నిమ్మరసం తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవి తాపాన్ని తగ్గించి శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. విటమిన్ బీ, సీ, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ విషయాలు మనలో చాలామందికి తెలుసు. అయితే మరకలను పోగొట్టడంతో పాటు ఇంట్లో ఇంకా చాలా పనులకు నిమ్మరసం ఉపయోగపడుతుందని మీకు తెలుసా!
మార్కెట్లో దొరికే మస్కిటో కాయిల్స్, స్రేల వాసనలు చాలామందికి పడవు. వీటి వల్ల కొందరికి అలర్జీలు కూడా వస్తుంటాయి. అలాంటప్పుడు సహజసిద్ధంగా నిమ్మరసంతో దోమలు రాకుండా హోం రెమెడీని తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో నిమ్మరసం తీసుకుని అందులో కొన్ని లవంగాలు వేసి బెడ్రూం లేదా హాల్లో ఒక మూలకు పెడితే దోమల బెడద ఉండదు.
ఇంట్లో సువాసనకు రూం ఫ్రెష్నర్గా కూడా నిమ్మరసాన్ని వాడుకోవచ్చు. కొన్ని నీళ్లలో నిమ్మ తొక్క లేదా నిమ్మరసం వేసి మరిగించడం ద్వారా ఇల్లు మొత్తం సువాసన నిండుతుంది. చాలా ఫ్రెష్‌గా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది.
వంట గది, బాత్రూం శుభ్రపరచడానికి కూడా నిమ్మరసాన్ని ఉపయోగించవచ్చు. నిమ్మరసం, నీళ్లను సమపాళ్లలో ఒక సీసాలోకి తీసుకోవాలి. దాన్ని స్ప్రే చేస్తూ వంట గది, బాత్రూం, ఫ్రిజ్‌పై మరకలను శుభ్రం చేసుకోవచ్చు.
రోజూ కూరగాయలు, పండ్లు కట్ చేయడం వల్ల చాపింగ్ బోర్డుపై మరకలు అవుతుంటాయి. వాటిని మాములుగా శుభ్రం చేసినప్పుడు మరకలు పోవు. అలాంటప్పుడు నిమ్మతొక్కతో చాపింగ్ బోర్డును గట్టిగా రుద్ది శుభ్రం చేస్తే మరకలు పోతాయి.
క్రిములు, కీటకాల నివారణకు కూడా నిమ్మరసం ఉపయోగపడుతుంది. దీనికోసం ఏదైనా నూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి బాగా షేక్ చేసి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దాన్ని ఓ బాటిల్లో నింపి కావాల్సిన చోట స్ప్రే చేస్తే ఆ ప్రాంతంలోని కీటకాలను నివారించవచ్చు.
పసుపు పచ్చగా మారిన పళ్లను శుభ్రం చేయడంలో నిమ్మరసం చక్కగా ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమంతో పళ్లు శుభ్రం చేసుకోవాలి. అలా చేయడం వల్ల పళ్లు తెల్లగా మారి తళతళలాడుతుంటాయి.
యాపిల్స్ కట్ చేసినప్పుడు కలర్ మారిపోతుంటాయి. అయితే కట్ చేసిన యాపిల్‌పై కొద్దిగా నిమ్మరసం చల్లినట్లయితే చాలాసేపటి వరకు యాపిల్ తాజాగా ఉంటుంది.