మంగళవారం 26 జనవరి 2021
Telangana - Dec 30, 2020 , 01:25:52

ఉద్యోగనామ సంవత్సరం

ఉద్యోగనామ సంవత్సరం

  • ఫిబ్రవరి నుంచి వరుసగా నోటిఫికేషన్లు! 
  • వేగంగా నియామక ప్రక్రియ 
  • శాఖల వారీగా జాబితా 
  • పోలీస్‌, టీచర్‌ పోస్టులదే పెద్ద వాటా 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొత్త సంవత్సరంలో నిరుద్యోగుల పంట పండబోతున్నది. 2021 ఉద్యోగనామ సంవత్సరంగా మారునున్నది. రాష్ట్రవ్యాప్తంగా 50 వేల పోస్టులను భర్తీ చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. నియామక ప్రక్రియ ఫిబ్రవరి నుంచి మొదలవుతుందని మంగళవారం ప్రకటించారు. కరోనా లాక్‌డౌన్‌తో 2020 సంవత్సరం ఆసాంతం నిరుత్సాహంగా గడిచిందని, చివర్లో తీపి కబురు అందిందంటూ యువత హర్షం వ్యక్తం చేస్తున్నది. అభ్యర్థులు ఇప్పటికే ప్రిపరేషన్‌లో నిమగ్నమయ్యారు.  50వేల నియామకాల్లో పోలీస్‌, టీచర్‌ పోస్టులే అధికంగా ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. సుమారు 15వేల వరకు పోలీస్‌ సిబ్బందిని, 10వేల వరకు టీచర్‌ నియామకాలను చేపట్టే అవకాశం ఉన్నది. 

వరుసగా సమీక్షలు.. సమావేశాలు 

ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్‌ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ విద్య, ఆరోగ్యం, సంక్షేమ, తదితరశాఖల ఉన్నతాధికారులతో సమావేశమవుతున్నారు. ఆయా శాఖల్లోని ఖాళీల వివరాలు, భర్తీకి అనుసరించాల్సిన విధానంపై చర్చిస్తున్నారు. క్యాడర్ల వారీగా ఉన్న ఖాళీలు, వాటి భర్తీతో ప్రభుత్వంపై ఆర్థికభారం ఎంత పడే అవకాశం ఉన్నది? పదోన్నతులు చేపట్టాల్సిన అవసరం ఉంటుందా? న్యాయపరమైన ఇబ్బందులేమైనా వస్తాయా? అనే అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఇప్పటికే పలు శాఖల నుంచి ఖాళీల వివరాలు ఆర్థికశాఖకు చేరుకున్నాయి. వాటికి అనుగుణంగా జాబితాకు తుదిరూపు ఇస్తున్నారు. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ నేతృత్వంలో నియమించిన త్రిసభ్య కమిటీకి త్వరలో ఈ జాబితాను అందించనున్నారు. కమిటీ చర్చించిన తర్వాత ఆమోదం కోసం ఫైల్‌ను సీఎం కేసీఆర్‌కు పంపుతారు. 

శాఖాపరమైన నియామకాలకే మొగ్గు?

ఖాళీ పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా నిర్వహించాలా? లేదా శాఖల వారీగా నిర్వహించాలా? అన్న అంశంపై త్వరలో స్పష్టత రానున్నది. 50 వేల ఉద్యోగాలను వేగంగా భర్తీ చేయాలంటే శాఖాపరమైన నియామకాలు జరిపితే బాగుంటుందని ఉన్నతాధికారులు సూచిస్తున్నట్టు తెలిసింది. తద్వారా టీఎస్‌పీఎస్సీపై ఒత్తిడి తగ్గుతుందని అంటున్నారు. గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 వంటి ఉద్యోగాలు టీఎస్‌పీఎస్సీకి అప్పగించి, మిగతా పోస్టులను ఆయా శాఖల బోర్డుల ద్వారా నిర్వహించాలని సూచించినట్టు సమాచారం. ప్రధానంగా పోలీస్‌, టీచర్‌, వైద్యారోగ్య, వ్యవసాయ, ఉద్యానశాఖల్లో ఎక్కువగా ఖాళీలు ఉన్నట్టు సమాచారం. పోలీస్‌ పోస్టుల భర్తీకి స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, టీచర్‌ పోస్టుల భర్తీకి గురుకుల నియామకాల బోర్డులు, డీఎస్సీలు, వైద్యారోగ్యశాఖలో ఖాళీలకు ప్రత్యేక బోర్డులు ఉన్నాయి. ఆయా బోర్డుల ద్వారా నియామకాలు చేపడితే ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు.


logo